‘మహరాజా’కు ఉద్దీపన: రూ.250 కోట్ల ఆస్తుల సేల్ బిడ్లు

By sivanagaprasad kodatiFirst Published Oct 2, 2018, 8:18 AM IST
Highlights

కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’కు జవ సత్వాలు కలిగించేందుకు సర్కార్ చర్యలు చేపడుతోంది. మరోవైపు తనకు ప్రధానంగా ఉపయోగ పడని ఆస్తుల విక్రయానికి మహారాజా వాణిజ్య ప్రకటనలు జారీ చేసింది. 

అప్పుల ఊబిలో చిక్కుకున్న ‘మహారాజా’ ఎయిర్ ఇండియా తన ఆస్తులను తెగనమ్ముకుని నిలదొక్కుకునేందుకు అపసోపాలు పడుతోంది. తాజాగా 14 ఆస్తులను విక్రయించి కేవలం రూ.250 కోట్లు సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సంస్థ సీనియర్ అధికారి తెలిపారు.

దాని విక్రయానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో జవసత్వాలు కల్పించేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎయిరిండియాకు అంతగా ఉపయోగ పడని ఆస్తుల విక్రయంపై ద్రుష్టిని కేంద్రీకరించింది. 

ప్రధాన నగరాల్లో ‘ఎయిరిండియా’ ఆస్తుల విక్రయానికి ఇలా ప్లాన్
ప్రత్యేకించి ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అమ్రుత్ సర్ తదితర నగరాల పరిధిలోని 14 ఆస్తులను విక్రయించాలని సంకల్పించింది. వాణిజ్య, నివాస ప్రాంతాల భూమిని రెసిడెన్షియల్ ఫ్లాట్లుగా విక్రయించాలని వాణిజ్య ప్రకటన జారీ చేసింది.

వచ్చేనెల ఒకటో తేదీ నుంచి బిడ్లు దాఖలు చేయాలని ఆ వాణిజ్య ప్రకటనలో పేర్కొన్నది. ఈ ఆస్తుల విక్రయం ద్వారా రూ.250 కోట్ల డబ్బు సంపాదించాలని భావిస్తున్నట్లు ఎయిరిండియా అధికారి ఒకరు చెప్పారు. 2016-17లో అడిటింగ్ నివేదిక ప్రకారం ఎయిర్ ఇండియా రూ.47,145.62 కోట్ల నష్టాలను చవి చూసింది. 

తుది దశలో జవసత్వ ఉద్దీపన: జయంత్ సిన్హా
ఇదిలా ఉంటే ఎయిరిండియాకు తిరిగి జవసత్వాలు అందించే ఉద్దీపన ప్యాకేజీ తుదిదశలో ఉందని త్వరలోనే దానిని ప్రకటిస్తామని పౌరవిమానయాన శాఖా సహాయ మంత్రి జయంత్‌ సిన్హా తెలిపారు. 

‘ఎయిరిండియాకు జవసత్వాలు అందించేందుకు మేం నాలుగు అంచెల వ్యూహం అమలు చేయబోతున్నాం. ఉద్దీపన ప్యాకేజీ చివరి దశలో ఉంది. త్వరలోనే అనుమతి కోసం పంపిస్తాం. ఆ తర్వాత ప్యాకేజీ ప్రకటిస్తాం’ అని జయంత్‌ సిన్హా మీడియాతో తెలిపారు.

ఆర్థికంగా బలోపేతం.. ప్రొఫెషనల్ బోర్డు నిర్వహణ లక్ష్యం
‘ఎయిరిండియా సంస్కరణల్లో మొదటి దశలో భాగంగా సంస్థను ఆర్థికంగా పటిష్ఠం చేయడం. రెండోది బోర్డు ప్రొఫెషనల్‌‌గా మార్చడం. మూడోది ఎయిర్‌లైన్‌ను విజయవంతంగా, పోటీనిచ్చేలా తయారుచేయడం.

ఇక చివరగా సిబ్బంది నైపుణ్యాలు, నాణ్యతను పెంపొందించడం’ అని సిన్హా అన్నారు. నవనిర్మాణ్‌ పథకంలో భాగంగా విమానాశ్రయాల్లో సౌకర్యాల కల్పనకు ఏటా 100 కోట్ల ప్రయాణికులకు సేవలందించేలా రూ. లక్ష కోట్లు ఖర్చుచేస్తామని పేర్కొన్నారు.

మహారాజాకు సర్కార్ ఆస్తులు రూ.1146.86 కోట్లు  
ఎయిర్‌ ఇండియా సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.1146.86 కోట్లు. ఈ విషయం సమాచార హక్కు చట్టం కింద చేసిన ఓ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. విశ్రాంత కమాండర్‌ లోకేశ్‌ బాత్రా దీనికి సంబంధించి వివరాలు కోరగా ఎయిర్‌ ఇండియా ఈ మేరకు వెల్లడించింది.

ఇందులో రక్షణ మంత్రిత్వశాఖనుంచి రూ.211.17 కోట్లు, విదేశీ మంత్రిత్వశాఖ నుంచి రూ.392.33 కోట్లు, పీఎంవో నుంచి రూ.543.18 కోట్లు విలువగల బకాయిలు రావాల్సి ఉందని సంస్థ వివరించింది.

రాష్ట్రపతి తదితరులకు ఎయిరిండియా విమానాల సేవలే
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా ఇతర అవసరాలకు ఛార్టెడ్‌ విమానాలు వాడగా.. వాటి చెల్లింపులు కొన్ని ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. గత జనవరి 31 వరకూ రూ.325 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఈ ఏడాది మొదట్లో వచ్చిన సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానం రాగా.. ఇప్పుడు రూ.1146.86 కోట్లుగా ప్రకటించడం గమనార్హం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా ఇతర ముఖ్య నేతల విదేశీ పర్యటనలకు ఎయిర్‌ ఇండియానే ఛార్టెడ్‌ విమానాలను సమకూర్చుతుంది. 

ఇలా రక్షణ, విదేశాంగ శాఖలు చెల్లించాలి
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రయాణాలకు అయిన ఖర్చును పీఎంవో, రక్షణ, విదేశీ మంత్రిత్వశాఖలు చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్‌ ఇండియాకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల గురించి 2016 నివేదికలోనే భారత కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ప్రస్తావించింది.

‘‘ఎయిర్‌ ఇండియా సంస్థకు సహకరించేలా పెండింగ్‌ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి’’ అని నివేదికలో సూచించింది. సంక్షోభంలో ఉన్న ప్రభుత్వరంగ ఎయిర్‌ ఇండియా సంస్థ సుమారు రూ.50 వేల కోట్ల మేర రుణ ఊబిలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

click me!