
Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న అంటే ఈ రోజే కేంద్ర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. అసలు ఈ ఫిబ్రవరి 1 నాడే ఎందుకు యూనియన్ బడ్జెట్ ను ప్రవేశపెడతారో తెలుసా?
2017లో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఫిబ్రవరి చివరి పనిదినం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టే పాత పద్ధతిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే రైల్వే బడ్జెట్ ను విడివిడిగా ప్రవేశపెట్టే పద్ధతిని కూడా విరమించుకున్నారు.
అప్పుడు పాత విధానంలో ఫిబ్రవరి చివరి పనిదినం నాడు సాయంత్రం వేళ 5 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బ్రిటీష్ పాలన నుంచి వాడుకలో ఉన్న ఈ ఆచారం ఢిల్లీ, బ్రిటన్ మధ్య కాల వ్యత్యాసానికి కారణమని చెప్పొచ్చు. యూకే సమయం కంటే భారత సమయం 4.5 గంటలు ముందుంది.
1998 నుంచి 2002 వరకు అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా కూడా బడ్జెట్ సమర్పణ సమయాన్ని మార్చాలనుకున్నారు. అయితే 1999 కేంద్ర బడ్జెట్ ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాలనుకున్నారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయం మార్పు గురించి భారీ స్పందన వచ్చింది. కాగా 1999 ఫిబ్రవరి 27న స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా బడ్జెట్ ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వ పదవీకాలం ముగిసి ఎన్నికలను ప్రకటించే ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు.