విపణిలోకి కృత్రిమ మేధ ఎలక్ట్రిక్‌ బైక్‌ రివోల్ట్ ‘ఆర్వీ 400’

By rajesh yFirst Published Aug 29, 2019, 11:26 AM IST
Highlights

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం రీవోల్ట్‌ దేశంలోనే తొలిసారి కృత్రిమ మేధను జోడించి ఎలక్ట్రిక్‌ బైక్‌ను విడుదల చేసింది. రీవోల్ట్‌ ఆర్‌వీ 400 పేరుతో విడుదల చేసిన ఈ ఈ-బైక్‌ 125 సీసీ విభాగంలోని ద్విచక్రవాహన మార్కెట్‌లో మిగతా కంపెనీలతో పోటీ పడనున్నదని సంస్థ తెలిపింది. 

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం రీవోల్ట్‌ దేశంలోనే తొలిసారి కృత్రిమ మేధను జోడించి ఎలక్ట్రిక్‌ బైక్‌ను విడుదల చేసింది. రీవోల్ట్‌ ఆర్‌వీ 400 పేరుతో విడుదల చేసిన ఈ ఈ-బైక్‌ 125 సీసీ విభాగంలోని ద్విచక్రవాహన మార్కెట్‌లో మిగతా కంపెనీలతో పోటీ పడనున్నదని సంస్థ తెలిపింది. 

లిథియం-అయాన్‌ బ్యాటరీతో ఆర్వీ 400 మోటార్‌ సైకిల్‌ పరుగులు తీస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 156 కిలోమీటర్ల ప్రయాణించవచ్చని ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ధ్రువీకరించింది. ఈ బైక్ బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్‌ కావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. 

ఆర్వీ 400 మోటారు సైకిల్‌లో బయటకు తీసే వీలు గల (రిమూవబుల్‌) ఈ బ్యాటరీలను ఎక్కడైనా సులభంగా ఛార్జ్‌ చేసుకోవచ్చు. మూడు కిలోవాట్ల ఎలక్ట్రిక్‌ మోటార్‌ ద్వారా 85 కిలోమీటర్ల అత్యధిక వేగం అందుకోవచ్చు. ఆర్‌వీ 400లోని బ్యాటరీకి రీవోల్ట్‌ సంస్థ అపరిమిత వారంటీని అందిస్తోంది. 

రీవోల్ట్‌ ఆర్‌వీ 400 బైక్‌లో 4జీ ఎల్‌టీఈ సిమ్‌ వేసుకొనే వెసులుబాటుంది. దీని ద్వారా ఇంటర్నెట్‌కు అనుసంధానమై క్లౌడ్‌ ఆధారిత ఫీచర్లను పొందవచ్చు. రీవోల్ట్‌ మొబైల్‌ యాప్‌ సాయంతో రియల్‌ టైంలో మోటార్‌ సైకిల్‌లోని సమస్యలను గుర్తించవచ్చు. 

శాటిలైట్‌ నేవిగేషన్‌, బైక్‌ లొకేటర్‌, భద్రత కోసం జియో ఫెన్సింగ్‌ తదితర అధునాతన ఫీచర్లు యాప్‌ ద్వారా పొందొచ్చు. ఆర్వీ 400 బైక్‌ను అమెజాన్‌ ద్వారా గానీ, రీవోల్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆర్డర్‌ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ప్రస్తుతం న్యూఢిల్లీ, పుణె నగరాలకు మాత్రమే ఈ బైక్ అందుబాటులో ఉంది.

త్వరలోనే హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నై నగరాల్లోనూ ఆర్వీ 400 బైక్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ఆగస్టు 29 నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నట్లు రివోల్ట్ ప్రతినిధులు తెలిపారు. 

ఆర్వీ 400 బైక్‌ పూర్తి ధర ప్రకటించలేదు. వాయిదా పద్ధతిలో నెలకు రూ.3,499 చొప్పున 37 నెలలు చెల్లించి బైక్‌ కొనవచ్చని తెలిపారు. రీవోల్ట్‌ ఆర్‌వీ 400తోపాటు ఆర్‌వీ 300, ఆర్‌వీ 400 ప్రీమియం బైక్‌లను సైతం విడుదల చేశారు.
 

click me!