Thomas Cup 2022: భారత క్రికెట్ కు 1983 వరల్డ్ కప్.. బ్యాడ్మింటన్ కు థామస్ కప్ అంతకుమించి..

By Srinivas MFirst Published May 15, 2022, 8:28 PM IST
Highlights

India Won Thomas Cup 2022: థామస్ కప్ లో విజయం సాధించిన భారత జట్టు పై ప్రశంసల వర్షం కురుస్తోది.  ఇండోనేషియా ను 3-0తో ఓడించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు.. సరికొత్త చరిత్రను లిఖించింది.  

భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ.. ప్రతిష్టాత్మక థామస్ కప్ ను కైవసం చేసుకున్నది టీమిండియా. బ్యాంకాక్ లో  ఆదివారం జరిగిన థామస్ కప్ ఫైనల్ లో  14 సార్లు ఛాంపియన్ ఇండోనేషియాను 3-0తో మట్టికరిపించిన భారత షట్లర్లు.. నూతన చరిత్రను రాశారు. 73 ఏండ్ల థామస్ కప్ చరిత్రలో భారత్ కు తొలి స్వర్ణం అందించారు. లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్, కిదాంబి శ్రీకాంత్ లు ఇండోనేషియా  బృందానికి చుక్కలు చూపించారు. కాగా.. ఈ విజయం భారత బ్యాడ్మింటన్ కు ఫుల్ కిక్కిచ్చింది. భారత క్రికెట్ జట్టుకు 1983 వన్డే ప్రపంచకప్ ఎలాగో..  బ్యాడ్మింటన్ కు కూడా థామస్ కప్ అలాంటిదేనని కొనియాడుతున్నారు.  

భారత జట్టు విజయంపై మాజీ ఆసియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ దినేశ్ ఖన్నా మాట్లాడుతూ..  ‘ఇది అద్భుత విజయం. క్రికెట్ లో భారత్ కు 1983 వన్డే వరల్డ్ కప్ ఎలాగో.. బ్యాడ్మింటన్  లో థామస్ కప్ అలాంటిదే.. ఈ క్రీడలో  థామస్ కప్ కు ఎంతటి ఖ్యాతి ఉందో మనకు తెలుసు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇంతకంటే గొప్ప విజయం మరోకటి ఉండదని నేను కచ్చితంగా చెబుతాను... 

భారత బ్యాడ్మింటన్ కు ఇదొక గొప్ప రోజు.  దేశానికి గర్వకారణం. ఇవాల శ్రీకాంత్, సాయిరాజ్, లక్ష్య సేన్ లు ఆడిన  ఆట గురించి వర్ణించడానికి మాటలు చాలడం లేదు. ముఖ్యంగా శ్రీకాంత్ ఆట అద్బుతం...’ అని కొనియాడారు. 

ఇక ఇదే విషయమై మాజీ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్  ఛాంపియన్, ఇండియా చీఫ్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ..  ‘బ్యాడ్మింటన్ పదజాలంలో చెప్పాలంటే ఇది క్రికెట్ లో 1983 ప్రపంచకప్ లో భారత్ సాధించినదానికంటే గొప్ప విషయం. మనం గెలుస్తామని ఎవరూ ఊహించలేదు.  భారత విజయం పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. ఈ విజయం ఒక్క బ్యాడ్మింటన్ కే కాదు..  భారత క్రీడా రంగానికి కూడా గొప్ప విషయం. క్రికెట్ గురించి పక్కనబెడితే  మన దేశంలో మిగతా ఆటల గురించి మాట్లాడేది, చర్చించుకునేది చాలా తక్కువ. కానీ థామస్ కప్ విజయం తర్వాత  ఆ స్థానంలో తప్పకుండా బ్యాడ్మింటన్ చేరుతుంది. మలేషియా, డెన్మార్క్ వంటి దేశాలను క్వార్టర్స్, సెమీస్ లో  ఓడించి ఫైనల్ లో అత్యంత పటిష్టమైన ఇండోనేషియాను ఓడించాం...  భారత బృందం గొప్పగా ఆడింది..’ అని చెప్పుకొచ్చాడు. 

 

Thank you sir ❤️😍🙏🏽🇮🇳 means a lot coming from you https://t.co/w4Jd0RMwuN

— Kidambi Srikanth (@srikidambi)

ఆదివారం ఐపీఎల్ లో  లక్నో సూపర్ జెయింట్స్-రాజస్తాన్ రాయల్స్ టాస్ సందర్భంగా  మాట్లాడిన భారత దిగ్గజ క్రికెటర్, 1983 ప్రపంచకప్ లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్న సునీల్ గవాస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు అనామక జట్టుగా వెళ్లిన తాము ప్రపంచకప్  తో తిరిగి వస్తామని ఎవరూ అనుకోలేదని.. ఇప్పుడు థామస్ కప్ లో కూడా భారత్ ఫైనల్ కు వెళ్లడం.. కప్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదని... కానీ టీమిండియా చేసి చూపించిందని  అన్నాడు. ఈ విజయం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని కొనియాడాడు. 

73 ఏండ్ల  థామస్ కప్ చరిత్రలో ఇంతవరకు ఇండోనేషియా (14 సార్లు), చైనా  (10 సార్లు), మలేషియా (నాలుగు సార్లు)  విజేతలుగా నిలిచాయి.  ఒకసారి జపాన్  టైటిల్ దక్కించుకుంది. 2014లో డెన్మార్క్ (థామస్ కప్ గెలిచిన తొలి ఆసియేతర జట్టు) గెలిచింది.  బ్యాడ్మింటన్ ఆడే ప్రతి దేశం థామస్ కప్ కోసం హోరాహోరిగా పోరాడుతున్నాఈ ఐదు దేశాలు మాత్రమే ఇప్పటివరకు విజేతలుగా నిలిచాయి.  కానీ ఆదివారం భారత్ ఆ చరిత్రను తిరగరాసింది. 1983లో అంతేకదా.. అనామక జట్టుగా వెళ్లిన కపిల్ సేన.. లార్డ్స్ లో వన్డే ప్రపంచకప్ ను ముద్దాడి భారత్ లో  క్రికెట్ కు ఉన్న క్రేజ్ ను అమాంతం పెంచింది. ఇక ఆ జాబితాలో ఇప్పట్నుంచి బ్యాడ్మింటన్ అత్యంత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిద్దాం. 

click me!