భారత రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది. రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి చేసే కొనుగోళ్లలో 68 శాతం దేశీయంగానే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో తయారు చేసే కంపెనీల నుంచే ఈ కొనుగోళ్లు ఉంటాయని వివరించారు. అలాగే, ఆర్ అండ్ డీకి కేటాయించిన బడ్జెట్‌లో 25 శాతం ప్రైవేటు భాగస్వామ్యానికి ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) ఈ రోజు పార్లమెంటులో బడ్జెట్(Budget 2022) ప్రవేశపెడుతూ రక్షణ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా (Make In India) నినాదాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి నిర్ణయించారు. రక్షణ రంగానికి(Defence Sector) చెందిన కొనుగోళ్లు పెద్దస్థాయిలో దేశీయంగానే చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తద్వార ప్రైవేటు రంగానికీ(Private Sector) సముచిత ప్రాధాన్యతను ఇచ్చారు. భారత రక్షణ శాఖకు కావాల్సిన ఆయుధాలు, పరికరాల్లో 68 శాతం భారత్‌లోనే తయారు చేసే ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గత బడ్జెట్ కంటే కూడా ఈ శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతేడాది రక్షణ రంగంలోకి ప్రైవేటు రంగం నుంచి 58 శాతం కొనుగోళ్లు జరపాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
సాధారణంగా భారత రక్షణ శాఖకు అవసరమైన పరిశోధన, సాంకేతిక అవసరాలను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అందిస్తుంది. ఇప్పుడు ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ భారత ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరుస్తున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. భారీ కంపెనీలు, స్టార్టప్‌లు, విద్యా రంగం సేవలు అందుకోవడానికి ఆర్ అండ్ డీ సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. ఈ ప్రైవేటు రంగంతో అభివృద్ధిని, పరిశోధనను పాలుపంచుకోవడానికి ఆర్ అండ్ డీకి కేటాయించిన దానిలో 25 శాతం మొత్తం ఖర్చు చేయనన్నట్టు పేర్కొన్నారు.
ప్రైవేటు కంపెనీలు సరికొత్త డిజైన్లు, మిలిటరీ ఉత్పత్తుల అభివృద్ధి, పరిశోధనలు చేయడానికి తాము ప్రోత్సహిస్తున్నట్టు ఆమె తెలిపారు. డీఆర్‌డీవోతో కలిసి ఈ పని చేయవచ్చని వివరించారు. మిగతా కంపెనీలూ స్పెషల్ పర్పస్ వెహికిల్ విధానంలో ఈ సేవలు అందించవచ్చునని చెప్పారు. డీఆర్‌డీవోతో జత కట్టడానికి ప్రత్యేకంగా ఓ విధానాన్ని ఆమె సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక స్వతంత్ర బాడీని ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ ఇండిపెండెంట్ బాడీ విస్తృతస్థాయిలో పరీక్షలు చేసి అవసరమైన సర్టిఫికేట్లను సంబంధిత ప్రైవేటు కంపెనీకి జారీ చేస్తుందని తెలిపారు.
ఈ తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి కృత్రిమ మేధస్సు, జియోస్పాటియల్ సిస్టమ్స్, డ్రోన్లు, సెమి కండక్టర్లు, వాటి ఎకో సిస్టమ్, స్పేస్ ఎకానమీ, జీనోమిక్స్, ఫార్మాస్యూటికల్, క్లీన్ మొబిలిటీ సిస్టమ్స్ వంటి ఏరియాలపై ఫోకస్ పెట్టాలని తెలిపారు. దేశాన్ని ఆధునీకరించడానికి వీటికి ఉన్నతమైన శక్తి ఉంటుందని అన్నారు.
ప్రపంచంలో రక్షణ రంగానికి అత్యధికంగా బడ్జెట్ కేటాయిస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నది. దేశ జీడీపీలో సుమారు 2 శాతం డిఫెన్స్ కేటాయిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కాగా, కేటాయింపులు భారీగా కనిపిస్తున్నప్పటికీ అదే స్థాయిలో వాటి వినియోగం ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2022 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ 2022 ప్రసంగాన్ని ప్రారంభించారు.