ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు నిర్వహించే సంప్రదాయ హల్వా వేడుక బుధవారం జరిగింది. ఇక ఇప్పటినుంచి లాకిన్ పీరియడ్ మొదలవుతుంది. అంటే ఏంటంటే...
ఢిల్లీ : బడ్జెట్ 2024కి సంబంధించిన పత్రాల సంకలనం ప్రారంభానికి గుర్తుగా బుధవారం నార్త్ బ్లాక్‌లో సాంప్రదాయ 'హల్వా వేడుక' జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిసన్‌రావ్ కరాద్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
హల్వా వేడుక ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు నిర్వహించే సంప్రదాయం, బడ్జెట్‌కు సంబంధించిన వివిధ పత్రాల ముద్రణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం అవ్వడానికి గుర్తుగా హల్వా వేడుక నిర్వహిస్తారు. బడ్జెట్ ను, ప్రభుత్వ వార్షిక ఆర్థిక నివేదికను తయారు చేయడంలో సహాయం చేసిన మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బందికి అధికారికంగా వీడ్కోలు పలిచే కార్యక్రమం.
బడ్జెట్ తయారీ ప్రక్రియ ఏంటీ .? 'హల్వా వేడుక' ఎందుకు నిర్వహిస్తారు...
దీని తరువాత.. బడ్జెట్‌తో సంబంధం ఉన్న ఉన్నతాధికారులు నిర్ణీత 'లాక్-ఇన్' వ్యవధిలో ప్రవేశిస్తారు. వీరంతా ఇప్పటినుంచి ఆర్థికమంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టేంత వరకు.. కుటుంబానికి, బాహ్యప్రపంచానికి దూరంగా.. ఎవరితోనూ కలవకుండా ఐసోలేట్ అవుతారు. ఆర్థికమంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటారు. బడ్జెట్ గురించిన గోప్యతను కాపాడడానికి ఇలా చేస్తారు.
ఆర్థిక కార్యదర్శి T.V. సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, దీపం కార్యదర్శి తుహిన్ కాంత పాండే, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, సీబీఐసీ చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్, సీబీడీటీ చైర్మన్ నితిన్ కుమార్ గుప్తా, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఇతర అధికారులు, సిబ్బంది బడ్జెట్ తయారీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంకలన ప్రక్రియ కూడా ఉన్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత బడ్జెట్ పత్రాలు ఆండ్రాయిడ్, యాపిల్ ఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో “యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్”లో అందుబాటులో ఉంటాయి. 2024 ఏప్రిల్-మేలో సాధారణ ఎన్నికలు జరగనున్నందున 2024 బడ్జెట్ పూర్తి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ అవుతుంది.
వేడుకలో భాగంగా, సీతారామన్ కూడా బడ్జెట్ ప్రెస్‌లో పర్యటించారు. సంబంధిత అధికారులకు తన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సన్నాహాలను సమీక్షించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.