నిర్దేశించుకున్న లక్ష్యానికి ఏడు నెలల ముందే బీఎస్-6 ప్రమాణాలతో కూడిన స్కూటీ తరహా స్కూటర్ ‘హోండా యాక్టీవా 125ఎఫ్ఐ’ని హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ విడుదల చేస్తోంది.
ప్రముఖ టూ వీలర్ మోటార్ బైక్స్ తయారీ సంస్థ ‘హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ)’ విపణిలోకి తొలి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన స్కూటర్ సిద్ధమవుతోంది. ‘హోండా యాక్టీవా 125 ఎఫ్ఐ’ ఈ నెల 11వ తేదీన మార్కెట్లోకి రానున్నది.
స్కూటీ క్యాటగిరీలో విపణిలోకి వస్తున్న హోండా మోటార్స్ తొలి బీఎస్-6 వెహికల్ ఇదే కావడం ఆసక్తికర పరిణామం. తొలుత వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఈ స్కూటీ తరహా బైక్‌ను విడుదల చేయాలని హోండా మోటార్స్ భావించింది.
undefined
కానీ ఏడు నెలల ముందే బీఎస్- 6 ప్రమాణాలతో కూడిన హోండా యాక్టీవా 125 మోడల్ స్కూటర్ విపణిలోకి వచ్చేస్తోంది. బీఎస్-4 ప్రమాణాలతో కూడిన ‘హోండా యాక్టీవా 12 ఎఫ్ఐ’ స్కూటర్‌లో ఉన్నట్లే 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉండనున్నదని హోండా మోటార్స్ వర్గాలు తెలిపాయి.
ఈ స్కూటర్ తరహా బైక్‌కు ప్రత్యేకంగా రూపొందించిన ‘ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (పీజీఎం-ఎఫ్ఐ), ఎన్ హాన్స్‌డ్ స్మార్ట్ పవర్‌ను జత చేస్తున్నట్లు హోండా మోటార్స్ తెలిపింది.
అంతా చూడటానికి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన యాక్టీవా.. బీఎస్-4 ప్రమాణాలతో కూడిన స్కూటర్‌ను పోలి ఉన్నా కొత్తగా 26 అదనపు హంగులు జత చేసింది హోండా మోటార్ సైకిల్స్. హెడ్ లైట్, ఫ్రంట్, సైడ్ ప్యానెళ్లలో స్వల్ప మార్పులు చేసింది. సైడ్ స్టాండ్ వేసి ఉంటే ఇంజన్ ఆన్ కాకుండా ఈ స్కూటర్‌లో ప్రత్యేక వ్యవస్థను చేర్చారు.
కొన్ని అనలాగ్, కొన్ని డిజిటల్ ఫీచర్లతో సగటున ఇంధన ఖర్చు, మిగిలిన ఉన్న ఇంధనం, స్పీడో మీటర్, ఒడో మీటర్ వంటి కాంపొనెంట్స్‌ను స్కూటర్ ఫ్రంట్ భాగంలో చేర్చారు. అయితే బీఎస్ -6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ వాహనం ధర 10 శాతం నుంచి 15 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ పేర్కొంది.