డీజిల్ వాహనాల నిషేధం? ఆ కార్లపైనే కస్టమర్ల మోజు

By Rekulapally Saichand  |  First Published Dec 2, 2019, 11:57 AM IST

కార్ల కొనుగోలుదారులు పెట్రోల్ వేరియంట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఏప్రిల్ నుంచి బీఎస్-6 ప్రమాణాలు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్ కార్ల తయారీని నిలిపేయనున్నట్లు ప్రధాన ఆటోమొబల్ సంస్థలు ఇప్పటికే ప్రకటించేశాయి. గతేడాదితో పోలిస్తే పెట్రోల్ వేరియంట్ కార్ల సేల్స్ 17 నుంచి 35 శాతానికి పెరిగాయి. 


న్యూఢిల్లీ : ఇండియాలో ఎస్‌‌యూవీ కార్లను కొనేవారు ఎక్కువగా పెట్రోల్ వెర్షన్‌‌నే కొంటున్నారు. రోడ్లపై డీజిల్ వాహనాలను నిషేధించాలని ప్లాన్స్‌‌తోపాటు త్వరలోనే బీఎస్–6 నిబంధనల అమలు కాబోతుండటమే ఇందుకు కారణమని తాజా నివేదిక‌లు తెలిపాయి.

2019 సెప్టెంబర్‌‌‌‌లో అమ్ముడుపోయిన అన్ని యుటిలిటీ వెహికిల్స్‌‌లో 35% పెట్రోల్‌‌తో నడిచేవే ఉన్నాయి. ఏడాది క్రితం వీటి అమ్మకాలు 17 శాతమే. వచ్చే కొన్ని నెలల్లో ఈ ట్రెండ్ మరింత పెరగనుందని, పెట్రోల్ వాహనాల విక్రయాలే ఎక్కువని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంటున్నారు. బీఎస్–6 నిబంధనలు అమల్లోకి వచ్చాక స్మాల్, మిడ్‌‌ సైజు ఎస్‌‌యూవీ అమ్మకాల్లో పెట్రోల్‌‌ వెహికిల్సే అత్యధికంగా ఉంటాయని పేర్కొన్నారు.

Latest Videos

also read: మారుతీ మరో ఘనత.. 2 కోట్ల వాహనాలు విక్రయం!

ఇదిలా ఉంటే పెట్రోల్, డీజిల్ వాహనాల మధ్య ధరల్లో భారీ వ్యత్యాసం ఏర్పడనున్నది. దీంతో పెట్రోల్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. భవిష్యత్‌లో వీటికి డిమాండ్ మరింత పెరుగనున్నదని మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. 

మారుతి సుజుకి తన ఎర్టిగా కారును పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో విడుదల చేయగా, దాదాపు 56 శాతం సేల్స్ పెట్రోల్ వేరియంట్ నుంచే ఉండటం గమనార్హం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి విటారా బ్రెజా, ఎస్ క్రాస్ మోడల్ ఎస్‪యూవీ వాహనాల్లో డీజిల్ వేరియంట్లను నిలిపేయాలని మారుతి సుజుకి నిర్ణయించింది. 

మరోవైపు పెట్రోల్‌‌కు, డీజిల్‌‌కు మధ్యనున్న ధరల వ్యత్యాసం కూడా ప్రస్తుతం చాలా సిటీల్లో రూ.5కు తగ్గింది. 2012 మేలో ఈ రెండింటి మధ్య రూ.31 తేడా ఉండేది. ఒడిశా, గోవా, గుజరాత్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు పెట్రోల్ కంటే డీజిలే అత్యధిక ధర పలుకుతోంది. అప్పట్లో కాస్ట్ బెనిఫిట్‌‌తో డీజిల్ వెహికిల్స్‌‌ కొనేవారు. కానీ ఇప్పుడు అది కూడా లేదు. 

Also Read: ఎలక్ట్రిక్ వాహనాలు: తోషిబా సంస్థతో కేరళ ప్రభుత్వం డీల్...

మరోవైపు డీజిల్ వెహికిల్స్‌‌తో పర్యావరణం కూడా బాగా దెబ్బ తింటోంది. పర్యావరణంపై కస్టమర్లు స్పృహతోనే ఉంటున్నారని, కాలుష్యం తగ్గించడం కోసం చాలా మంది డీజిల్ వెహికిల్స్‌‌ కొనడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. కియా సెల్టోస్, ఎంజీ హెక్టార్ లాంటి కొత్త వెహికిల్స్‌‌ కూడా ప్రస్తుతం పెట్రోల్ వెర్షన్లలోనే లాంచ్ అయ్యాయి.

దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్స్ తాజా వెన్యూ విక్రయాల్లో 65 శాతం వరకు పెట్రోల్ వేరియంట్ కార్లేనని ఆ సంస్థ సేల్స్ విభాగం అధిపతి వికాస్ జైన్ తెలిపారు. సాధారణంగా చిన్న కార్ల విభాగంలోనే పెట్రోల్ వేరియంట్లకు డిమాండ్ ఉంటుందని, శక్తివంతమైన కార్లను కొనుగోలు చేసే కొద్దీ డీజిల్ వేరియంట్లకు ప్రాధాన్యం ఇచ్చేవారని వికాస్ జైన్ తెలిపారు. 

ఇప్పుడు పరిస్థితి మారిందని చెప్పారు. క్రెటా మోడల్ కార్ల కొనుగోలులో 35 శాతం పెట్రోల్ వేరియంట్లేనని హ్యుండాయ్ సేల్స్ అధిపతి వికాస్ జైన్ తెలిపారు. గత నెలలో మారుతి సుజుకి విక్రయాల్లో 75 శాతం బీఎస్-6 వేరియంట్ కార్ల వాటా ఉంది. 

click me!