
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా IPO ప్రారంభ తేదీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ మార్కెట్ల మారిన పరిస్థితుల కారణంగా, ప్రభుత్వం ఐపీఓను కొంతకాలం వాయిదా వేసింది. LIC IPO ఏప్రిల్ 2022లో ప్రారంభిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై ప్రభుత్వం నుండి ఇంకా ఏమీ స్పష్టత రాలేదు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న వార్తల ప్రకారం..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా IPOను ఈ నెలలో ఏప్రిల్‌లోనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని లైవ్ మింట్ పోర్టల్ రిపోర్ట్ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు భారత స్టాక్ మార్కెట్లో ఉన్నంత అనిశ్చితి ఇప్పుడు లేదని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు, ప్రపంచ మార్కెట్ల పరిస్థితి కూడా కొంత సౌకర్యవంతంగా మారిందని పేర్కొంది.
చమురు ధరలు పెరగడం, ముడిసరుకు రేట్లు పెరగడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం యొక్క ప్రభావాలు వంటి అంతర్జాతీయ కారకాలచే భారత బీమా మార్కెట్ అంత ప్రభావితం కాలేదని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఎల్‌ఐసి ఐపిఓ గురించి అవగాహన ఉన్న ఒక అధికారి మాట్లాడుతూ, ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారుల గురించి ఆందోళన చెందుతోందని, కానీ స్టాక్ మార్కెట్ లో ఈ రోజు ఉన్న పరిస్థితులు రేపు మారవచ్చు. భవిష్యత్తులో మరేదైనా పెద్ద ఈవెంట్ ఉండవచ్చు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని, త్వరలో ఎల్‌ఐసి ఐపిఓను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అయితే ఐపిఓ ప్రారంభానికి సంబంధించిన ప్రశ్నకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు.
ఇదిలా ఉంటే డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ ప్రకారం 31.6 కోట్ల షేర్ల అమ్మకం ద్వారా రూ. 60 వేల కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ ప్లాన్. మే 12 దాకా ఎల్ఐసీ ఐపీఓ తెచ్చేందుకు తుది గడువుంది. ఆలోపు పూర్తయితే సెబీ వద్ద మరోసారి పేపర్లు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. సెబీ అనుమతి గడువు ముగిసేలోపే ఐపీఓను తేవాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఎంబెడ్డెడ్ వాల్యూతో పోలిస్తే ఒకటిన్నర రెట్లు వాల్యుయేషన్‌ను ఎల్ఐసీ కోరుకుంటోంది.
ప్రభుత్వం మరింత వాటాను విక్రయించవచ్చు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ) ద్వారా తన 5 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం మొదట చెప్పింది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఎల్‌ఐసీ వాటాను 7.5 శాతం వరకు విక్రయించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం 5.5 నుండి 6.5 శాతం మధ్య మాత్రమే విక్రయించగలదు. 7.5% కంటే ఎక్కువ వాటాలను విక్రయించడానికి ప్రభుత్వం వాటా విక్రయ పత్రాలను దాఖలు చేయాలి.
దీనిపై మర్చంట్ బ్యాంకర్లు ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పెన్షన్ ఫండ్స్, సావరిన్ ఫండ్స్, ఇతర పెట్టుబడిదారుల వైఖరి, బ్యాంకర్లు తయారుచేసిన యాంకర్ బుక్ ఆధారంగా మాత్రమే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుండి ఉత్పన్నమయ్యే పరిస్థితిని స్టాక్ మార్కెట్లపై దాని ప్రభావాన్ని అంచనా వేసిన తరువాత, ఈ దేశంలోని అతిపెద్ద భీమా సంస్థ యొక్క IPO పరిమాణాన్ని 5% కంటే ఎక్కువ పెంచడంపై నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.