సంక్షోభంలో ‘మహారాజా’: మాకుమ్మడి రాజీనామాలకు ఎయిరిండియా పైలట్లు?

By narsimha lodeFirst Published Oct 14, 2019, 12:57 PM IST
Highlights

ప్రైవేటీకరణ అంచుల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియా సంస్థను వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వేతనాల పెంపు, పదోన్నతుల కల్పన విషయమై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పైలట్లు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చమురు సంస్థలకు భారీగా ఎయిరిండియా బకాయిలు పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 18వ తేదీ వరకు బకాయిలు చెల్లిస్తామని హామీలు ఇచ్చింది ఎయిరిండియా.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాలో సంక్షోభ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. పైలట్లు మూకుమ్మడి రాజీనామాలు చేసే యోచనలో ఉన్నారు. తమ వేతనాల పెంపు, ప్రమోషన్ల అంశంపై ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి చెందిన వారు ఆ ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది.

అదే జరిగితే ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌ మూత పడటంతో తగ్గిన విమాన సర్వీసుల సమస్య మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది. దానికి తోడు విమాన ప్రయాణ టిక్కెట్ల ధరలు కూడా చుక్కలనంటవచ్చునని భావిస్తున్నారు.

తమ డిమాండ్ల విషయం ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో ఎయిర్‌బస్‌ ఏ-320 విమానాలు నడిపే 120 మంది పైలట్లు ఇప్పటికే రాజీనామా పత్రాలు సమర్పించారని చెబుతున్నారు. ఇప్పటికే రూ.60 వేల కోట్ల రుణాల ఊబిలో పీకల్లోతు కూరుకున్న ఎయిరిండియాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పైలట్లు ఈ చర్యకు దిగారని ఇటీవల రాజీనామా చేసిన ఒక పైలట్‌ చెప్పారు.

తాము వేతనాలు, ప్రమోషన్ల కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్నామని, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి గట్టి హామీ ఏదీ లేదని ఆ పైలట్ అన్నారు. తమకిచ్చే వేతనం కూడా సరైన సమయంలో అందకపోవడం వల్ల తాము భారీ ఎత్తున రుణాలు బకాయి పడిపోయామని ఆయన చెప్పారు.

తమను ఐదేళ్ల కాలానికి తక్కువ వేతనాలకు కాంట్రాక్టు ప్రాతిపదికపై నియమించారని, అనుభవం గడిస్తున్న కొద్ది వేతనం పెంచకపోతారా, ప్రమోషన్లు ఇవ్వకపోతారా అనే తమ ఆశ అడియాసగానే మిగిలిపోయిందని ఆయన వాపోయారు. ఎయిరిండియాలో తాము రాజీనామా చేసినంత మాత్రాన భయపడాల్సిందేమీ లేదని, మార్కెట్‌లో అవకాశాలు అపారంగా ఉన్నందున ఏదైనా ప్రైవేట్ విమానయాన సంస్థలో మంచి వేతనంతో ఉద్యోగం లభిస్తుందని వారంటున్నారు.

ప్రస్తుతం ఇండిగో, గో ఎయిర్‌, విస్తారా, ఎయిర్‌ ఆసియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ ఏ-320 విమానాలు నడుపుతున్నాయి. ఈ మూకుమ్మడి రాజీనామా వల్ల విమాన సర్వీసులకు అంతరాయం కలగవచ్చునా అన్న ప్రశ్నకు తమ వద్ద మిగులు సంఖ్యలో పైలట్లున్నారని, వారి రాజీనామాల వల్ల విమాన సర్వీసులు నిలిచిపోయే ప్రమాదం ఏదీ లేదని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 2,000 మంది పైలట్లు ఉండగా వారిలో 400 మంది మాత్రమే ఎగ్జిక్యూటివ్‌ పైలట్లున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను ఈ నెల 18వ తేదీ నాటికి చెల్లిస్తామని ఎయిరిండియా ప్రకటించింది.

ఇంధనం కొరత వల్ల విమాన సర్వీసులు నిలిచిపోయే ప్రమాదం ఏదీ లేదని కస్టమర్లకు ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. ఆయిల్‌ కంపెనీలతో ఉన్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రతినిధి ధననయ్‌ కుమార్‌ తెలిపారు. ప్రతీ నెలా ఏకమొత్తంలో చెల్లింపులు చేస్తామంటూ ఇచ్చిన హామీని ఎయిరిండియా నిలబెట్టుకోలేకపోతున్నదంటూ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ గత వారం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

click me!