మరో క్రైసిస్‌లో అనిల్: రూ. 1760 కోట్ల లోన్స్ పేమెంట్స్ సాధ్యమేనా?

Published : May 04, 2019, 11:43 AM IST
మరో క్రైసిస్‌లో అనిల్: రూ. 1760 కోట్ల లోన్స్ పేమెంట్స్ సాధ్యమేనా?

సారాంశం

రిలయన్స్ బ్రదర్ ‘అనిల్‌ అంబానీ’కి మరో సంకటం వచ్చి పడింది. మొన్న ఆర్ కామ్.. తాజాగా అనిల్ సారథ్యంలోని రిలయన్స్ కేపిటల్ సంక్షోభం ముంగిట నిలిచింది. నగదు నిల్వలు రూ.11 కోట్లకు పడిపోయాయి. మరోవైపు వివిధ సంస్థలకు చెల్లించాల్సిన రూ.1,760 కోట్ల బకాయిలకు గడువు సమీపిస్తోంది.  

ముంబై: అనిల్‌ అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో పటిష్ఠంగా ఉన్న సంస్థ రిలయన్స్‌ కేపిటల్‌ ఒక్కటే. రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ కమ్యూనికేషన్‌.. ఇలా గ్రూపులోని అన్ని కంపెనీలు ఆర్థికంగా చితికిపోయినా రిలయన్స్‌ కేపిటల్‌ మాత్రం గత ఐదేళ్లలో లాభాలను రెట్టింపు చేసుకోగలిగింది. 

గ్రూపులోని మిగతా కంపెనీల సంక్షోభ ప్రభావం పడకుండా సురక్షితంగా వ్యాపారం కొనసాగించగలిగింది. కానీ ఇప్పుడీ కంపెనీ కూడా ఒత్తిడికి గురవుతోంది. మార్చి నాటికి కంపెనీ నగదు నిల్వల స్థాయి రూ.11 కోట్లకు పడిపోయాయి. 

దాంతో నిధులు పెంచుకునేందుకు రిలయన్స్ కేపిటల్ 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.14వేల కోట్లు) విలువైన ఆస్తుల విక్రయానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆస్తుల అమ్మకాన్ని వీలైనంత త్వరగా ముగిస్తే తప్ప కంపెనీ నిధుల కొరత సమస్య నుంచి గట్టెక్కే అవకాశాలు కన్పించడం లేదని మార్కెట్‌ వర్గాలంటున్నాయి.

మార్కెట్‌ నుంచి సేకరించిన రుణాల్లో 25.2 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,760 కోట్లు) మేర బకాయిలను రిలయన్స్ కేపిటల్ ఈ రెండు నెలల్లో తీర్చాల్సి ఉంది. ద్రవ్య వల్ల గడువులోగా బకాయిలు చెల్లించడంలో విఫలమైతే కంపెనీ సంక్షోభంలోకి  జారుకోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

సమస్య నుంచి బయటపడేందుకు సకాలంలో ఆస్తుల అమ్మకం కీలకమని క్రెడిట్‌ అడ్వైజరీ సంస్థ ఆదిత్య కన్సల్టింగ్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ మాథ్యూ ఆంటోనీ పేర్కొన్నారు. లేదంటే కంపెనీ ద్రవ్య సంక్షోభంలోకి జారుకునే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.

మూడీస్‌ దేశీయ విభాగమైన ఇక్రా, కేర్‌ రేటింగ్‌, బ్రిక్‌వర్క్‌ రేటింగ్‌ వంటి పలు ఏజెన్సీలు ఈ మధ్యకాలంలో రిలయన్స్‌ కేపిటల్‌, దాని స్వల్పకాలిక రుణాల రేటింగ్‌లను తగ్గించి వేశాయి. ఆస్తుల విక్రయంలో జాప్యం, క్రమంగా క్షీణిస్తున్న నగదు నిల్వలు, రుణాలకు పొంచి ఉన్న రిస్క్‌లను ఇందుకు కారణమని పేర్కొన్నాయి. 

వివిధ సంస్థల రేటింగ్‌ తగ్గింపు కంపెనీ షేర్లపై ప్రభావం చూపింది. రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ దివాళా తీయడంతోపాటు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం కూడా రిలయన్స్‌ కేపిటల్‌ షేర్లను దెబ్బతీశాయి. దాంతో ఈ ఏడాది కంపెనీ షేర్లు 40 శాతం మేర పతనమయ్యాయి.
 
గత దశాబ్దకాలంలో అనిల్‌ అంబానీ ఉత్థాన పతనాలను చూశారు. 2008లో 3,100 కోట్ల డాలర్లుగా నమోదైన ఆయన సంపద ప్రస్తుతం 12 కోట్ల డాలర్లకు పడిపోయింది.
 
అనిల్‌ అంబానీ గ్రూప్‌లోని ఇతర కంపెనీలకు రిలయన్స్‌ కేపిటల్‌ ఇచ్చిన రుణాలు, పెట్టిన పెట్టుబడులు రూ.13,748 కోట్లు. సదరు కంపెనీలన్నీ సంక్షోభంలో ఉండటంతో అవి తిరిగొస్తాయో లేదో నమ్మకం లేదు. 

గత ఏడాది సెప్టెంబర్ నాటికి విక్రయించాల్సిన ఆస్తుల్లో కేవలం మూడోవంతు ఒప్పందాలను మాత్రమే పూర్తి చేయగలిగింది. నియంత్రిత షేర్‌హోల్డర్ల వాటాల్లో మూడొంతుల షేర్లు తనఖాలో ఉండటంతో అనిల్ అంబానీపై ఒత్తిడి పెరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్
Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..