ఉద్దీపనలెందుకు? అడ్వైజర్ వ్యాఖ్యతో ‘స్టాక్స్’ కుదేలు!!

By rajesh yFirst Published Aug 23, 2019, 11:16 AM IST
Highlights
  • సీఈఏ వ్యాఖ్యలతో ప్రకంపనలు
  • సూచీలకు భారీ నష్టాలు

ముంబై: నానాటికీ క్షీణిస్తున్న ఆర్థిక స్థితిని సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలు ప్రకటించే అవకాశాలు లేవన్న భయాలు గురువారం మార్కెట్‌ను భారీ నష్టాల్లోకి నెట్టాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ మాట్లాడుతూ వ్యాపారాలు ఎదురీదుతున్నాయని ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుంచి కంపెనీలకు ఉద్దీపనలు ప్రకటించాలనడం మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ సూత్రానికి విరుద్ధమనడం మదుపరుల్లో భయాలకు కారణమైంది. 

వివిధ పారిశ్రామిక రంగాలకు ఉద్దీపనలు ప్రకటించడం కన్నా వడ్డీరేట్లు తగ్గించడం, ప్రైవేట్ రంగానికి మరింతగా రుణాలు అందుబాటులో ఉంచడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని విద్యుత్‌ శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. 
 
ఇప్పటికే మాంద్యంలో ఉన్న బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌ కౌంటర్లలో అమ్మకాలు పోటెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 587.44 పాయింట్ల భారీ నష్టంతో 36472.93 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 177.35 పాయింట్లు నష్టపోయి 10741.35 వద్ద ముగిసింది. సూచీలు రెండూ నష్టాలతో క్లోజ్‌ కావడం వరుసగా ఇది మూడో రోజు. 

విభాగాల వారీగా రియాల్టీ ఇండెక్స్‌ 6.01 శాతం నష్టంతో అగ్రస్థానంలో నిలవగా మెటల్‌, ఫైనాన్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బ్యాంకెక్స్‌, ఎనర్జీ సూచీలు కూడా భారీ నష్టాల్లోనే ముగిశాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు రెండూ 2.19 శాతం మేరకు నష్టపోయాయి. ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి భారీ క్షీణత కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బ తీసింది.
 
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో నాలుగు మాత్రమే లాభాల్లో ముగియగా మిగతా 26 నష్టాల్లోనే ముగిశాయి. యెస్‌ బ్యాంకు, హెచ్‌డీఎ్‌ఫసీ ద్వయం, ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్‌ భారీగా నష్ట పోవడానికి ప్రధాన దోహదమయ్యాయి. యస్‌ బ్యాంకు షేర్ 13.91 శాతం మేరకు దిగజారింది. 

డీఎల్‌ఎఫ్‌ షేరు 19.6 శాతం నష్టపోయింది. భారీగా నష్టపోయిన ఇతర షేర్లలో వేదాంతా, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌ ఉన్నాయి. ఇవికాకుండా ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, హీరో మోటోకార్ప్‌ కూడా నష్టాల్లోనే ముగిశాయి. లాభపడిన షేర్లలో టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఉన్నాయి.
 
గురువారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.902.99 కోట్ల విలువైన పెట్టుబడులను విత్ డ్రా చేసుకున్నారు. సంపన్నులపై బడ్జెట్‌లో పన్ను పెంచిన నేపథ్యంలో గత రెండు నెలల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) 300 కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 

దీంతో రూపాయి విలువ ప్రభావితం అవుతూనే ఉంది. బుధవారంనాడు ఎఫ్‌పీఐలకు సంబంధించిన నిబంధనలను సెబీ సరళీకరించినా  గురువారం మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వు జూలై నెలకు సంబంధించిన సమావేశ మినిట్స్‌ను విడుదల చేసిన నేపథ్యంలో డాలర్‌ విలువ మరింత బలపడింది. వడ్డీ రేట్ల తగ్గింపునకు సంబంధించి విధానకర్తలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు మినిట్స్‌ ద్వారా తెలిసింది.

ముడిచమురు ధరలు కూడా రూపాయిని ప్రభావితం చేస్తున్నాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 60 డాలర్ల పైనే కదలాడుతోంది. అమెరికాలో ముడిచమురు నిల్వలు తగ్గడం, ఒపెక్‌ దేశాలు సరఫరాలో కోత విధించడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంబంధించిన అంశాలు వంటివి చమురు ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. 

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చమురు ధరలు 12 శాతానికి పైగా పెరిగాయి. ధరల పెరుగుదలతో భారత్‌ వాణిజ్య లోటు మరింతగా పెరుగతోందని, ఇది రూపాయిపై ఒత్తిడి పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. శుక్రవారం యూఎస్‌ ఫెడ్‌ రిజర్వు చీఫ్‌ జెరోమ్‌ పోవెల్‌ సెంట్రల్‌ బ్యాంకర్లతో కలిసి ప్రసంగించనున్నారు.

శనివారం నుంచి మూడు రోజులు ఫ్రాన్స్‌లో జీ7 సమావేశం జరగనుంది. ఈ రెండింటిపైనే రూపాయి ట్రేడర్లు దృష్టిసారించారు.
డాలర్‌ మారకంలో చైనా యువాన్‌ 11 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చైనా-యూఎస్‌ మధ్య వాణిజ్య యుద్ధం ఇందుకు కారణమవుతోంది. దీని ప్రభావం కూడా రూపాయిపై పడింది.
 

click me!