పండుగలపైనే ‘గృహోపకరణాల’ఆశలు.. డబుల్ డిజిట్ గ్రోత్‌పై అంచనాలు

By Nagaraju penumalaFirst Published Sep 30, 2019, 11:02 AM IST
Highlights

ఏడాది కాలంగా సేల్స్ లేక స్తబ్దుగా ఉన్న కన్జూమర్ డ్యూరబుల్స్ సంస్థలు ప్రస్తుత పండుగల సీజన్‌లో డబుల్ డిజిత్ గ్రోత్‌పై ఆశలు పెట్టుకున్నాయి.

న్యూఢిల్లీ: కొంతకాలంగా నిరాశావహంగా సాగుతున్న అమ్మకాలు, ఆర్థిక మందగమన పరిస్థితులపై ఏర్పడిన ఆందోళనల నేపథ్యంలో వస్తూత్పత్తి దారుల ఆశలన్నీ రాబోయే పండగల సీజన్‌ పైనే ఉన్నాయి. అక్టోబర్ నుంచి జనవరి వరకు సాగే ఈ సీజన్‌లోనైనా కనీసం రెండంకెల వృద్ధిని సాధించలేకపోతామా? అంటూ వారంతా చకోరపక్షుల్లా వేచి చూస్తున్నారు.

కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ పరిశ్రమ ఇటీవల తీవ్రంగా ఎదురీదుతోంది. ప్రధానంగా టీవీల అమ్మకాలు గణనీయంగా దిగజారాయి. ఒక్క వాషింగ్‌ మెషిన్లు తప్పితే మిగతా అన్ని గృహోపకరణాల అమ్మకాల్లోనూ నిశ్చల స్థితి నెలకొంది. గతేడాది మొత్తం విక్రయాల్లో ఏ మాత్రం కదలిక లేకుండా స్తబ్ధంగా ఉంది.

ఈ ఏడాదిలో గత మూడు నెలలూ తమకు మరిచిపోలేని కాలంగా ఉన్నదని కన్స్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌, అప్లయెన్సెస్‌ తయారీదారుల సంఘం (సియామా) అంటోంది. ఆగస్టులో అమ్మకాలు పూర్తిగా స్తబ్ధంగా ఉన్నాయని, అయితే సెప్టెంబర్ నెలలో మాత్రం స్వల్పంగా కదలిక కనిపించిందని సియామా ప్రెసిడెంట్‌ కమల్‌ నంది అన్నారు.

ఈ ఏడాది రుతుపవనాలు ప్రోత్సాహకరంగా ఉండడంతోపాటు ప్రభుత్వం ఇటీవల కార్పొరేట్‌ పన్ను 10 శాతం మేరకు తగ్గించడం, ఆర్బీఐ వరుసగా రెపో రేటు 1.10 శాతం మేరకు తగ్గించడంతో పెరిగిన బ్యాంకుల రుణ వితరణ కూడా తమలో ఆశలు రేకెత్తిస్తున్న అంశాలని సియామా వర్గాలంటున్నాయి.

ఈ చర్యలన్నింటి ఊతంతో కనీసం పండగల సీజన్‌ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి ఏర్పడవచ్చుని భావిస్తున్నామని సియామా ప్రెసిడెంట్‌ కమల్‌ నంది అన్నారు. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు పెరుగుతాయని వివిధ సంస్థలు ఆశిస్తున్నాయి.

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఇప్పటికే కొంత కదలిక కనిపించిందని, పండగల సీజన్‌ కొత్త వస్తువుల కొనుగోలుకు పవిత్రమైనది అన్న ప్రజల సెంటిమెంట్‌ కూడా తమకు కలిసి రావచ్చునని తయారీ వర్గాల వారు అంటున్నారు. ప్రధానంగా దీపావళి కాలంలో గృహోపకరణాల కొనుగోలుపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.

అమ్మకాలు పెరుగుతాయన్న ఆశలతో తయారీదారులందరూ అన్ని విభాగాల్లోనూ కొత్త మోడళ్లను తేవడంపై దృష్టి పెట్టారు. బ్రాండ్‌ ప్రచారంపై కూడా విశేషంగా ఖర్చు చేసే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే ప్రీమియం మోడళ్లపై ఆకర్షణీయ ఆఫర్లు ఇవ్వడంతోపాటు పలు రకాలైన డిస్కౌంట్లు, క్యాష్‌బాక్‌ ఆఫర్లు, తేలికపాటి ఈఎంఐ ఆఫర్లను సిద్ధం చేస్తున్నారని సమాచారం.

ఈ సీజన్‌లో తాము రెండంకెల వృద్ధిని ఆశిస్తున్నామని శామ్‌సంగ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజు పుల్లాన్‌ అన్నారు. ఇందుకోసం తాము రిటైల్‌ విభాగంపై పెట్టుబడిని 25 శాతం పెంచడంతో పాటు షాప్‌ ఇన్‌ షాప్‌, ఎక్స్‌పీరియెన్స్‌ షోరూమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఈ విభాగంలో గట్టి పోటీదారైన ఎల్‌జీ ఎలక్ర్టానిక్స్‌ ఈ సీజన్‌లో అమ్మకాల్లో 30 శాతం వృద్ధిని ఆశిస్తోంది. ఈ సీజన్‌లో రూ.5 వేల కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ హోమ్‌ అప్లయెన్సెస్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ బాబు తెలిపారు.

ఈ-కామర్స్‌ కంపెనీలు పండగల సీజన్‌లో భారీ ఎత్తున అమ్మకాలు సాగిస్తున్నా జీఎస్టీని ఎగవేస్తున్నాయని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య ఆరోపించింది. వారు ఈ మేరకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాస్తూ ఆ కంపెనీలు ఉత్పత్తుల వాస్తవ ధరలకు బదులుగా డిస్కౌంట్‌ ధరలను కోట్‌ చేసి భారీగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నాయని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వస్తోందని తెలిపారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

శనివారం నుంచి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరిట అమెజాన్‌ ప్రారంభించిన విక్రయాల్లో కేవలం 36 గంటల్లోనే రూ.350 కోట్ల విలువైన అమ్మకాల రికార్డును సాధించింది. అలాగే బిగ్‌ బిలియన్‌ డేస్‌ కింద తమ అమ్మకాలు రెండింతలు పెరిగాయని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. మార్కెట్లో మందగమనం ఉన్నా, ఈ సీజన్‌లో ఈ-కామర్స్‌ సంస్థలు రూ.35 వేల కోట్ల అమ్మకాలను సాధిస్తాయని అంచనాలు వెలువడ్డాయి.

 

click me!