దేశంలో కార్లు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో దేశంలోని కార్ల ఉత్పత్తి రాష్ట్రాల జాబితాలోకి ఆంధ్రప్రదేశ్ కూడా చేరనున్నది. దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ ‘కియా మోటార్స్’ అనంతపూర్ జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద చేపట్టిన ప్లాంట్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది
ఈ నెలాఖరుకల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ జిల్లాలో ఒక కీలక ఘట్టం ఆవిష్క్రుతం కానున్నది. దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ ‘కియా మోటార్స్’ ప్రయోగాత్మకంగా కార్లను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతోంది. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం దగ్గర ‘కియా మోటార్స్ ఇండియా’ప్లాంట్ నిర్మాణ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది.
ఈ నెలాఖరుకల్లా అనంతపూర్ ప్లాంట్‌లో ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభిస్తామని కియా మోటార్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ చెప్పారు. తొలుత ఈ ప్లాంట్‌లో ‘ఎస్‌పీ 2ఐ’ కాన్సెప్ట్ ఎస్‌యూవీ వాహనాలు ఉత్పత్తి చేయాలని ఈ దక్షిణ కొరియా కార్ల దిగ్గజం భావిస్తోంది. గత ఏడాది జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ మోడల్‌ను ప్రదర్శించింది.
ఈ ఏడాది జూన్, జూలై నాటికి ఎస్‌పీ 2ఐ’ కాన్సెప్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో ఉంటుందని కియా మోటార్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ చెప్పారు. ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకొక కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తామన్నారు.
‘ఏటా మూడు లక్షలకుపైగా కార్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్‌లో ఈ నెలాఖరుకల్లా ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభిస్తామనే నమ్మకంతో ఉన్నాం. ముందుగా ఇక్కడ ‘ఎస్‌పీ 2ఐ’ కార్ల ఉత్పత్తి చేపడతాం’ అని భట్ చెప్పారు.
ప్రస్తుతం కంపెనీ ఈ కారు భారత మార్కెట్‌కు అనుగుణంగా ఉందా? లేదా? అనే విషయాన్నీ పరిశీలిస్తోంది. అంతర్జాతీయంగా కియా మోటార్స్‌కు ఇది 15వ ప్లాంట్. భారత్‌లో మాత్రం తొలి ప్లాంట్.
భారత మార్కెట్లో తన కార్లను కొనుగోలుదారులకు మరిం త చేరువ చేసేందుకు సరైన ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్)ని నియమించాలని కూడా కియా మోటార్స్ ఇండియా భావిస్తోంది.
ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ కియా మోటార్స్ కార్లకు టెన్నిస్ స్టార్ రఫెల్ నడాల్ ప్రచారకర్తగా ఉన్నారు. భారత మార్కెట్ కోసం కూడా ప్రత్యేకంగా ప్రచారకర్తను నియమిస్తామని కియా మోటార్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ చెప్పారు. అయితే ప్రచారకర్తగా ఎవరి ని నియమించాలనే విషయం ఇంకా నిర్ణయించలేదన్నారు.
స్థానికంగా ఉత్పత్తి అయ్యే వీలైనన్ని విడి భాగాలను వినియోగించడం ద్వారా కార్ల ఉత్పత్తి ఖర్చుల్ని తగ్గించుకోవాలని కియా మోటార్స్ భావిస్తోంది. ఇందుకోసం ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న ఎర్రమంచి గ్రామంతో పాటు సమీపంలోని గుడిపల్లి గ్రామం దగ్గర 250 ఎకరాల్లో ఆటోమొబైల్ విడి భాగాలు తయారు చేసే అనుబంధ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి.
కియో మోటార్స్ కంపెనీ 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.14,200 కోట్లు) పెట్టుబడితో రెండు దశల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో తొలి దశ కోసం 110 కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేస్తోంది. 2021 నాటికి మరో 80 కోట్ల డాలర్ల పెట్టుబడితో అనంతపురం ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరించాలని భావిస్తోంది. రెండో దశ విస్తరణతో ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 10,000కు చేరుతుందని అంచనా.
తమ కార్లను కొనుగోలుదారులకు వీలైనంత చేరువలో ఉంచాలని కియా మోటార్స్ భావిస్తోంది. ఇందుకోసం ప్రధాన నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోనూ డీలర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు కియా మోటార్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ చెప్పారు. కొన్ని చోట్ల ప్రత్యేక షోరూమ్‌లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
ఇప్పటి వరకు కొత్తగా మార్కెట్లో ప్రవేశించిన మరే కార్ల కంపెనీ ఏర్పాటు చేయనంత పెద్ద స్థాయిలో తమ డీలర్ల నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని కియా భావిస్తోంది. దీనికితోడు ఖాతాదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం దగ్గర 535.50 ఎకరాల్లో కియా మోటార్స్ ప్రధాన ప్లాంట్ ఏర్పాటవుతున్నది. ఇక 36 ఎకరాల్లో ఉద్యోగుల కోసం టౌన్‌షిప్ సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకించి ఉద్యోగుల శిక్షణ కోసం 11.2 ఎకరాల్లో శిక్షణా కేంద్రం నిర్మిస్తున్నారు.
తొలి దశలో ప్రత్యక్షంగా 4,000 మందికి, పరోక్షంగా 7,000 మందికి ఉపాధి లభించనున్నది. విడిభాగాల ఉత్పత్తి కోసం సమీపంలోనే 40 అనుబంధ కంపెనీలు, 100 ఎకరాల్లో రైల్వే సైడింగ్, 48.47 ఎకరాల్లో ట్రక్ టెర్మినల్ ఏర్పాటు అందుబాటులోకి రానున్నాయి.