ఇండోనేషియా మాస్టర్స్... ఇంటిదారిపట్టిన పీవీ సింధు

By telugu teamFirst Published Jan 17, 2020, 8:51 AM IST
Highlights

తొలి గేమ్ గెల్చుకొని ఆధిక్యం కనబర్చిన సింధు.. సెకండ్ గేమ్‌లో ప్రత్యర్థిని నిలవరించడంలో విఫలమైంది. టకహషి సుదీర్ఘ ర్యాలీలు, బలమైన స్మాష్‌లతో విరుచుకుపడటంతో సింధు ఒకనొక దశలో గేమ్ 8-2తో వెనుకంజలో నిలిచింది. 

ఇండోనేసియా మాస్టర్‌ సూపర్‌ - 500 టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. తొలి రౌండ్ లో విజయం సాధించి కాస్త ఆశలు చిగురింప చేసిన సింధు.. రెండో రౌండ్ లో వెను దిరిగింది. సైనా నెహ్వాల్‌, సాయిప్రణీత్‌, కిదాంబి శ్రీకాంత్‌, సౌరభ్‌ వర్మలు తొలి రౌండ్‌లోనే ఓడి బుధవారం ఇంటిదారిపట్టగా .. తాజాగా పీవీ సింధు కూడా నిష్క్రమించింది. 

గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్ లో ఐదో సీడ్ సింధు 21-16, 16- 21, 19- 21-19తో ప్రపంచ 14వ ర్యాంకర్ సయాక టకహషి(జపాన్) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. గంటా ఆరు నిమిషాలపాటు హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి అనవసర తప్పిదాలతో పరాజయం పాలైంది.

తొలి గేమ్ గెల్చుకొని ఆధిక్యం కనబర్చిన సింధు.. సెకండ్ గేమ్‌లో ప్రత్యర్థిని నిలవరించడంలో విఫలమైంది. టకహషి సుదీర్ఘ ర్యాలీలు, బలమైన స్మాష్‌లతో విరుచుకుపడటంతో సింధు ఒకనొక దశలో గేమ్ 8-2తో వెనుకంజలో నిలిచింది. అనంతరం వరుస పాయింట్లు సాధించినప్పటికీ ప్రత్యర్థిని అందుకోలేక గేమ్‌ను చేజార్చుకుంది. మూడో గేమ్‌లో 3-3తో ప్రారంభించిన సింధు గట్టిపోటీనిచ్చింది. 

Also Read ఒలింపిక్స్ వేళ కలవరపెడుతున్న భారత షట్లర్లు...ఈ సారైనా మెరిసేనా?

 అయితే 18-18 గా ఉన్న సమయంలో నెట్ డ్రాప్స్‌తో అనవసరం తప్పిదాలు చేసిన సింధు.. రెండు పాయింట్ల చేజార్చుకుంది. మరొక పాయింట్ సాధించినా టకహషి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇక వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత సింధు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోవడం గమనార్హం. 

కనీసం క్వార్టర్స్ కూడా దాటలేకపోయింది. అంతేకాకుండా ఈ ఏడాది ఆమెకు ఇది వరుసగా రెండో పరాజయం. సీజన్ ఫస్ట్ టోర్నీ మలేసియా మాస్టర్స్‌లో సింధు క్వార్టర్స్‌లో నిష్క్రమించింది. మరో 7 నెలల్లో ఒలింపిక్స్ జరగనుండగా.. సింధు పేలవ ఫామ్ బ్యాడ్మింటన్ అభిమానులను కలవరపెడుతుంది.

click me!