పెట్రోల్, డీజిల్ కంటే విమాన ఇంధనమే చౌకట...అయినా విమానయాన సంస్థల ఆందోళన

By Arun Kumar PFirst Published Mar 2, 2019, 12:03 PM IST
Highlights

 విమాన ఇంధన ధరలు నాలుగు నెలల తర్వాత మరోసారి పెరిగాయి. ఈ నెల ఒకటో తేదీన ఒక్కసారిగా 8.1 శాతం పెరిగాయి. కానీ పెట్రోల్, డీజిల్ ధరల కంటే తక్కువేనని ఆయా విమానయాన సంస్థలు తెలిపాయి. మరోవైపు రెండు వారాలుగా బహిరంగ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరల సెగ సామాన్యుడికి తగిలింది.  

న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పట్టిన విమాన ఇంధనం (ఏటీఎఫ్) మళ్లీ భగ్గుమన్నది. అంతర్జాతీయ విపణిలో ఇంధన ధరలు భారీగా పెరుగడంతో ఈ ఏడాది గరిష్ఠ స్థాయికి చేరుకున్నదని ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ తెలిపింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయ పరిధిలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కిలో లీటర్ ధర రూ.4,734.15 లేదా 8.15 శాతం పెరిగి రూ.62,795.12కి చేరుకున్నది.  

నాలుగు నెలల తర్వాత విమాన ఇంధన ధరల పెరుగుదల ఇప్పుడే 
నాలుగు నెలల తర్వాత ఇలా విమాన ఇంధన ధరలు పెరుగడం ఇదే తొలిసారి. దీంతో 2019లో గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ఇంధన ధరలకు, విదేశీ మారకం రేట్లకు అనుగుణంగా ప్రతి నెల ఒకటో తేదీన జెట్ ఫ్యూయల్ ధరల్లో మార్పులు చేస్తున్నాయి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు. ఫిబ్రవరిలో ధరలను ఇంధన విక్రయ సంస్థలు యథాతథంగా కొనసాగించాయి.

డిసెంబర్, జనవరిల్లో ఇలా దరల్లో కోత
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన రికార్డు స్థాయిలో 14.7 శాతం(కిలో లీటర్ ధర రూ.9,990) తగ్గించగా, డిసెంబర్‌లోనూ 10.9 శాతం(రూ.8,327.83) కోత పెట్టాయి. వరుసగా రెండు నెలలపాటు భారీగా తగ్గిన ఇంధన ధరలో తీవ్ర సంక్షోభంలో కూరుకుకున్న విమానయాన సంస్థలకు భారీ ఊరట లభించినట్లు అయింది. 

ధరల పెరుగుదలతో ఎయిర్‌లైన్స్ లాభాలపై ఎఫెక్ట్
కానీ మళ్లీ ప్రస్తుతం ధరలు పెరుగడంతో ఆయా సంస్థల లాభాలపై ప్రభావం చూపనున్నది. ధరలు భారీగా పెరిగినా.. పెట్రోల్, డీజిల్, కిరోసిన్(సబ్సిడియేతర) ధరల కంటే చౌకగా లభిస్తుండటం విశేషం. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.81 స్థాయిలో ఉండగా, అదే ఏటీఎఫ్ కిలో లీటర్ ధర రూ.62,795.12 లేదా లీటర్ ధర రూ.62.79 స్థాయిలో ఉన్నది.

పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి

సామాన్యుడికి మళ్లీ ఇంధన సెగ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఎగబాకుతుండటంతో వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంట్లోభాగంగా శుక్రవారం దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర 8-9 పైసలు, డీజిల్ 12-13 పైసల వరకు పెరిగింది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ మరో 8 పైసలు అందుకొని రూ.71.81కి చేరుకోగా, డీజిల్ 12 పైసలు బలపడి రూ.67.12 పలికింది. 

రెండు వారాల్లో ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు
ముంబైలో కూడా ఎనిమిది పైసలు పెరిగిన పెట్రోల్ రూ.77.44కి చేరుకోగా, డీజిల్ 13 పైసలు ఎగబాకి రూ.70.31 వద్దకు చేరుకున్నది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 8 పైసలు ఎగబాకి రూ.76.20కి, డీజిల్ మరో 13 పైసలు అందుకొని రూ.72.98గా నమోదైంది. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు గడిచిన రెండు వారాల్లో పెట్రోల్ ఏకంగా రూ. 1.48 పెరుగగా, డీజిల్ రూ.1.31 అధికమైంది. 

సరఫరా తగ్గింపుతోనే క్రూడాయిల్ ధరలకు రెక్కలు
గతేడాది అక్టోబర్‌లో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. సరఫరాను తగ్గించనున్నట్లు ఒపెక్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. ఫ్యూచర్ ట్రేడింగ్‌లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 24 సెంట్లు పె రిగి 66.55 డాలర్లు పలికింది. సబ్సిడీయేతర కిరోసన్ కూడా భారీగా పెరిగింది. శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చేలా కిలో లీటర్ ధర 5.4% పెరిగి రూ.64,460.83 పలికింది.

click me!