వాటే చేంజ్! మొత్తం సొమ్ము చెల్లించేస్తా గానీ భారత్‌కు రాలేను

By telugu teamFirst Published Sep 28, 2019, 2:00 PM IST
Highlights

తానే నేరం చేయలేదని ఇప్పటివరకు వాదిస్తూ వచ్చిన మెహుల్ చోక్సీ.. తన ఆస్తులు, ఇతర సంస్థల నుంచి రావాల్సిన రుణాల నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కి చెల్లించేస్తానని వాదిస్తున్నాడు. కానీ తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున భారతదేశానికి రాలేనని, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వచ్చి విచారించుకోవచ్చునని సెలవిచ్చారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ను తన మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి రూ.13,500 కోట్లకు ముంచిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ కొత్త వాదన మొదలు పెట్టారు. గీతాంజలి జెమ్స్‌ కంపెనీకి రావలసిన రూ.8,567 కోట్ల వాణిజ్య బకాయిల నుంచి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)కు చెల్లించాల్సిన అప్పులన్నీ తీర్చేస్తానని ప్రకటించాడు. 

అక్రమ నగదు లావాదేవీల చట్టం (పీఎంఎల్‌ఏ) కింద తనపై నమోదైన కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జడ్జి ముందు వీసీ బర్డే ముందు ఈ విజ్ఞప్తి చేశాడు. ఇంకా కావాలంటే తన వ్యక్తిగత, తన నిర్వహణలోని కంపెనీల ఆస్తులతోపాటు తనకు, తన కంపెనీలకు రావలసిన బకాయిలను జప్తు చేసేలా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ను ఆదేశించాలని కోరాడు.
 
విచారణ కోసం భారత్‌ వచ్చేందుకు ఆరోగ్యం బాగోలేదన్న పాత వాదనను చోక్సీ మరోసారి పునరుద్ఘాటించాడు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరయ్యేందుకూ అనుమతించాలని కోరారు. ఈడీ అధికారులు యాంటిగ్వా వచ్చి తనను ప్రశ్నించేలా ఆదేశించాలని కూడా కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)ను మోసగించిన కేసులో చోక్సీ ప్రధాన నిందితుడు. చోక్సీని త్వరలోనే భారత్‌కు అప్పగిస్తామని యాంటిగ్వా ప్రధాని ప్రకటించిన రెండు రోజులకే చోక్సీ ఈ ప్రకటన చేయడం విశేషం. పీఎన్బీలో వేల కోట్ల మేర కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీకి చుక్కెదురైంది. 

అంటిగ్వాలో దాచుకున్నచోక్సీని భారత్‌కు అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆంటిగ్వా ప్రధాని గాస్టన్‌ బ్రోన్‌ తెలిపారు. 'అతడి అభ్యర్థనపై విచారణ మొత్తం పూర్తయిన వెంటనే భారత్‌కు అప్పగిస్తాం. కాకపోతే, ఇది కాస్త సమయం పడుతుంది. చోక్సీ నిజాయతీ లేని వ్యక్తని మాకు పూర్తి సమాచారం ఉంది. అతడి వల్ల మా దేశానికి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. అందుకే భారత్‌కు పంపేస్తాం’ అని గాస్టన్ బ్రోన్ చెప్పారు. 

‘అతడి మీద విచారణ జరిపేందుకు భారత్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. వారు (భారతీయ అధికారులు) ఇక్కడి రావచ్చు. వచ్చి అతడిపై విచారణ చేసుకోవచ్చు. మా ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పదు’ అని గాస్టన్ బ్రోన్ తెలిపారు.

‘భారత్‌ నుంచి వచ్చిన సమాచారం ప్రకారమే అతడికి పౌరసత్వం ఇచ్చాం. దీనిపై పూర్తి బాధ్యత వారిదే'అని గాస్టన్‌ బ్రోన్‌ అన్నారు. పీఎన్‌బీ కేసు నేపథ్యంలో చోక్సీని భారత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 'పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడి'గా ప్రకటించిన విషయం తెలిసిందే. పలు సాకులూ చూపుతూ ఆంటిగ్వాలోనో మకాం వేసిన చోక్సికి గోస్టన్‌ ప్రకటనతో పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టయిందని విశ్లేషకులు చెబుతున్నారు.

click me!