ఇతర ఆటోమొబైల్ సంస్థలతో పోలిస్తే విక్రయాల్లో వెనుకబడి ఉన్న వోక్స్ వ్యాగన్ ‘ఇండియా 2.0’ ప్రాజెక్టు పేరిట బ్లూ ప్రింట్ అమలు చేయడానికి పూనుకున్నది. ఈ క్రమంలో భారతదేశంలో రూ.2000 కోట్లు కేవలం పరిశోధన, అభివ్రుద్ధి రంగాలపైనే పెట్టుబడులను పెట్టనున్నది. పుణెలో తొలి టెక్నాలజీ కేంద్రాన్ని వోక్స్ వ్యాగన్ ప్రారంభించింది.
జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్.. మహారాష్ట్రలోని పుణెలో నూతన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కేంద్రాన్ని ప్రారంభించింది. భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి రంగాల్లో రూ.2000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.
జెక్ ప్రధాని అండ్రెజ్ బాబిస్ పుణెలోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ప్రారంభించారు. భారతదేశంలో రూ.7900 కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న వ్యూహంలో ఇది తొలి అడుగు అని వోక్స్ వ్యాగన్ తెలిపింది.
వోక్స్ వ్యాగన్ 95 శాతం స్థానిక పరికరాల తయారీ లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. ప్రత్యేకించి ‘ఎంక్యూబీ ఏఓ’ వంటి పరికరాలను స్థానికంగానే తయారు చేయాలని వోక్స్ వ్యాగన్ సంకల్పించింది. నూతన టెక్నాలజీ సెంటర్‌లో 250 మంది ఇంజినీర్లకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
వోక్స్ వ్యాగన్ గ్రూప్ భారత్ అధిపతి గుర్ ప్రతాప్ బొపరాయి మాట్లాడుతూ 2020-21 నాటికి స్కోడా, వోక్స్ వ్యాగన్ మోడల్ కార్ల తొలి ఉత్పత్తులను మార్కెట్లోకి తేగలమని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఎంక్యూబీ ఏఓ ప్లాట్‌ఫామ్‌పై మిడ్ సైజ్డ్ ఎస్‌యూవీ మోడల్ కారును మార్కెట్లో ఆవిష్కరిస్తామన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ గల భారతదేశంలో ఎప్పటికప్పుడు ఐదు శాతం వ్రుద్ధి లక్ష్యాలను సాధిస్తూ వచ్చే మూడు, నాలుగేళ్లలో 1.8-1.9 లక్షల కార్లను విక్రయించాలని వోక్స్ వ్యాగన్ లక్ష్యంగా పెట్టుకున్నది.
తద్వారా ‘ఇండియా 2.0’ ప్రాజెక్టు పేరిట భారతదేశంలో స్కోడా ఇండియా ఆధ్వర్యంలో వోక్స్ వ్యాగన్ తన ఫుట్ ప్రింట్ పెంచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో పెరుగుతున్న మార్కెట్లో రెండు శాతానికి తగ్గకుండా విక్రయాలు సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
కానీ 2018లో వోక్స్ వ్యాగన్ కార్ల విక్రయాలు అతి తక్కువగా నమోదయ్యాయి. కాకపోతే స్కోడా మోడల్ కార్లలో ప్రీమియం సెలూన్, ఎస్‌యూవీ మోడల్ కార్లకు గిరాకీ ఉంది. 2021-21 తర్వాత ప్రతి మూడు నుంచి ఆరునెలల్లో మూడు మోడల్ కార్లను మార్కెట్లో ఆవిష్కరించాలని వోక్స్ వ్యాగన్ తలపెట్టింది.