పెట్రోల్ ధరలతో పండుగ జోష్‌పై పిడుగు

By Arun Kumar PFirst Published Sep 18, 2018, 11:08 AM IST
Highlights

పెరుగుతున్న పెట్రో ధరల ప్రభావం పండుగ కొనుగోళ్లపై పడుతున్నది. రోజురోజుకూ తడిసి మోపెడవుతున్న ఇంధన భారం.. సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నది.

పెరుగుతున్న పెట్రో ధరల ప్రభావం పండుగ కొనుగోళ్లపై పడుతున్నది. రోజురోజుకూ తడిసి మోపెడవుతున్న ఇంధన భారం.. సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నది. దీంతో వ్యయ నియంత్రణ చర్యలకు దిగిన గృహస్తులు.. ఈ సీజన్ షాపింగ్‌ను తగ్గించుకునే దిశగా వెళ్తున్నారు.

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలకు పడిపోతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఎగబాకుతున్న క్రమంలో దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లూ మునుపెన్నడూ లేనివిధంగా ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. 

వాహనదారుల జేబులకు తూట్లు పొడుస్తున్న పెట్రో ఉత్పత్తులు.. అన్ని రకాల ద్రవ్యోల్బణాన్నీ ఎగదోస్తున్నాయి. ఈ పరిణామం మధ్యతరగతి జీవుల పండుగ కోర్కెలపై నీళ్లు చల్లుతున్నది. పెట్రో ఖర్చులను అధిగమించడానికి తమ ఇతరత్రా ఖర్చులను ఫణంగా పెట్టాల్సి వస్తున్నదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు లోకల్‌సర్కిల్స్ అనే ఓ పౌర సమన్వయ వేదిక తమ తాజా అధ్యయనంలో తెలియజేసింది.

పండుగ సీజన్ సమీపిస్తున్నందున ప్రతీ ఒక్కరూ ఈ సమయంలో షాపింగ్ చేయాలని కోరుకుంటారు. బట్టల దగ్గర్నుంచి ఇంట్లోని వస్తువులదాకా కొత్తవి కొనాలని ఆశపడుతుంటారు. కానీ చుక్కల్ని తాకుతున్న ఇంధన ధరలు ఈ ఉత్సాహాన్నంతటినీ మింగేస్తున్నాయి అని లోకల్‌సర్కిల్స్ పేర్కొన్నది.

సగటు వేతనజీవి నట్టింట్లో పెట్రో బాంబు పెద్ద అలజడినే సృష్టించింది. సాధారణంగా ఇంటిల్లిపాది పండుగపూట ఆనందంగా గడుపాలని ఎవరైనా ఆశిస్తారు. ఆ రోజు బయటకు షికారుకెళ్లాలని, షాపింగ్ చేసి సరదాగా ఓ సినిమా చూడాలని, వస్తూవస్తూ ఓ హోటల్‌లో కడుపునిండా తినాలని.. ఇలా ఎన్నో ప్రణాళికల్ని ముందుగానే వేసుకుంటారు.

సెలవు కావడం, పిల్లలు, పెద్దలు ఒక్కచోటికి చేరడంతో ప్రతీ కుటుంబం ఇలాగే ఆలోచిస్తుంది మరి. కానీ ఈసారి పండుగకు ఇవేవీ ఉండేలా లేవంటూ తమ అధ్యయనంలో 78 శాతం మంది గృహస్తులు నిట్టూర్చినట్లు లోకల్‌సర్కిల్స్ వెల్లడించింది.

కొద్దిరోజుల తేడాతో వచ్చే దసరా, దీపావళి పండుగలకు మార్కెట్‌లో ఉండే వ్యాపార అంచనాలు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా టెలివిజన్, రిఫ్రిజిరేటర్, వాషింగ్‌మెషీన్, ఏసీలు, మిక్సర్లు, గ్రైండర్లు వంటి గృహోపకరణాల కొనుగోళ్లకు అంతా పండుగ సీజన్‌నే ఎంచుకుంటారు. పెద్ద పండుగలు కావడంతో సహజంగానే ఆయా సంస్థలూ తమ ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తాయి. దీంతో అత్యధికులు షాపింగ్‌కు ఆసక్తి కనబరుస్తారు. 

కంపెనీలూ తమ ఉత్పత్తులపై ఆఫర్ల పేరిట ధరలను తగ్గిస్తాయి. ఫలితంగా వ్యాపార అంచనాలు అమాంతం పెరుగుతాయి. అయితే గత నెల రోజులుగా రోజూ పెరుగుతున్న పెట్రో ధరలు ద్రవ్యోల్బణానికి దారితీశాయి. దీంతో ఆదాయం తగ్గి.. పెరిగిన ఖర్చులు.. ఈ సీజన్ గృహోపకరణాల కొనుగోళ్లను విరమించేలా చేశాయని సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు.

పెరుగుతున్న పెట్రో ధరలు ప్రధానంగా ఆటో అమ్మకాలను ప్రభావితం చేయవచ్చన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో కార్లు, బైకుల విక్రయాలు అంతగా ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. ధరలు దిగివస్తేనే సొంత వాహనాలపై దృష్టి పెడుతామని పలువురు గృహస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ పండుగకు వాహన కొనుగోళ్లను వాయిదా వేసేస్తున్నారు.

పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పెరిగాయి. మంగళవారం సరికొత్త రికార్డును చేరుతూ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 10 పైసలు పెరిగి రూ.82.25కు, డీజిల్ 9 పైసలు అందుకుని రూ.73.96ని తాకాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు 10 పైసలు ఎగబాకి రూ.87.21, డీజిల్ 10 పైసలు అందిపుచ్చుకుని రూ.80.44 వద్ద స్థిరపడ్డాయి. ముంబైలోనైతే పెట్రోల్ ధర రూ.89.44నుంచి 89.63కు, డీజిల్ ధర రూ.78.51కి చేరుకున్నది. మహారాష్ట్రలో చాలాచోట్ల పెట్రోల్ ధర రూ.91 దాటేయడం గమనార్హం.

click me!