మహారాజా కష్టాలు: రూ.6,100 కోట్ల కోసం ప్లేన్స్ సేల్&లీజ్

By rajesh yFirst Published Nov 21, 2018, 10:10 AM IST
Highlights

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తమ మనుగడ కోసం అవసరమైన నిధుల సేకరణపై ద్రుష్టి సారించాయి. ఎయిరిండియా తన వద్ద ఉన్న ఏడు డ్రీమ్ లైనర్ విమానాలను విక్రయించి, లీజుకు తీసుకోవడం ద్వారా రూ.6,100 కోట్లు సేకరించాలని భావిస్తోంది. నిర్వహణకు అవసరమైన నిధుల కోసం మదుపర్లతో జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేశ్ గోయల్ సంప్రదిస్తున్నారు.

ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా పునరుద్ధరణ ప్రణాళికలను రచిస్తోంది. స్వల్పకాలిక రుణాలతో రూ.500 కోట్ల నిధులు సమీకరించాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నది. దీనికి బదులు ఆరు బోయింగ్‌ 787 (డ్రీమ్‌లైనర్‌) విమానాలు సహా వైడ్‌ బాడీ బాడీ విమానాల విక్రయం, లీజుకు తీసుకోవటం (లీజ్‌ బ్యాక్‌) ద్వారా మరో రూ.6,100 కోట్లు రాబట్టుకోవాలని యోచిస్తోంది. 

వాస్తవానికి మూలధన అవసరాల నిమి త్తం సెప్టెంబర్ ప్రారంభంలోనే స్వల్పకాలిక రుణాలుగా రూ.500 కోట్ల సమీకరణకు బిడ్లను ఆహ్వానించింది. బిడ్స్‌ చివరి తేదీగా తొలుత సెప్టెంబర్ 10వ తేదీగా నిర్ణయించినా ఆశించిన రీతిలో స్పందన లేక గడువు తేదీని అక్టోబర్ 31 వరకు పొడిగించింది. ఇదే సమయంలో నేషనల్‌ స్మాల్‌ సేవింగ్స్‌ ఫండ్‌ (ఎన్‌ఎస్ఎస్ఎఫ్) నుంచి రూ.1,000 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఎన్‌ఎస్ఎస్ఎఫ్ నుంచి రుణం తీసుకోవటంతో ఎస్‌టీఎల్‌ ద్వారా రూ. 500 కోట్లు సమీకరించాలన్న నిర్ణయాన్ని పక్కకుబెట్టినట్లు ఎయిర్‌ ఇండియా అధికారి ఒకరు వెల్లడించారు.
 
ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా రుణ భారం దాదాపు రూ.55,000 కోట్లు. ఇందులో వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలే రూ.35,000 కోట్లు. మూలధన అవసరాల కోసం గత ఏడాది నుంచి నిధులను సమీకరించాలని ఎయిర్‌ ఇండియా చూస్తోంది. నిధుల సమీకరణలో ఎక్కడ కూడా సఫలీకృతం కాలేకపోయింది. దీంతో విమానాల విక్రయం, లీజుకు తీసుకోవటం (ఎస్‌ఎల్‌బీ) ద్వారా ఈ గండం నుంచి బయటపడాలని భావిస్తోంది. 

విమానాల విక్రయం, లీజుకు సంబంధించి గత వారం ఆసక్తి వ్యక్తీకరణలను కోరుతూ ప్రకటన ఇచ్చింది. ఆరు బోయింగ్‌ 787-800, ఒక బోయింగ్‌ 77-300 ఈఆర్‌ విమానాలను విక్రయించటం,లీజ్‌ బ్యాక్‌ ద్వారా 85.6 కోట్ల డాలర్లు (సుమారు రూ.6,100 కోట్లు) సమీకరించాలని చూస్తున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. సమీకరించిన నిధులను ఈ విమానాలపై ఉన్న బ్రిడ్జ్‌ రుణాలను చెల్లించనున్నట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది.

ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాలో 12 బోయింగ్‌ 777, 27 బోయింగ్‌ 87-800 విమనాలున్నాయి. వీటితో పాటు 21 డ్రీమ్‌లైనర్స్‌, ఎస్‌ఎల్‌బీ విధానంలోనే ఎయిర్‌ ఇండియా నిర్వహిస్తోంది. ఎస్‌ఎల్‌బీ విధానం కింద  విమానాన్ని విక్రయించి వెంటనే 12 నెలల కాలపరిమితితో ఆపరేటింగ్‌ లీజుకు ఎయిర్‌ ఇండియా తీసుకుంటుందని బిడ్‌ డాక్యుమెంట్‌లో వెల్లడించింది.
 
వ్యాపార నిర్వహణకు నిధుల సేకరణపై జెట్ ఎయిర్వేస్ ఫోకస్
ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌.. వ్యాపార నిర్వహణకు అవసరమైన నిధుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పలువురు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో వినయ్‌ దూబే తెలిపారు. పెట్టుబడుల కోసం ప్రయత్నాలతో పాటు ఖర్చులను కూడా వీలైనంతగా తగ్గించుకునేందుకు సంస్థ కృషి చేస్తోందన్నారు. 

వ్యయ నియంత్రణ కింద ఆరు నెలల్లో రూ.500 కోట్లు ఆదా
వ్యయ నియంత్రణ చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం లో రూ.500 కోట్లు ఆదా చేయగలిగినట్లు జెట్‌ ప్రివిలేజ్‌ సభ్యులకు అందించిన సమాచారంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో వినయ్‌ దూబే పేర్కొన్నారు. ఇంధన, నిర్వహణ భారం పెరగడంతో గడిచిన రెండు త్రైమాసికాల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ భారీ నష్టాలు ప్రకటించింది. అంతేకాదు, నిధుల కొరతతో గడిచిన కొన్ని నెలలుగా పైలట్లు, ఇతర సిబ్బందికి సకాలంలో జీతాలు కూడా చెల్లించలేకపోతోంది. కాగా సంస్థను గట్టెక్కించేందుకు అవసరమైన నిధుల సేకరణకు జెట్‌ ఎయిర్‌ వేస్‌ ప్రమోటర్‌ నరేశ్‌ గోయల్‌ పలువురు ఇన్వెస్టర్లతో సంప్రదిస్తున్నారు.
 

click me!