మార్కెట్లో మొదలైన కోలా వార్.. రిలయన్స్ కాంపా కోలా ఎంట్రీతో కూల్ డ్రింక్ ధరలను తగ్గించిన కోకాకోలా..

By Krishna AdithyaFirst Published Mar 17, 2023, 3:50 PM IST
Highlights

కాంపా కోలాతో సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంట్రీ ఇవ్వడంతో కోలా వార్ కు తెరలేచింది. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్స్ అయిన కోకాకోలా,పెప్సీ రిలయన్స్ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రాబోయే సమ్మర్ ను దృష్టిలో ఉంచుకొని కోకాకోలా కూల్ డ్రింక్స్  పై ధరలను తగ్గించేందుకు సిద్ధం అయిపోయింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్  ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తన వ్యాపారాన్ని నిరంతరం విస్తరిస్తున్నారు. గత సంవత్సరం కోలా మార్కెట్లోకి ప్రవేశించడానికి రిలయన్స్ అత్యంత ప్రసిద్ధ బ్రాండ్ అయిన కాంపా కోలాను స్వాధీనం చేసుకొని మార్కెట్లోకి, మూడు ఫ్లేవర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. హోలీ సందర్భంగా కాంపా కోలా మార్కెట్‌లోకి బలమైన ఎంట్రీ ఇచ్చింది. దీంతో రాబోయే సమ్మర్ ను దృష్టిలో ఉంచుకొని కోలా మార్కెట్లో ధరల యుద్ధం ప్రారంభమైంది. కాంపా కోలా పోటీని తట్టుకునేందుకు ఇతర కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించడం ప్రారంభించాయి.

కాంపా కోలా డీల్‌ను రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 2022లో ప్యూర్ డ్రింక్ గ్రూప్ నుండి రూ.22 కోట్లకు చేసింది. ఈ డీల్ తర్వాత, ముందుగా దీపావళికి ఉత్పత్తిని లాంచ్ చేయాలనే ప్లాన్ చేసింది, కానీ అది హోలీ 2023 వరకు లాంచింగ్ పొడిగించారు. ఇటీవలే, ఈ 50 ఏళ్ల ఐకానిక్ పానీయాల బ్రాండ్ కాంపా కోలా ఆరెంజ్, లెమన్  కోలా ఫ్లేవర్లలో మార్కెట్లోకి పరిచయం చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న పెప్సీ, కోకా-కోలా  స్ప్రైట్‌లతో ఇది ప్రత్యక్షంగా పోటీ పడనుంది. 

కాంపా కోలా దెబ్బకు ధరను తగ్గించిన కోకా కోలా

కాంపా కోలా  మూడు రుచులతో  మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత, కోలా మార్కెట్‌ను ఆధిపత్యం చేసే ఇతర కంపెనీలపై ఒత్తిడి కనిపించడం ప్రారంభమైంది. ఇంతలో సమ్మర్ ప్రవేశిస్తున్న కారణంగా   శీతల పానీయాల డిమాండ్ పెరగనుంది. దీంతో కోకా-కోలా దాని ఉత్పత్తుల ధరలను తగ్గించాలని నిర్ణయించుకుంది, బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం, కంపెనీ 200 ఎంఎల్ బాటిల్ ధరను రూ. 5 తగ్గించింది.

ఈ రాష్ట్రాల్లో ధర తగ్గింపు

కోకాకోలా కంపెనీ ధర తగ్గింపు నిర్ణయం తర్వాత మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో గతంలో రూ.15గా ఉన్న 200 ఎంఎల్ బాటిల్ ఇప్పుడు రూ.10కి తగ్గింది. దీనితో పాటు, కోకా కోలా గాజు సీసాలు ఉంచడానికి రిటైలర్లు చెల్లించే క్రేట్ డిపాజిట్ కూడా మాఫీ చేశారు. ఇది సాధారణంగా రూ. 50 నుండి రూ. 100 వరకు ఉంటుంది.

గ్రేట్ ఇండియన్ టెస్ట్ బ్యాంగ్‌తో కాంపా కోలా రీ ఎంట్రీ..

కాంపా కోలా సాఫ్ట్ డ్రింక్స్ విభాగంలో భారతదేశపు స్వంత బ్రాండ్. ప్యూర్ డ్రింక్ గ్రూప్ 1949 నుండి 1970ల ప్రారంభం వరకు భారతదేశంలో కోకా-కోలా  పంపిణీదారుగా ఉంది. ఆ తరువాత, కోకా-కోలా దేశం నుండి నిష్క్రమించిన తర్వాత, ప్యూర్ డ్రింక్స్ దాని స్వంత బ్రాండ్ కాంపా కోలాను ప్రారంభించింది  చాలా తక్కువ సమయంలోనే ఈ రంగంలో అగ్ర బ్రాండ్‌గా అవతరించింది. దాని స్లోగన్ 'ది గ్రేట్ ఇండియన్ టేస్ట్' ఆ సమయంలో బాగా ప్రాచుర్యం పొందింది. కానీ 90లలో కోకాకోలా, పెప్సీ ఇండియన్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత, కాంపా కోలా సేల్స్ పడిపోయి. నెమ్మదిగా కనుమరుగు అయ్యింది. అయితే  ఇప్పుడు కాంపా కోలా ఇండియన్ మార్కెట్లోకి రిలయన్స్  బలమైన రీఎంట్రీ ఇవ్వడం విశేషం.

click me!