ఇండియాలో నిరుద్యోగులకు యాపిల్‌ బంపర్‌ ఆఫర్‌

By Naga Surya Phani Kumar  |  First Published Aug 28, 2024, 12:08 PM IST

టెక్నాలజీలో ప్రపంచ దిగ్గజం యాపిల్‌ ఇండియాలో  తన వ్యాపార విస్తరణకు వేగంగా అడుగులు వేస్తోంది. భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇంత త్వరగా యాపిల్‌ భారత దేశంలో అభివృద్ధి చెందే ప్రయత్నాలు చేయడానికి పలు కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.. రండి..
 


టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌పై దృష్టి సారిస్తోంది. చైనాలో తన కార్యకలాపాలను మాక్సిమం తగ్గించాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇండియాలో విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చైనాలో ఆ కంపెనీ తిరోగమనంలో ఉంది. చైనా ప్రభుత్వంపై ఆధారపడాల్సి రావడంతో అది ఇష్టం లేని యాపిల్‌ యాజమాన్యం ఆ దేశంలో కార్యకలాపాలను తగ్గించే ప్రయత్నాల్లో ఉంది. 

ప్రపంచంలోనే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. అందుకే యాపిల్‌ కంపెనీ భారత్‌నే తన వ్యాపార విస్తరణకు ఎంచుకుంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇండియాలో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తయారీ పెంచాలని కోరింది. దీంతో ఇండియాలో భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించి ప్రొడక్షన్‌ చేయాలని యాపిల్ ప్రణాళికలు వేసింది. 

Latest Videos

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దాదాపు 2 లక్షల మంది నేరుగా ఆపిల్‌లో పనిచేసే అవకాశం ఉంటుంది.  వీరిలో 70 శాతానికి పైగా మహిళలు ఉంటారట. ఈ ఉద్యోగాలను నేరుగా Apple, యాపిల్‌కి సేవలందించే కంపెనీలు సృష్టిస్తాయట. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ప్రతి ఉద్యోగానికి, మూడు పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. దీని ప్రకారం 2 లక్షల మందికి నేరుగా ఉద్యోగాలు కల్పిస్తే మరో 4 లక్షలు మంది వారి ద్వారా ఉపాధి పొందుతారు. 


వచ్చే ఏడాది భారత్‌లో ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల తయారీని పరిశీలించాలని యాపిల్‌ను కేంద్ర ప్రభుత్వం కోరింది.  దీంతో రానున్న రెండు, మూడేళ్లలో భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు యాపిల్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా 
Apple తన భాగస్వామి ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ద్వారా మొదటిసారిగా భారతదేశంలో iPhone 16 సిరీస్ ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లను తయారు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

భారతదేశంలో Apple మూడు కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. అవి Foxconn, Wistron (ఇప్పుడు Tata Electronics), Pegatron . ఈ మూడు కంపెనీల్లో ఇప్పటికే 80,872 మందిని రిక్రూట్‌ చేసుకున్నారట. అలాగే టాటా గ్రూప్, సాల్‌కాంప్, మదర్‌సన్, ఫాక్స్‌లింక్ (తమిళనాడు), సున్‌వోడా (ఉత్తరప్రదేశ్), ATL (హర్యానా), జబిల్ (మహారాష్ట్ర) వంటి కో కంపెనీలతో కలిసి 84,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించారని ఎకనామిక్ టైమ్స్ వేదిక పేర్కొంది. 


 

click me!