అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థలు భారతీయుడి మనస్సు దోచుకునేందుకు హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవల విడుదల చేసిన మోడల్ కార్లలో వాడిన డిజైన్లతోపాటు సరికొత్త డిజైన్లు జత కలిపి మార్కెట్లో ఆవిష్కరించేందుకు రంగం సిద్దం చేశాయి.
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత మార్కెట్‌ను హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లు ముంచెత్తనున్నాయి. ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మొదలు టాటామోటార్స్, హ్యుండాయ్ మోటార్స్ తదితర సంస్థల ఉత్పత్తులు పోటెత్తనున్నాయి. మార్కెట్లో హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్ల సేల్స్ భారతదేశంలో భారీగా సాగుతుండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో భారతదేశంలో కార్లను ఉత్పత్తి చేస్తున్న ఆటోమొబైల్ సంస్థలన్నీ హ్యాచ్ బ్యాక్ మోడళ్లపైనే కేంద్రీకరించాయి. అంతే కాదు ఈ మోడల్ కార్ల కొనుగోలు దారులకు భారీగా ఆఫర్లు అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ నెలాఖరులోగా మార్కెట్లోకి విడుదల కానున్న మోడల్ కార్ల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం...
మారుతి సుజుకి బుధవారం ఆవిష్కరించనున్న ఐదో తరం వాగన్ ఆర్ మోడల్ కారు కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాగన్ ఆర్ మోడల్ కారు కంటే అది పొడవుగా, వెడల్పు కలిగి ఉంటుంది. ఏడు వేరియంట్లలో మార్కెట్లోకి రానున్నది. బ్లాక్ గ్రిల్లె, లోయర్ డంపర్‌తోపాటు టాల్ హెడ్ లైట్లనూ కూడా రీ డిజైన్ చేశారు. స్విఫ్ట్, ఎర్టిగా మోడల్ కార్ల వంటి రూఫ్ టాప్.. తాజా వాగన్ ఆర్ మోడల్ కార్లకు అందుబాటులోకి రానున్నది. ఏడు వేరియంట్ కార్లలో నాలుగు మోడల్ కార్లు ఏజీఎస్ ఆటోమేటిక్ గేర్ బ్యాక్ కలిగి ఉండటం విశేషం.
2018 ఆటో ఎక్స్ పోలో టాటా మోటార్స్ ప్రదర్శించిన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు‘టాటా 45ఎక్స్’. ఇంతకుముందు మార్కెట్లోకి విడుదల చేసిన హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లు టాటా టియాగో, టైగోర్ తరహాలోనే ఉన్నా మరింత మెరుగ్గా టాటా 45ఎక్స్ మోడల్ కారు ఇంజిన్ అభివ్రుద్ది చేశారు. టియాగో డీజిల్, టైగోర్ పెట్రోల్ వినియోగంతో నడిస్తే టాటా 45ఎక్స్ మోడల్ కారు పెట్రోల్, డీజిల్ వినియోగానికి వీలుగా ఉంటుంది. ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే టాటా 45ఎక్స్ మోడల్ కారు డిజైనింగ్‌లో సమూల మార్పులు ఉంటాయి.
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం ‘హ్యుండాయ్’ 2013లో మార్కెట్లో ఆవిష్కరించిన ‘గ్రాండ్ ఐ10’ మోడల్ కారు తర్వాత హ్యాచ్ బ్యాక్ మోడల్‌లో కారు ఆవిష్కరణ రాలేదు. కానీ కొనుగోలు దారులు దీనిపైనే ఎక్కువగా మక్కువ పెంచుకోవడంతోపాటు అత్యధికంగా భారతదేశంలో అమ్ముడు పోయిన కారు కూడా. దీంతో హ్యుండాయ్ మోటార్స్ సంస్థ కూడా ఇతర సంస్థల ఉత్పత్తులకు పోటీగా ‘గ్రాండ్ ఐ10’ మోడల్ కారును రీ డిజైన్ చేసి మార్కెట్లోకి తేవాలని ప్రయత్నిస్తున్నది. ఇంతకుముందు ‘గ్రాండ్ ఐ10’ కారుతో పోలిస్తే తాజాగా మార్కెట్‌ను ముంచెత్తనున్న నూతన మోడల్ కారు కొంచెం పొడవుగా ఉంటుంది. అయితే నాలుగు మీటర్ల లోపే ఉంటుంది. ‘హ్యుండాయ్’ సిగ్నేచర్ ఫ్లౌడిక్ డిజైన్‌ను మరిపిస్తుంది.
ఇటీవల ‘ఫోర్డ్ ఆస్పైర్’ అనే పేరుతో మార్కెట్లోకి కొత్త మోడల్ కారును ఆవిష్కరించిన ‘ఫోర్డ్’.. తాజాగా ‘ఫిగో ఫేస్ లిఫ్ట్’ మోడల్ కారును రూపుదిద్దుకున్నది. త్వరలో మార్కెట్లోకి రానున్న ఫోర్ట్ ఫిగో ఫేస్ లిఫ్ట్.. సర్దుబాట్లతో కూడిన హెడ్ ల్యాంప్స్, న్యూ బంపర్ ఏర్పాటు కానున్నది. కారు లోపల మాత్రం ఫోర్డ్ ఆస్పైర్ సెడాన్ మోడల్ కారును తలపిస్తుంది. ఫోర్ట్ ఫిగో ఫేస్ లిఫ్ట్ మోడల్ కారు రెండు మోడళ్ల పెట్రోల్ ఇంజిన్లతో మార్కెట్లో అడుగు పెట్టనున్నది. 1.2 లీటర్ల 3 సిలిండర్, 1.5 లీటర్ల 3 సిలిండర్స్ సామర్థ్యంతో కూడిన ఇంజిన్లను డిజైన్ చేశారు. ఈ కారును సీఎన్జీ గ్యాస్ తోనూ నడుపొచ్చు.
గతేడాది కార్ల విక్రయాల్లో ఉత్తమ మోడల్‌గా నిలిచింది మారుతి సుజుకి వారి బాలెనో. ఈ మోడల్ కారుకు సరికొత్త మెరుగులు దిద్ది మార్కెట్లోకి తేవాలని మారుతి సుజుకి తలపోస్తున్నది. ఫేస్ లిఫ్ట్ పేరుతో మార్కెట్లోకి రానున్న బాలెనో హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు నూతన గ్రిల్లె, నూతన బంపర్ కలిగి ఉంటుంది. టెయిల్ ల్యాంప్స్‌ను కూడా రీ డిజైన్ చేశారు. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన సియాజ్ సెడాన్ మోడల్ కారును తలపింపజేస్తుందని, ఈ మోడల్ కారు క్యాబిన్ ప్రజలను భారీగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.