దేశీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాల విక్రయాల్లో పురోగతి సింగిల్ డిజిట్ కు పరిమితమైనా.. ఎగుమతుల్లో బాగానే పురోగతి సాధించాయి. ప్రత్యేకించి స్కూటర్ల విభాగంలో ఎక్కువ డిమాండ్ కనిపించింది. ఒక మొత్తంగా బజాజ్ ఆటో ఎక్కువ మోటారు సైకిళ్లు, స్కూటర్లను ఎగుమతి చేసిందని సియామ్ పేర్కొంది.
దేశీయ మార్కెట్లలో అమ్మకాలు తగ్గినా ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో 2018-19 ఆర్థిక సంవత్సరం ఏఫ్రిల్ - జనవరి మధ్య 19.49 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో 23,09,805 ద్విచక్రవాహనాలు ఎగుమతి కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 27,59,935 ద్విచక్రవాహనాలు ఎగుమతి అయినట్లు భారత ఆటోమొబైల్ తయారీ సమాఖ్య (సియామ్) నివేదిక తెలిపింది.
మోటారు సైకిళ్లు, స్కూటర్ల విభాగానికి అధికంగా డిమాండ్ ఉన్నదని సియామ్ తెలిపింది. ప్రత్యేకించి మోటారు బైక్‌లు, మోపెడ్‌లకంటే స్కూటర్ల సెగ్మెంట్‌కే ఎక్కువ డిమాండ్ ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది స్కూటర్ల ఎగుమతులు 26.67 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఏఫ్రిల్-జనవరి మధ్య స్కూటర్లు 2,62,253.. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 3,32,197 ఎగుమతి అయ్యాయి.
undefined
మొత్తం ద్విచక్ర వాహనాల్లో మోటార్ సైకిళ్లు గత ఆర్థిక సంవత్సరం ఏఫ్రిల్-జనవరి మధ్య 20,34,250 ఎగుమతి కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 18.61 వృద్ధి నమోదై 24,12,800 ఎగుమతి అయ్యాయి.
గత ఆర్థిక సంవత్సరం ఏఫ్రిల్ - జనవరి మధ్య మోపెడ్‌లు 13,302 ఎగుమతి కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 12.3 శాతం వృద్ధి నమోదై 14,938 ఎగుమతి అయ్యాయి. ఎగుమతుల్లో బజాజ్ ఆటోదే అగ్రాసనం. 14, 50,766 యూనిట్ల బైక్‌లు, స్కూటర్లను బజాజ్ ఆటో ఎగుమతి చేసింది.
కంపెనీల వారీగా ఎగుమతులను పరిశీలిస్తే టీవీఎస్ మోటార్స్29.19 శాతం, బజాజ్ ఆటో 24.87, హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ 10.3, ఇండియా యమహా మోటార్ 2.39, హీరో మోటో కార్పొరేషన్స్ 5.74 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల మార్కెట్లలో డిమాండ్ పుంజుకోవడంతో టూ వీలర్స్ ఎగుమతులు పెరిగాయి.
టీవీఎస్ మోటార్స్ 5,04,799 బైక్స్, హోండా మోటార్ సైకిల్స్ 3,25,759 మోటారు సైకిళ్లు, స్కూటర్లు, యమహా మోటార్ సైకిళ్లు 2,09,352 బైక్‌లను ఎగుమతి చేశాయి. ఇక హీరో మోటో కార్ప్ 1,63,480 యూనిట్ల బైక్స్ ఎగుమతి చేసింది.
కానీ దేశీయ మార్కెట్లో టూ వీలర్ సేల్స్ కేవలం సింగిల్ డిజిట్ గ్రోథ్‌కే పరిమితమయ్యాయి. 2018 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ద్విచక్ర వాహనాల విక్రయాలు 1,81,25,656గా నమోదయ్యాయి.
సరిగ్గా గతేడాది ఇదే సమయంలో 1,67,71,630 టూ వీలర్స్ అమ్ముడు పోయాయి. దేశీయ మార్కెట్లో బైక్‌లు, స్కూటర్ల విక్రయంలో 8.07 శాతం పురోగతి మాత్రమే రికార్డైంది.