మూడు దశాబ్దాల క్రితం ద్విచక్ర వాహనాల మార్కెట్లో హీరో హోండాదే పై చేయి. తర్వాత కాలంలో రెండు సంస్థలు విడిపోయాయి. తాజాగా ద్విచక్ర వాహనాల మార్కెట్లో మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నాయి రెండు సంస్థలు
మోటారు సైకిళ్లు, స్కూటర్ల విక్రయాల్లో హీరో మోటో కార్ప్స్‌దే పై చేయి అవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో హీరో, హోండా సంస్థల మధ్య అంతరం 20 లక్షల బైక్‌ల తేడా ఉంది. దేశవ్యాప్తంగా అమ్మకాలు పడిపోయినా, ఎప్పటికప్పుడు నూతన బైక్‌లను మార్కెట్లోకి ఆవిష్కరిస్తూ హీరో మోటో కార్ప్స్ దూసుకెళుతున్నది.
దీంతో హోండా మోటార్ సైకిల్స్‌కు తిప్పలు తప్పడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో పవన్ ముంజాల్ సారథ్యంలోని హీరో మోటో కార్ప్స్ 78,20,745 వాహనాలు విక్రయించింది. ఇదే సమయంలో హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ కేవలం 59,00,840 యూనిట్ల అమ్మకాలు జరిపింది.
undefined
హీరో మోటో కార్ప్స్, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థల మధ్య అంతరం 19,19,905గా ఉంది. 2017-18లో హీరో 75,87,130 బైకులను విక్రయిస్తే, హోండా మోటార్ బైక్స్, స్కూటర్స్ 61,23,877 అమ్ముడయ్యాయి. వీటి మధ్య తేడా 14,63,253గా ఉంది.
ప్రీమియం సెగ్మెంట్ లోకి ప్రవేశించి అత్యధిక వ్రుద్దిని నమోదు చేసుకుంటున్న 125 సీసీ స్కూటర్ విభాగంలోనూ డెస్టెనీ 125 సీసీ బైక్ ప్రైవేశపెట్టడం తమకు కలిసి వచ్చిందని హీరో మోటో కార్స్స్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు 2020 నాటికి హీరో మోటార్ సైకిల్స్ సంస్థను దాటేయాలని మొదటి స్థానాన్ని ఆక్రమించాలని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. కానీ ఆ దిశగా అదే స్థాయిలో పనితీరు కనబర్చడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
గతేడాది సెప్టెంబర్ నెలలో బీమా ప్రీమియం పెంచేయడంతో హోండా విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడింది. ముఖ్యంగా పండుగల సీజన్‌లోనూ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్‌కు నిరాశ తప్పలేదు. ప్రీ ఫెస్టివల్ నిల్వలన్నీ పూర్తిగా హై ఇన్వెంటరీస్‌గా నిలిచాయి.
ఈ నేపథ్యంలో డీలర్లకు దేశీయ డిమాండ్‌కు అనుగుణంగానే సరిపడా మాత్రమే వాహనాలను సరఫరా చేస్తామని, తమ వ్యూహాన్ని పున: సమీక్షించుకుంటామని హోండా మోటార్ సైకిల్స్ తెలిపింది.
ఇక పుణె కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న బజాజ్ ఆటో 42,36,873 వాహనాల విక్రయంతో మూడో స్థానంలో నిలిచింది. 2017-18లో అమ్ముడు పోయిన 33,69,334 బైక్‌లు, స్కూటర్లతో గతేడాది బజాజ్ ఆటోమొబైల్ సేల్స్‌లో 26 శాతం పురోగతి కనిపించింది.
నాలుగో స్థానంలో టీవీఎస్ మోటారు సైకిల్స్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో 37.57 లక్షల బైక్‌లను విక్రయించింది. 2017-18తో పోలిస్తే టీవీఎస్ మోటార్స్ 12 శాతం పురోగతి నమోదు చేసింది.