Maruti Suzuki: మారుతి సుజుకి నుంచి మరో సీఎన్​జీ కారు.. ఎప్పుడంటే..?

By team telugu  |  First Published Mar 8, 2022, 4:44 PM IST

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో చాలా మంది కస్టమర్లు నెమ్మదిగా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు కదులుతున్నారు. ఇందులో భాగంగా CNG వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు.
 


పెరుగుతున్న పెట్రోల్ (Petrol)​, డీజిల్ (Diesel) ధరలతో పాటు పర్యావరణ కాలుష్యం కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగా సీఎన్​జీ(CNG) వాహనాలకు డిమాండ్ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాహన తయారీ సంస్థలు సీఎన్​జీ కార్లను లాంచ్ చేస్తున్నాయి. స్వదేశీ దిగ్గజ కార్​ బ్రాండ్​ మారుతి సుజుకి (Maruti Suzuki) సైతం ఇప్పుడు సీఎన్​జీ వాహనాలపై దృష్టి పెట్టింది. తన అత్యంత పాపులర్ డిజైర్​ మోడల్​ను(Design Model) సీఎన్​జీ వెర్షన్​లో సైతం తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. గత నెలలో మారుతి సుజుకి సెలెరియో సీఎన్​జీ వేరియంట్​ను(Variant) లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు మరిన్ని సీఎన్​జీ వెర్షన్లను ఆవిష్కరించే పనిలో పడింది.

ఇందులో భాగంగా అతి త్వరలోనే డిజైర్ సబ్-కాంపాక్ట్ సెడాన్ సీఎన్​జీ వెర్షన్‌ను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. కొందరు మారుతి డీలర్లు ఇప్పటికే డిజైర్ సీఎన్​జీ బుకింగ్‌లను తీసుకోవడం ప్రారంభించారు. కంపెనీ ఇప్పటికే తన షోరూమ్‌లలో డీలర్ శిక్షణను సైతం ప్రారంభించింది. గత నెలలోనే మారుతి సుజుకి సెలెరియో సీఎన్​జీ వెర్షన్​ విడుదలైంది. అయితే, కేవలం నెల రోజుల వ్యవధిలోనే మరో సీఎన్​జీ వెర్షన్​ను లాంచ్​ చేస్తుండటం విశేషం.

Latest Videos

undefined

మారుతి డిజైర్ ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ వేరియంట్​. ప్రతి నెలా 10,000 కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ఈ కారు సబ్-కాంపాక్ట్ సెడాన్ విభాగంలో హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్, హోండా అమేజ్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తోంది. డిజైర్ ప్రస్తుత మోడళ్లు కేవలం పెట్రోల్ ఇంజన్‌లతో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 6.09 లక్షల నుండి రూ. 9.13 లక్షల మధ్య ఉంటుంది.

కాగా.. ఫిబ్రవరిలో మారుతి మొత్తం 17,438 యూనిట్ల డిజైర్‌ కార్లను విక్రయించింది. డిజైర్​ పెట్రోల్​ వేరియంట్​​ గతేడాదితో పోలిస్తే 46.5 శాతం వృద్ధిని సాధించింది. దీంతో, డిజైర్​ సీఎన్​జీ వెర్షన్​ను లాంచ్​ చేయాలని కంపెనీ భావిస్తోంది. కాగా, డిజైర్​ సీఎన్​జీ వేరియంట్ 1.2- లీటర్, K12M VVT పెట్రోల్ ఇంజన్​తో సమానమైన సీఎన్​జీ కిట్​తో వస్తుంది. ఇది 71bhp పవర్, 95Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. నివేదికల ప్రకారం, మారుతి సుజుకి త్వరలోనే స్విఫ్ట్, విటారా బ్రెజ్జా సబ్‌కాంపాక్ట్ ఎస్​యూవీ సీఎన్​జీ వేరియంట్‌లను కూడా రిలీజ్​ చేసే అవకాశం ఉంది. కొత్త బ్రెజ్జా సీఎన్​జీ వెర్షన్​లో 6 -స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు లోపల, బయట అనేక మార్పులు చేసే అవకాశం ఉంది. 2022 మారుతి బ్రెజ్జాలో ఇప్పటికే ఉన్న మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీకి బదులుగా హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడా అందించవచ్చు. దీనిలో అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను జోడించనుంది.
 

click me!