కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం రూ.2 వేల నోట్లపై బ్యాంకులకు ఏ ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. చెలామణీలో నగదు తగ్గిపోవడంతో నోట్ల రద్దు సమయంలో రూ.2 వేల నోటును తీసుకొచ్చారు.
న్యూఢిల్లీ: రూ.2 వేల నోట్ల చెలామణీపై గందరగోళం నెలకొంది. ఒకవైపు ఈ నోట్లు రద్దవుతాయని వార్తలు వస్తూ ఉంటే.. మరోవైపు అటువంటిదేమీ లేదని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు రూ.2000 నోట్ల ప్రింటింగ్ ఆపేశామని ప్రకటించింది. కొన్ని బ్యాంకులు తమ ఏటీఎంల నుంచి 2 వేల నోట్లు ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
ఇండియన్ బ్యాంక్ అయితే రూ.500, రూ.200, రూ.100 నోట్లనే ఏటీఎంల్లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. మరిన్ని బ్యాంకులు అదే బాట పట్టనున్నాయని తెలుస్తోంది. దీంతో రూ.2 వేల నోట్ల రద్దుపై గందరగోళం అలాగే కొనసాగుతోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం రూ.2 వేల నోట్లపై బ్యాంకులకు ఏ ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. చెలామణీలో నగదు తగ్గిపోవడంతో నోట్ల రద్దు సమయంలో రూ.2 వేల నోటును తీసుకొచ్చారు. ఈ నోటును రద్దు చేస్తారనే రూమర్లు మూడేళ్లుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
రూ.2 వేల నోటు వచ్చిన కొత్తలోనైతే ఆ నోట్లో చిప్స్ ఉన్నాయని, ఎవరి దగ్గర ఉన్నా తెలిసిపోతుందనే రూమర్ వ్యాపించింది. రూ.2 వేల నోటును రద్దు చేయడం ఖాయమనే వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో రౌండ్లు కొడుతూనే ఉన్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి.
డీమానిటైజేషన్ టైంలో చలామణీలో నుంచి పాత రూ.1000, రూ.500 నోట్లు వెనక్కి తీసుకోవడంతో, ప్రజలు బాగా తిప్పలు పడ్డారు. పాత నోట్లకు బదులు ఆర్బీఐ వెంటనే సరికొత్త రూ.2,000, రూ.500 నోట్లను చలామణిలోకి తెచ్చింది.
అయితే ఇప్పుడు రూ.2,000 నోట్ల చలామణి కూడా తగ్గిపోతోంది. హై డినామినేషన్ కరెన్సీని దశల వారీగా తీసివేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్టు పీటీఐ వార్తా సంస్థ ఓ వార్తాకథనం రాసింది.
బ్యాంక్ ఏటీఎంలు రూ.2,000 నోట్లకు బదులు రూ.500 నోట్లను పంపిణీ చేయడం ప్రారంభించాయి. అధికారికంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ అడగకపోయినా, బ్యాంకులు రూ. 2 వేల నోట్ల చలామణీని తగ్గించుకుంటున్నాయి.
కస్టమర్ల సౌకర్యం కోసమే చిన్న డినామినేషన్ నోట్లను ఏటీఎంలలో ఉంచుతున్నట్టు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని బ్యాంక్‌లు ఇప్పటికే తమ ఏటీఎంలను దానికి అనుగుణంగా రికాలిబ్రేషన్ చేయడం ప్రారంభించాయి. ఇతర బ్యాంక్‌లు కూడా ఇదే పాటిస్తున్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి.
ఏటీఎంలలో రూ.2,000 నోట్లను హోల్డ్ చేసే క్యాసెట్స్‌ను, రూ.100 లేదా రూ.200 డినామినేషన్ నోట్లతో రీప్లేస్ చేస్తున్నట్టు ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్ రిపోర్ట్ చేసింది. ఏటీఎంలలో ఉండే నాలుగు క్యాసెట్లలో మూడింటిని రూ.500 నోట్లతో, నాలుగో దాన్ని రూ.100 లేదా రూ.200 నోట్లతో నింపుతున్నట్టు పేర్కొంది.
రూ.2,000 నోట్లను హోల్డ్ చేసే క్యాసెట్లను మారుస్తున్నట్టు, ఈ ప్రక్రియ ముగిసేందుకు ఏడాది సమయం పడుతుందని ఆ రిపోర్టు వెల్లడించింది. అయితే బ్యాంకింగ్ వర్గాల సమాచారం మేరకు హై వాల్యు కరెన్సీ నోట్లు చట్టబద్ధమైనవిగానే కొనసాగుతాయని తెలిసింది.
ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ రూ.2,000 నోట్ల ఆపివేతపై బహిరంగంగానే ప్రకటించింది. తమ ఏటీఎంలలో రూ.2,000 నోట్ల వాడకాన్ని ఆపివేయాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. రూ.2,000 నోటుకు బయట ఛేంజ్ దొరకడం కష్టం అవుతోందని, దాన్ని మార్చడం కోసం కస్టమర్లు మళ్లీ బ్యాంక్‌కే వస్తున్నారని తెలిపింది.
వచ్చే నెల నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నట్టు ఇండియన్ బ్యాంక్ చెప్పింది. అయితే బ్యాంక్ బ్రాంచ్‌ల వద్ద మాత్రం రూ.2,000 నోట్లను జారీ చేస్తామని వెల్లడించింది. రూ.2,000 నోట్ల ఎక్స్చేంజ్ కష్టం అవుతుండటంతో, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, కొన్ని బ్యాంక్‌లు కూడా తమ ఏటీఎంలలో రూ.2,000 నోట్ల వాడకాన్ని ఆపివేయాలని నిర్ణయించాయి.
రూ.2,000 డినామినేషన్ కరెన్సీ నోట్లను ప్రింట్ చేయడం నిలిపివేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గతేడాది ఆర్‌టీఐ రెస్పాన్స్‌లో పేర్కొంది.
18 నెలలుగా వాటిని ప్రింట్ చేయడం లేదని కూడా తెలిపింది. ఆర్‌బీఐ, ఆర్‌టీఐకి ఇచ్చిన సమాధానంలో 2016–17 మధ్య కాలంలో రూ.2,000 డినామినేషన్ గల 3,542.999 మిలియన్ నోట్లను ప్రింట్ చేస్తే… 2017–18లో 111.507 మిలియన్ నోట్లే ప్రింట్ చేసినట్టు చెప్పింది.
2018–19లో అయితే ఏకంగా 46.690 మిలియన్ నోట్లనే ప్రింట్ చేసినట్టు ఆర్బీఐ వెల్లడించింది. అంటే హై డినామినేషన్ నోట్లను క్రమక్రమంగా చలామణిలో నుంచి తీసివేయాలని చూస్తున్నట్టు అనిపించక తప్పదు. హై వాల్యూ కరెన్సీని ప్రజల నుంచి వెనక్కి తీసుకోవడంతో పాటు బ్లాక్ మనీని అరికట్టాలని చూస్తోంది.
2016 నవంబర్‌లో ప్రభుత్వం రూ.1,000, రూ.500 డినామినేషన్ నోట్లను రద్దు చేసింది. బ్లాక్ మనీని అరికట్టేందుకు, నకిలీ నోట్లకు అడ్డు కట్ట వేసేందుకు ఈ నోట్లను రద్దు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.
2018–19 మధ్య కాలంలో చలామణీలో ఉన్న మొత్తం బ్యాంక్ నోట్లలో రూ.2,000 నోట్ల షేర్ మూడు శాతానికి తగ్గిపోయింది.
2016–17లో వీటి షేరు 3.3 శాతంగా ఉండేది. వాల్యు టర్మ్స్‌లో రూ.2,000 నోట్ల షేరు 2016–17 కాలంలో 50.2 శాతంగా ఉండగా.. 2018–19 నాటికి 31.2 శాతానికి తగ్గిపోయింది.
ఏటీఎంల నుంచి రూ.2 వేల నోట్లను జారీ చేయొద్దని బ్యాంకులకు ఏ ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇటీవల ఇండియన్ బ్యాంక్ ఏటీఎంల్లో రూ.2 వేల నోట్ల జారీని నిలిపేసింది.
Also read:విపణిలోకి హ్యుండాయ్ ‘గ్రాండ్ ఐ10 నియోస్’
ఇదే టైమ్‌లో రూ.2 వేల నోటు చెల్లుబాటులోనే ఉన్నా క్రమంగా దానిని చెలామణీ నుంచి తప్పించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రూ.2 వేల నోట్లను రద్దు చేసే అవకాశం ఉందా? వాటిని జారీ చేయొద్దని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘నాకు తెలిసినంత వరకూ అలాంటి ఆదేశాలేవీ బ్యాంకులకు ఇవ్వలేదు”అని నిర్మలాసీతారామన్ చెప్పారు.