FD vs SIP: FD చేయడం మంచిదా? SIP బెటరా? గత 10 సంవత్సరాల్లో ఏది ఎక్కువ లాభాలనిచ్చిందో తెలుసా?

Published : Jun 18, 2025, 06:31 PM IST
FD vs SIP

సారాంశం

భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) చేయాలా? లేక సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లో పెట్టుబడి పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఇన్వస్ట్‌మెంట్ ప్లానో వివరంగా ఇప్పుడు చూద్దాం.  

లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకొనే వారు రెండు మార్గాలను ఎంచుకుంటారు. అవి ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు (SIP). వీటిలో ఏది నిజంగా ఎక్కువ లాభాన్ని ఇచ్చిందో తెలుసుకోవడం పెట్టుబడిదారులకు చాలా ముఖ్యం. గత 10 సంవత్సరాలలో (2015–2025) FD, SIPల రాబడులను గణాంకాల ఆధారంగా విశ్లేషిస్తే ఎందులో పెట్టుబడి పెట్టడం కరెక్టో తెలుస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

FD అంటే ఏమిటి? 

ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే స్థిరమైన పెట్టుబడికి ముందే నిర్ణయించే వడ్డీ రేటు అన్నమాట. లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టాలనుకొనే వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది ఒక భద్రమైన ఎంపిక. పెద్ద వయసు ఉన్న వారు, తక్కువ రిస్క్‌ను కోరే వారు ఎక్కువగా FDలపై ఆధారపడతారు.

2015లో FDలపై వడ్డీ రేట్లు 7.5%–8.5% వరకు ఉన్నాయి. 2017 తర్వాత ఆ రేట్లు తగ్గుతూ వచ్చాయి. COVID-19 సమయంలో FD వడ్డీ రేట్లు కనిష్టంగా 4.5%కు పడిపోయాయి. 2023 తర్వాత వడ్డీ రేట్లు మళ్లీ 6.5%–7.5% వరకు మెరుగయ్యాయి.

ఉదాహరణకు 2015లో రూ.1,00,000ను సగటున 8.25% వడ్డీ రేటుతో FDలో పెట్టుంటే, 2025 నాటికి అది రూ.2.21 లక్షలుగా మారేది. అంటే లాభం రూ.1.21 లక్షలు అన్నమాట. 

SIP అంటే ఏమిటి? 

SIP(సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) అనేది ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టే పెట్టుబడి పద్ధతి. ఎక్కువగా ఇది ఈక్విటీ ఫండ్స్‌లో ఉంటాయి. మార్కెట్‌కు అనుసంధానమై ఉండటంతో అధిక రాబడులు లభించే అవకాశం ఉంది.

ఉదాహరణకు 2015లో ఒక SIP ప్రారంభించి ప్రతి నెలా రూ.1,000 SIPగా పెట్టినట్లయితే సగటున 12% CAGR రాబడి లభించింది అనుకుంటే  2025 నాటికి మిగిలే మొత్తం రూ.2.35 లక్షలు అవుతుంది. అంటే పెట్టిన మొత్తం రూ.1.2 లక్షలు అయితే వచ్చిన లాభం రూ.1.15 లక్షలు.

ఇక్కడ FDతో పోల్చితే SIP తక్కువ పెట్టుబడి నుంచే అదే స్థాయి లేదా కొంచెం ఎక్కువ రాబడిని ఇచ్చింది. అలాగే SIP పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాని FDకి పన్ను ప్రయోజనాలు ఉండవు.

రూ.5,000 SIP vs రూ.6 లక్షల FD గణాంకాలతో పోలిక ఎలా ఉంటుందంటే.. 

FD డేటా:

మొత్తం: రూ.6,00,000

కాలం: 10 సంవత్సరాలు

వడ్డీ రేటు: 6.75%

ఫలితంగా వచ్చే మొత్తం: రూ.8.33 లక్షలు

లాభం: రూ.2.33 లక్షలు

SIP డేటా:

నెలకు రూ.5,000 అంటే 10 ఏళ్లకు రూ.6,00,000

CAGR: 12%

ఫలితంగా వచ్చే మొత్తం: రూ.11.6 లక్షలు

లాభం: రూ.5.6 లక్షలు

ఈ గణాంకాల ప్రకారం SIP రెండింతలకుపైగా లాభాన్ని FDతో పోల్చితే ఇచ్చింది.

ఏది రిస్క్, ఎక్కడ భద్రత లభిస్తుంది?

FDలు అంటే బ్యాంక్‌లు ఇస్తున్న భద్రమైన సాధనాలు. DICGC ద్వారా రూ.5 లక్షల వరకు భద్రత ఉంది. మార్కెట్ రిస్క్ లేని FDలు పాత తరాల వారికి సరిపోతాయి.

కానీ SIPలు మార్కెట్‌కు అనుసంధానమై ఉండటంతో ఒడిదొడుకులు ఉంటాయి. అయినా 7–10 సంవత్సరాల కాలవ్యవధిలో ఈ ఒడిదొడుకులు సమతుల్యతకు వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు SIPలు ఆదాయ పరంగా ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి.

పన్నుల ప్రభావం ఎందులో ఎక్కువ?

FDపై వచ్చిన వడ్డీ ఆదాయం పూర్తి స్థాయిలో పన్ను విధిస్తారు. మీ ఆదాయపు స్లాబ్‌ను బట్టి 20%–30% వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

అయితే SIPలపై, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయినట్లయితే 1 సంవత్సరానికి మించి ఉండే లాభంపై మాత్రమే 10% LTCG (Long Term Capital Gains) పన్ను ఉంటుంది. పైగా సంవత్సరానికి రూ.1 లక్ష వరకు లాభం పన్ను మినహాయింపు లభిస్తుంది.

ద్రవ్యోల్బణంపై ప్రభావం

ద్రవ్యోల్బణం వాస్తవ ఆదాయాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణకు FDపై వడ్డీ రేటు 6.5%, ద్రవ్యోల్బణం 6% ఉంటే వాస్తవ ఆదాయం కేవలం 0.5%. కానీ SIPలు 10%–12% రాబడి ఇస్తూ ద్రవ్యోల్బణాన్ని మించి ఆదాయం కలిగించగలవు.

గత 10 ఏళ్లలో దేశంలో సగటు ద్రవ్యోల్బణం 5%–6% ఉండగా, SIPలు ఎక్కువ లాభం ఇచ్చాయి.

ఫైనల్‌గా FD మంచిదా? SIP మంచిదా?

FDలు భద్రత కలిగిన స్థిర ఆదాయాన్ని ఇస్తాయి. SIPలు ఎక్కువ రాబడి, తక్కువ పన్ను భారం కలిగిన పెట్టుబడి మార్గాలు. 

FDలు చిన్న చిన్న అవసరాలకు సరిపోతాయి. SIPలు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు మేలు చేస్తాయి.

ఎక్కువ లాభాలు పొందాలనుకొనే పెట్టుబడిదారులు ఈ రెండింటినీ కలిపి ఉపయోగిస్తున్నారు. మల్టిపుల్ పెట్టుబడి వ్యూహాల్లో, అత్యవసర నిధులకు FD, సంపద సృష్టికి SIP ఉపయోగపడతాయి.

దీర్ఘకాలిక దృష్టితో చూస్తే SIPలు FDల కంటే మెరుగైన పెట్టుబడి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?