ఇండియాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ వ్యాపారవేత్త, బయోకాన్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు
బెంగళూరు: ఇండియాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ వ్యాపారవేత్త, బయోకాన్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. విషమ పరిస్థితుల్లోకి వెళ్లే వారి సంఖ్యను నియంత్రించగలిగినంత వరకు భారత్ కరోనా వైరస్‌ను కట్టడి చేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య గురించి ఆలోచించేకంటే దీని తీవ్రతను తగ్గించడంపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. వైరస్ వ్యాప్తిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిరణ్ మజుందార్ స్పష్టం చేశారు.
రోగులపై వైరస్ ఎంత మేరకు ప్రభావం చూపుతుందన్నదే పరిగణించాల్సిన అంశమని కిరణ్ మజుందార్ పేర్కొన్నారు. ఇక్కడ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐసీయూలన్నీ నిండిపోయేవన్నారు.
దేశంలోని ఆసుపత్రుల ఐసీయూలు నిండిపోనంత కాలం భయపడాల్సిన అవసరం లేదని కిరణ్ మజుందార్ స్పష్టం చేశారు. అటు వైరస్ వ్యాప్తి చెందకుండా ఇంకా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
undefined
కొవిడ్-19ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టిందని కిరణ్ మజుందార్ పేర్కొన్నారు. అయితే, వైరస్ నిర్ధారణ పరీక్షలు మాత్రం తగినంత స్థాయిలో జరుగడం లేదన్నారు. దీనిపై పోరుకు ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ముందే ఆహ్వానించి ఉంటే బాగుండేదన్నారు.
Also read:ఇన్వెస్టర్లకు పీడకల: రూ.37.60 లక్షల కోట్లు హాంఫట్.. సూచీలన్నీ డమాల్
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రైవేట్ సంస్థల సహాయాన్ని తీసుకోవడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందన్నారు. పరిస్థితిని ఒంటిరిగా చక్కదిద్దేందుకు ప్రయత్నించిందని, అయితే సరిపడా నిధులు లేకపోవడంతో అది కుదరక ఇప్పుడు ప్రైవేట్ రంగానికి అనుమతిచ్చిందని మజుందార్ షా పేర్కొన్నారు.
ఇలా ఆలస్యం చేయడం ప్రభుత్వ పొరపాటు అని కిరణ్ మజుందార్ షా అభిప్రాయ పడ్డారు. అయితే ప్రస్తుతం ప్రైవేటు సంస్థలు కూడా రంగంలోకి దిగి ఆసుపత్రులను అందుబాటులోకి తేవడమే కాకుండా కరోనా బాధితులకు అన్ని విధాలుగా సాయాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు.
అటు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజలు 21 రోజుల లాక్‌డౌన్‌ను తప్పకుండా పాటించాలని కిరణ్ మజుందార్ సూచించారు. వైరస్‌ను కట్టడి చేయడానికి విధించిన ఆంక్షల అమలులో కేరళ ప్రభుత్వం పనితీరు భేష్షుగ్గా ఉన్నదని కొనియాడారు.
అయితే కరోనా సంక్షోభంతో ప్రజారోగ్యం విషయంలో ఇతరులపై ఆధార పడవద్దన్న సంగతి అర్థమైందని కిరణ్ మజుందార్ అన్నారు. ఇతర రంగాల్లో మాదిరిగా ఆరోగ్య రంగంపై భారత్ ఇప్పటి వరకు తగినంత పెట్టుబడులు పెట్టలేదని గుర్తు చేశారు. ఇప్పుడైనా ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్న సత్యం తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్‌పై పోరుకు అపోలో హాస్పిటల్స్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ స్టే-ఐ’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కిరణ్ మజుందార్ మీడియాతో మాట్లాడారు. తమ సంస్థ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన కిట్లను ఉచితంగానే పంపిణీ చేస్తుందన్నారు.
అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం వినూత్న ప్రయోగం చేపట్టింది. ఆసుపత్రుల్లో రూమ్స్ దొరకని పరిస్థితి ఏర్పడితే ప్రత్యామ్నాయంగా హోటళ్లలో గదులను బాధితులకు ఇచ్చేందుకు ‘ప్రాజెక్ట్ స్టే-ఐ’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
అపోలో హాస్పిటల్స్ చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఓయో రూమ్స్, జింజెర్, లెమన్ ట్రీ హోటల్స్ కలిసి 5000 హోటల్ గదులను సమకూరుస్తాయి. వీటిలో బెడ్స్ ‘ఐసోలేషన్ వార్డు‘లుగా తీర్చి దిద్దుతారు. అపోలో హాస్పిటల్స్ నెట్ వర్క్ సారథ్యంలో టెలీ మెడిసిన్ పద్దతిలో వైద్య సేవలందిస్తారు.
ఈ గదుల్లో వసతుల కల్పనకు అయ్యే ఖర్చును భరించడానికి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), డాయిష్ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ముందుకు వచ్చాయి. ఈ హోటల్ గదుల్లోని కరోనా బాధితులకు ఆహార సరఫరా సేవలను ఉచితంగా అందించడానికి ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో సంసిద్ధత వ్యక్తంచేసింది.
బాధితుల నుంచి టెలీ మెడిసిన్ సేవలకు చార్జీలు వసూలు చేయబోమని అపోలో హాస్పిటల్స్ వెల్లడించింది. కేవలం ఔషధాల ఖర్చు మాత్రమే వసూలు చేస్తామని తెలిపింది. ఇప్పటికే 500 పడకలను సిద్ధం చేశామన్నారు. ఇక వారానికి 50-100 పడకలు సిద్ధం చేస్తామని హాస్పిటల్స్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి చెప్పారు.
అపోలో హాస్పిటల్స్ ‘ప్రాజెక్టు స్టే-ఐ’ స్కీమ్ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్ కతా నగరాల్లో అందుబాటులోకి రానున్నది. ఈ నగరాల పరిధిలో తమకు గల హోటల్ గదుల్లో సగం ఈ ప్రాజెక్టుకు ఉచితంగా కేటాయిస్తామని ఓయో సీఈఓ రితేశ్ అగర్వాల్ చెప్పారు. లెమన్ ట్రీ హోటల్స్, జింజెర్ హోటల్స్ మాత్రం ఒక్కో గదికి కొంత రుసుము చార్జీ చేస్తాయి.