బడ్జెట్ చరిత్రలో మొదటిసారి హల్వా వేడుకను రద్దు చేశారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌కు సంబంధించి అనేక మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఏర్పడింది.
బడ్జెట్ చరిత్రలో మొదటిసారి హల్వా వేడుకను రద్దు చేశారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌కు సంబంధించి అనేక మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. ఒమిక్రాన్ కారణంగా సంప్రదాయంగా బడ్జెట్ ప్రతుల ముద్రణకు వెళ్లేందుకు ముందు హల్వా తయారీ ప్రక్రియను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. హల్వా తయారీ సంబంరం లేకుండా బడ్జెట్ ప్రక్రియను చేపట్టడం ఇదే మొదటిసారి.
ఏమిటీ హల్వా తయారీ..?
కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకున్న సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి ఆధ్వర్యంలో హల్వా వేడుకను నిర్వహిస్తారు. బడ్జెట్ రూపకల్పన కోసం కొద్ది రోజుల పాటు కార్యాలయం నుండి బయటకు రాని ఉద్యోగులకు మిఠాయి సరఫరా చేసే ఉద్దేశ్యంలో భాగంగా హల్వా తయారు చేస్తారు. దీనిని అందరూ కలిసి భుజిస్తారు. బడ్జెట్ తయారీ సమయంలో దీనిని తయారు చేసే ఉద్యోగులు బయట ఎవరితోను మాట్లాడకూడదు. వీరంతా నార్త్ బ్లాక్‌లో ఉంటారు. ఇక్కడే బడ్జెట్‌ను ప్రింట్ చేస్తారు. ఆర్థికమంత్రి బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత వీరు నార్త్ బ్లాక్ నుండి బయటకు వస్తారు. అయితే బడ్జెట్ రూపకల్పన తుది దశకు చేరుకున్న తర్వాత ఆర్థికమంత్రితో కలిసి హల్వా వేడుక ఉంటుంది. ఈసారి దానిని ఉపసంహరించుకున్నారు.
హల్వా వేడుక అంటే బడ్జెట్ ప్రక్రియ చివరి దశను సూచిస్తుంది. ఈ హల్వా వేడుకను నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తారు. ఆర్థికమంత్రి సంప్రదాయంగా కడాయిని కదిలించడం ద్వారా ప్రారంభిస్తారు. కొద్ది రోజులు లేదా నెలల తరబడి సాగే సుదీర్ఘ బడ్జెట్ ప్రక్రియలో పాల్గొన్న సిబ్బంది ప్రయత్నాలను గుర్తించి, ప్రశంసించే ప్రయత్నంగా హల్వా వేడుకను నిర్వహిస్తారు. కీలక పత్రం తయారీలో పాల్గొన్న వారందరికీ హల్వానే వడ్డిస్తారు.
పేపర్‌లెస్ బడ్జెట్
గతంలో వలె ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌ను తయారు చేస్తున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పర్యావరణహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది కూడా కాగిత రహిత రూపంలో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. రెడ్ కలర్ 'బాహీ-ఖాతా' గుడ్డలో ఉన్న బడ్జెట్‌ను తీసుకుని ఆమె పార్లమెంటుకు రానున్నారు. పార్లమెంటు సభ్యులు (ఎంపీలు), సాధారణ ప్రజలకు 'యూనియన్ బడ్జెట్ యాప్' లేదా బడ్జెట్ పత్రాలను అవాంతరాలు లేకుండా యాక్సెస్ చేయడాన్ని కూడా ఆర్థిక మంత్రి ప్రారంభించారు.
ఎక్కువ శాతం బడ్జెట్ పత్రాలు డిజిటల్ రూపంలో లభిస్తాయని, భౌతిక ప్రతులను కొన్ని మాత్రమే ముద్రించనున్నట్లు తెలిపారు. ఇదివరకు వందల సంఖ్యలో బడ్జెట్ పత్రాల ముద్రణ, ఇందుకు భారీ ప్రక్రియ ఉండేది. అయితే మోడీ ప్రభుత్వం వచ్చాక క్రమంగా పత్రాల ముద్రణ తగ్గింది. బడ్జెట్ పత్రాల ముద్రణ నేపథ్యంలో ఆ వివరాలు వెలుగు చూడకూడదని ఆర్థిక శాఖ ఉండే నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లోని ముద్రణాలయ సిబ్బంది రెండు వారాల పాటు బయటి ప్రపంచానికి దూరంగా, లోపల పని చేసేవారు. ఆర్థికమంత్రి, సహాయమంత్రులు, సీనియర్ అధికారులు ఆ తర్వాత హల్వా వేడుక నుండి బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ ప్రారంభమయ్యేది. అయితే ఇటీవల ముద్రణ తగ్గుతోంది. మొదట మీడియా ప్రతినిధులు, ఇతర విశ్లేషకులకు ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం తగ్గించారు. కరోనా తర్వాత లోకసభ, రాజ్యసభ సభ్యులకు కూడా ఇవ్వడం మానివేశారు.