భారతదేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరులో భాగస్వామి కానున్నది. ప్రస్తుతం దేశీయంగా అమలులో ఉన్న లాక్ డౌన్ వల్ల జరిగే ఆర్థిక నష్టాన్ని నివారించే దిశగా మారుతి అడుగులేస్తున్నది.
న్యూఢిల్లీ: భారతదేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరులో భాగస్వామి కానున్నది. ప్రస్తుతం దేశీయంగా అమలులో ఉన్న లాక్ డౌన్ వల్ల జరిగే ఆర్థిక నష్టాన్ని నివారించే దిశగా మారుతి అడుగులేస్తున్నది.
కొవిడ్-19కు వ్యతిరేకంగా భారత్ పోరును బలోపేతం చేయడానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేశామని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. అందులో భాగంగా వెంటిలేటర్ల తయారీపై కేంద్రీకరించామన్నారు.
ఇప్పటి వరకు వెంటిలేటర్లను తయారు చేసే టెక్నాలజీ తమ వద్ద అందుబాటులో లేకపోయినా, అనుభవం లేకపోయినా ఇప్పటికే ఈ రంగంలో పని చేస్తున్న సంస్థలతో కలిసి పని చేస్తామని ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్సీ భార్గవ తెలిపారు. నెలకు 10 వేల వెంటిలేటర్లను తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు.
దేశీయ అవసరాలకు అనుగుణంగా శరవేగంగా వెంటిలేటర్లను తయారు చేసేందుకు అగ్వా హెల్త్ కేర్ సంస్థతో కలిసి మారుతి సుజుకి సంస్థ పని చేయనున్నది. ఇప్పటికైతే ఈ రంగంలో మారుతి సుజుకికి అనుభవం లేదన్నారు.
అగ్వా హెల్త్ కేర్ చాలా పరిమిత స్థాయిలోనే వెంటిలేటర్లను తయారు చేస్తోందని భార్గవ తెలిపారు. కానీ భారీ స్థాయిలో వెంటిలేటర్లను తయారు చేయడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. అగ్వా హెల్త్ కేర్ సంస్థ వద్ద వెంటిలేటర్లను తయారు చేసే టెక్నాలజీ అందుబాటులో ఉంది.
నొయిడా కేంద్రంగా అగ్వా హెల్త్ కేర్ వెంటిలేటర్ల తయారీ యూనిట్ ఉన్నది. అందులో తమ సిబ్బంది శిక్షణ తీసుకోనున్నదని భార్గవ తెలిపారు. రెండు సంస్థల మధ్య కొన్ని రోజుల క్రితమే అవగాహనా ఒప్పందం కుదిరింది.
అవసరాలకు అనుగుణంగా వెంటిలేటర్లను తయారు చేస్తే, వాటికి అవసరమైన విడి భాగాలను అందించడంతోపాటు సర్వీసింగ్ బాధ్యతలను మారుతి సుజుకి అందుకుంటుంది. వెంటిలేటర్లతోపాటు ఫేస్ మాస్క్‌ల తయారీకి గల సామర్థ్యాన్ని మారుతి సుజుకి అంతర్గతంగా అంచనా వేస్తున్నది.
మరోవైపు మారుతి సుజుకి తన కార్లపై ఉన్న వారంటీని జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 30వ తేదీ మద్య వారంటీ గడువు ముగుస్తున్న వినియోగ దారులందరికీ ఇది వర్తిస్తుందని మారుతి సుజుకి తెలిపింది. జూన్ 30ని కొత్త గడువుగా నిర్ణయించింది.
also read:హ్యుండాయ్ 2020 వెర్నాతో ఆ ఐదు సంస్థలకు సవాలే
ఎటువంటి సందేహాలు ఉన్నా వినియోగదారులు 24x7 మారుతి కాల్ సెంటర్‌ను సంప్రదించి పరిష్కరించుకోవాలని మారుతి సుజుకి తెలిపింది. బేసిక్ మెయింటెనెన్స్‌లో భాగంగా ప్రతి రోజూ కారు ఇంజిన్ 15 నిమిషాల పాటు స్టార్ట్ చేసి ఉంచాలని నిపుణులు సూచించారు.
టైర్లు డ్యామేజీ కాకుండా 15 నిమిషాలు ముందుకు, వెనక్కి కదిలించాలని నిపుణులు పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఇంటిలోనే ఉండాలని వినియోగదారులను మారుతి సుజుకి అభ్యర్థించింది