దేశ వ్యాప్తంగా నిత్యం వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ తప్పకుండా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వినియోగదారులకు కీలక సందేశం ఇచ్చారు. కారు ప్రయాణం ఇప్పుడు మరింత సురక్షితం కానుంది. అన్ని వాహనాలకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రభుత్వం తప్పనిసరి చేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. “ఆర్థిక నమూనాలకు కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి” అని కాంగ్రెస్ ఎంపీ కేటీఎస్ తులసి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రాజ్యసభలో గడ్కరీ ఈ విషయం మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా ప్రమాణాల ప్రకారం ఈవీలను తప్పనిసరిగా తయారుచేయాలని గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం భారతదేశం భద్రతా ప్రమాణాలు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు.
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీని ఫలితంగా దాదాపు 1.5 లక్షల మంది మరణిస్తున్నారని గడ్కరీ సభకు తెలియజేశారు. కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో తగిన రహదారి భద్రత చర్యలు చేపట్టాలని నితిన్ గడ్కరీ ప్రాంతీయ అధికారులు, జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరెక్టర్లను కోరారు. రోడ్డు భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించేందుకు రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంట్ సభ్యుల సంప్రదింపుల కమిటీ మొదటి సమావేశం మార్చి 24న జరిగింది. గడ్కరీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే బుధవారం నితిన్ గడ్కరీ టొయోటా కంపెనీకి చెందిన Toyota Mirai హైడ్రోజన్ పవర్డ్ ఎలక్ట్రిక్ కారులో పార్లమెంటుకు చేరుకున్నారు.
undefined
అయితే రహదారి భద్రతకు సంబంధించిన ఈ నియమం అక్టోబర్ 1, 2022 నుండి అమలులోకి వస్తుందని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఎయిర్ బ్యాగ్స్‌ల సంఖ్య పెంచడంతో కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతాయి. భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం భారతదేశంలో ముఖ్యమైనది. ఇది పెద్ద కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వాహనాలు ఉండనున్నాయి. ఇలా ఎయిర్‌బ్యాగ్స్ అన్ని సీట్లకు ఉండటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్నవారంత సురక్షితంగా బయటపడవచ్చు. అన్ని ప్యాసింజర్ వాహనాలకు కనీసం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే తప్పనిసరి చేసింది.
డ్రైవర్‌కు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి చేస్తూ జూలై 2019 నుండి అమలు చేయబడింది. అయితే జనవరి 1, 2022 నుండి ముందు సీట్లో కూర్చున్న ప్రయాణీకులకు ఇది తప్పనిసరి చేయబడింది. ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడం, పక్కపక్కనే ఢీకొనడం వంటి వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయాణికులను సురక్షితంగా ఉంచేందుకు వాహనాల్లో మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసింది కేంద్ర రవాణా శాఖ. వెనుక సీట్లలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, రెండు ట్యూబ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం వల్ల ప్రయాణికులందరికీ ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. భారతదేశంలో కారు ప్రయాణాన్ని సురక్షితంగా మార్చే దిశగా ఇదొక ముందడుగు అని గడ్కరీ అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2020లో హైవేపై మొత్తం 1.16 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగగా, ఇందులో 47,984 మంది మరణించారు.