Union Budget 2022...అందుకే పన్నులు పెంచలేదు: నిర్మలా సీతారామన్

By narsimha lode  |  First Published Feb 1, 2022, 4:44 PM IST

కరోనా కారణంగా దెబ్బతిన్న అన్ని రంగాలను ఆదుకొనేందుకు తాము ప్రయత్నాలు చేశామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మంగళవారం నాడు సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. 



న్యూఢిల్లీ: కరోనాను దృష్టిలో ఉంచుకొనే పన్నులు పెంచలేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి Nirmala Sitharaman చెప్పారు.మధ్యతరగతి వర్గాలకు పన్నుల ఉపశమనం లేని విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన సమయంలో పన్నులు పెంచలేదు కదా అని ఆమె ప్రశ్నించారు. పన్నులు పెంచడం ద్వారా ఆదాయం సంపాదించాలని తాము భావించలేదన్నారు. మంగళవారం నాడు సాయంత్రం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు.

Corona సమయంలో పన్నులు పెంచాలని కేంద్రం భావించలేదన్నారు. గత ఏడాది కూడా తమకు ఇదే విషయాన్ని ప్రధాని మోడీ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకొన్నారు. కరోనా ఉద్యోగాలపై ప్రభావం చూపిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పౌరులు విజయవంతంగా కోలుకోవడానికి ప్రయత్నిస్తోందని  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.డిజిటల్ కరెన్సీని కూడా RBI  విడుదల చేస్తోందన్నారు. 

Latest Videos

తాము పన్ను లక్ష్యాలను సాధిస్తామని కేంద్ర మంత్రి ధీమాను వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ ఎంఎస్ఎంఈలకు బాగా పనిచేసినందున ఇది ఉత్తమమైందిగా భావిస్తున్నామన్నారు. ఎల్ఐసీ ఐపీఓ 2022-23 లో జరుగుతుందని తాము అంచనా వేస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

కరోనా సెకండ్ వేవ్ తర్వాత కష్టాల్లో ఉన్న రంగాలకు తాము మద్దతుగా నిలిచేందుకు ప్రయత్నించామని కేంద్ర మంత్రి చెప్పారు. పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకం తీసుకొచ్చామన్నారు. క్రెడిట్ గ్యారంటీ పథకానికి రూ. 2 లక్షల కోట్ల నిధులు కేటాయించామన్నారు.ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ సహకారానికి కొత్త పోర్టల్ ఏర్పాటు చేస్తున్నట్టుగా మంత్రి వివరించారు. ఈ బడ్జెట్ గత ఏడాది బడ్జెట్ కు కొనసాగింపు అని  కేంద్ర మంత్రి వివరించారు.

వ్యవసాయ రుణ లక్ష్యం ప్రస్తుత ఏడాదిలో రూ.16.5 లక్షల కోట్లుంటే వచ్చే ఆర్ధిక సంవత్సరం రూ. 18 లక్షలుగా ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడంపై ఆమె మండిపడ్డారు. భాద్యతా రహితంగా విమర్శలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. రాహుల్ గాంధీ సరిగా హోంవర్క్ చేయడం లేదని ఆమె సెటైర్లు వేశారు.నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తాము అనేక చర్యలు తీసుకొంటున్నామన్నారు. ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి వెళ్లకుండా తమ  ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొందన్నారు. 2014కి ముందు ద్రవ్యోల్బణం 10,11,12,13 రేంజ్ లో ఉందని ఆమె గుర్తు చేశారు.

click me!