లాక్‌డౌన్ ఎఫెక్ట్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ పొదుపు: 12 రీజనల్ ఆఫీసుల మూత

By narsimha lode  |  First Published Jun 14, 2020, 12:34 PM IST

 దిగ్గజ ఐకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కీలక నిర్ణయం తీసుకోనుంది. తమ వ్యాపారం పుంజుకోవడానికి అవసరమైన పలు చర్యలు చేపట్టబోతుంది. 



ముంబై: దిగ్గజ ఐకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కీలక నిర్ణయం తీసుకోనుంది. తమ వ్యాపారం పుంజుకోవడానికి అవసరమైన పలు చర్యలు చేపట్టబోతుంది. 
రాయల్ ఎన్‌ఫీల్డ్ పొదుపు చర్యల్లో భాగంగా దాదాపు 12 ప్రాంతీయ కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది. దేశంలోని డజన్‌కుపైగా ప్రాంతీయ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు సంస్థ ఉద్యోగులు తెలిపారు.

నష్టాలను పూడ్చుకునేందుకు గుర్గావ్, చెన్నై, బెంగుళూరు, ముంబై, రాంచీ, హైదరాబాద్, భువనేశ్వర్ తదితర రాష్ట్రాలలో ప్రాంతీయ కార్యాలయాలను వేంటనే మూసివేయనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. 

Latest Videos

ఉద్యోగుల తొలగింపు ఉండకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్యాలయాల మూసివేతపై  పరిపాలన విభాగం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యాలయాల మూసివేత నిర్ణయం తీసుకున్న విషయాన్ని రాయల్ ఎన్ ఫీల్డ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (సీసీఓ) లలిత్‌ మాలిక్‌ దృవీకరించారు.

కొన్ని ప్రాంతీయ కార్యాలయాలను మూసివేత నిర్ణయం తీసుకున్నామని లలిత్‌ మాలిక్‌ అన్నారు. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోం కొనసాగుతుందని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ లలిత్ మాలిక్ తెలిపారు. దీనివల్ల ఉద్యోగుల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అన్నారు.   
 
కేంద్ర ప్రభుతం లాక్‌డౌన్‌ను సడలించడం ద్వారా తమ అమ్మకాలు పుంజుకున్నాయని రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. దేశంలో సంస్థ డీలర్‌షిప్‌లను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 100కుపైగా నూతన రిటైల్‌ స్టోర్స్‌ను తెరవ బోతున్నట్లు ప్రకటించింది.

అత్యాధునిక బైక్‌ల‌ రూపకల్పనలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేక స్థానం సాధించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. 

క్లాసిక్, బుల్లెట్ మోటారు సైకిళ్ల తయారీకి రాయల్ ఎన్ ఫీల్డ్ పెట్టింది పేరు. మే నెలలో బుకింగ్స్ సాధారణంగానే నమోదు కావడంతోపాటు జూన్ తొలి వారం తర్వాత పెరిగినా రాయల్ ఎన్ ఫీల్డ్ తన రీజనల్ కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించడం గమనార్హం. 

ఎచిర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ లాల్ మాట్లాడుతూ ప్రస్తుతం సేల్స్ పట్ల సంత్రుప్తిగా ఉన్నామన్నారు. తమ సంస్థ బైక్స్ కోసం బుకింగ్స్ ట్రెండ్ సాధారణ స్థాయికి చేరుకుందని చెప్పారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ పరిధిలోకి 100 న్యూ స్టూడియో స్టోర్లు జతకలిశాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటిని 600లకు పెంచాలని రాయల్ ఎన్ ఫీల్డ్ లక్ష్యంగా పెట్టుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ నెట్ వర్క్ విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ వినోద్ దాసరి తెలిపారు. ఎచిర్ మోటార్స్ సంస్థ, రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థకు పేరెంట్ బాడీ. త్రీ టైర్, స్మాలర్ మార్కెట్లలో విస్తరణకు ప్రణాళికలు రూపొందించామన్నారు. 

click me!