గోల్డెన్‌ కారులో ఓ వ్యక్తి షికార్లు.. ప్రజలకు ఆనంద్ మహీంద్రా ‘‘పొదుపు’’ పాఠాలు

By Siva KodatiFirst Published Jul 21, 2021, 2:28 PM IST
Highlights

మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సడెన్‌గా ఆర్ధిక వేత్తలాగా మారిపోయారు. డబ్బు ఎవరికి వూరకే రాదంటూ పాఠాలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా.. మహీంద్రా గ్రూప్ అధినేత. సమకాలీన వ్యాపారవేత్తలకు పూర్తి భిన్నం. వ్యాపారంలో వ్యూహాలు పన్ని లాభాలు ఎలా సంపాదించవచ్చో నిరూపించిన ఆయన సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా వుంటాడు. ప్రతిరోజూ దేశ విదేశాల్లోని అంశాలపై మహీంద్రా స్పందింస్తూ వుంటాడు. అలాగే ఆపదలో వున్న వారిని ఆదుకుంటూ వుంటారు. కొద్దిరోజుల క్రితం రూపాయికే ఇడ్లీ పెట్టిన ఓ తమిళనాడు మహిళ సేవా భావానికి ఫిదా అయిన ఈ బిజినెస్‌మెన్ ఆమెకు ఇంటిని నిర్మించి ఇచ్చాడు. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. మనం టీవీ చూస్తున్నప్పుడు లలిత బ్రాండ్ యాడ్‌ యజమాని ‘‘ డబ్బు ఎవరికి వూరకే రాదు’’ అంటూ చెబుతూ వుంటారు. ఇప్పుడు అదే విషయాన్ని చెబుతున్నారు ఆనంద్ మహీంద్రా. డబ్బులు వృథాగా ఎలా ఖర్చు చేయకూడదో ఉదాహరణతో సహా చెప్పారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. 

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన ఫెరారీ కారులో వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు.  అయితే, ఇందులో వింత ఏముంది.. కారున్న వాళ్లు దానిని ఇంట్లో దాచుకోలేరు కదా. కొనుక్కున్నది షికారుకు వెళ్లడానికే కదా. అని మీకు సవాలక్ష డౌట్లు రావొచ్చు. ఏ కారణం లేకుండా ఆనంద్ మహీంద్రా లాంటి వాళ్లు స్పందించరు కదా. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. అది పూర్తిగా బంగారు పూత పూసిన కారు. ఓ ఇద్దరు వ్యక్తులు దాంట్లో కూర్చుని చక్కర్లు కొడుతున్నారు. దాన్ని చూసి చుట్టుపక్కల వారంతా ఆశ్యర్యపోతూ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపైన ‘ఇండియన్‌ అమెరికన్ విత్‌ ప్యూర్‌ గోల్డ్‌ ఫెరారీ కార్‌’ అని నోట్‌ రాసి ఉంది. 

దీనిపై ఆనంద్‌ మహీంద్రా స్పందింస్తూ.. అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చంటూ చురకలు వేశారు. ఇది సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతుందో నాకర్థం కావడం లేదు. మనం ధనవంతులమైనంత మాత్రాన డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో దీని ద్వారా నేర్చుకోవచ్చు అంటూ ట్వీట్ చేశారు. అన్నట్లు ఈ పోస్టును 24 గంటల్లో 1,69,300 మంది వీక్షించగా..  6,000 మంది లైక్‌ చేశారు.

 

I don’t know why this is going around on social media unless it is a lesson on how NOT to spend your money when you are wealthy… pic.twitter.com/0cpDRSZpnI

— anand mahindra (@anandmahindra)
click me!