ఫెస్టివ్ సీజన్: ఆటోమొబైల్స్ ఆఫర్ల (ఆప) సోపాలు

By telugu team  |  First Published Sep 28, 2019, 12:02 PM IST

తొమ్మిది నెలలుగా వరుసగా పడిపోతున్న వాహనాల విక్రయాలు పెంచుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు ఆపసోపాలు పడుతున్నాయి. పండుగల వేళ విక్రయాల పెంపునకు రకరకాల ఆఫర్లు ప్రకటించాయి. టాటా మోటార్స్ మొదలు మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుండాయ్ కార్ల సంస్థలు, బజాజ్ ఆటో వంటి ద్విచక్ర వాహన సంస్థలు ఆఫర్ల వర్షం కురిపించాయి.
 


 పండుగల సీజన్ మొదలు కావడంతో ఆటోమొబైల్ సంస్థల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులు కూడా ఆఫర్ ఉంటేనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్ సంస్థల నుంచి ఆటోమొబైల్ సంస్థల వరకు ఆఫర్లే..ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి కంపెనీలు ఈ నెల చివరి నుంచి ప్రత్యేక డిస్కౌంట్ పేరుతో రాయితీలు ఇస్తున్నాయి. 

ఆర్థిక మాంద్యంతో తొమ్మిది నెలలుగా ఆటోమోటివ్ డీలర్లు విలవిల్లాడుతున్నారు. దీని దెబ్బకు గత 12 నెలల్లో దేశవ్యాప్తంగా దాదాపు 500 డీలర్‌షిప్పులు మూతపడటం పరిస్థితి తీవ్రతకు అద్ధంపడుతున్నది. ఇప్పటికే అమ్మకాలు లేక విలవిల్లాడుతున్న ఆటోమొబైల్ సంస్థలు కూడా ఈ పండుగ సీజన్‌లో అమ్మకాలను పెంచుకోవడానికి ఆఫర్లకు తెరలేపాయి. 

Latest Videos

ఇప్పటికే పలు సంస్థలు ఉచిత బీమా, ప్రత్యేక డిస్కౌంట్లు, నగదు రాయితీ, విడిభాగాలపై ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించాయి. కార్లు, టూ వీలర్లపై సదరు ఆటోమొబైల్ సంస్థలు రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించాయి. అయితే నూతనంగా విపణిలో అడుగుపెట్టిన ఎస్ యూవీ మోడల్ కార్లకు, నూతన కార్లకు ఈ ఆఫర్లు వర్తించవు.

ప్రస్తుత పండుగ సీజన్‌లో వాహన కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా..ఎంపిక చేసిన మోడళ్లపై రూ.1.15 లక్షల వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ ఆఫర్ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు వర్తించనున్నదని, దశలవారీగా మిగతా రాష్ర్టాలకు వర్తింప చేయనున్నట్లు మహీంద్రా మార్కెటింగ్, ఆటోమోటివ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గార్గ్ తెలిపారు. 

మహీంద్రా అండ్ మహీంద్రా అందించే ఈ ఆఫర్‌లో భాగంగా ఆర్థిక ప్రయోజనాలతోపాటు ప్రత్యేక ఒప్పందాలు కల్పించనున్నది. కంపెనీని ప్రారంభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్ వచ్చే రెండు నెలలు అమలులో ఉంటుందని మహీంద్రా మార్కెటింగ్, ఆటోమోటివ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గార్గ్ చెప్పారు.

ఈ ఏడాది ఆరంభం నుంచి క్రమంగా వడ్డీరేట్లు తగ్గించడం, జీఎస్టీ రేటులో స్వల్పంగా మార్పులు చేయడం ఈ రంగానికి ఊరట లభించినట్లు అయందని మహీంద్రా మార్కెటింగ్, ఆటోమోటివ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గార్గ్ అన్నారు. కంపెనీకి చెందిన వాహనాలను కొనుగోలు చేసిన వారికి రూ.1.15 లక్షల వరకు ప్రయోజనాలను కల్పించబోతున్నది. వీటిలో బోనస్, నగదు రాయితీ, ఉచిత బీమా, తక్కువ ధరకే విడిభాగాలను అందిస్తున్నది.

మరోవైపు కొంతమంది ఆటోమొబైల్ డీలర్లు కనీవినీ ఎరుగని ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కారును కొనదల్చుకొన్నవారు కారుతోపాటు ఉచితంగా స్కూటర్‌నూ ఇంటికి తీసుకెళ్లొచ్చని మధ్యప్రదేశ్‌లోని టాటా మోటర్స్ డీలర్ ఒకరు తాజాగా ప్రకటించారు.

టాటా నెక్సాన్, టియాగో, టిగోర్ మోడళ్ల కార్ల కొనుగోలుదార్లకు రూ.1.5 లక్షల మేరకు రాయితీలతోపాటు ప్రమోషనల్ ఆఫర్‌లో ఉచితంగా హోండా స్కూటర్‌ను అందజేస్తున్నామని, ఈ నెల 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఆ డీలర్ స్పష్టంచేశారు. అయితే ఇది ఆ డీలర్ సొంతగా ప్రకటించిన ఆఫర్. ఈ ఆఫర్‌ను తాము టాటా మోటర్స్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

మొన్నటికి మొన్న ఎంపిక చేసిన కార్ల ధరలను రూ.5 వేల వరకు తగ్గించిన మారుతి సుజుకీ..తాజాగా హ్యాచ్‌బ్యాక్ బాలెనోపై ఏకంగా రూ. లక్ష ధర వరకు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ వారం మొదట్లో ఆల్టో 800, ఆల్టో కే10, స్విఫ్ట్ డీజిల్, సెలేరియో, ఇగ్నిస్, డిజైర్ డీజిల్, టూర్ ఎస్ డీజిల్, విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్ మోడళ్ల ధరలను రూ.5 వేల వరకు తగ్గించిన విషయం తెలిసిందే. 

మారుతి ఎంపిక చేసిన ఈ కార్ల ధరలు రూ.2.93 లక్షల నుంచి రూ. 11.49 లక్షల లోపు మధ్యలో ఉన్నాయి. బాలెనో పెట్రోల్ వెర్షన్ షోరూం ధరలో రూ. లక్ష కోత విధించినట్లు బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో ఈ కారు ఢిల్లీ షోరూంలో ప్రారంభ ధర రూ.7,88,913కి తగ్గనున్నది. 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు హ్యాచ్‌బ్యాక్ విభాగంలో అత్యధిక పనితీరు కనబరుస్తున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

కాగా, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు ఆశీష్ కాలే మాట్లాడుతూ ‘జీఎస్టీపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత వాహనాల సేల్స్ కోసం ఆరాలు ఎక్కువయ్యాయి. వర్షాకాలం సీజన్ బాగుంటంతోపాటు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సంస్థలు రిటైల్ రుణాలిచ్చేందుకు ముందుకు రావడంతో డిమాండ్ ఊపందుకుంటుందని ఆశాభావంతో ఉన్నాం. ప్రస్తుత పండుగల సీజన్‌లో మంచి విక్రయాలు ఉంటాయని అంచనాతో ఉన్నాం’ అని తెలిపారు. 

వాహనాల కొనుగోళ్లపై వాస్తవ స్పందన ఇప్పటికిప్పుడే చెప్పలేమని, ఈ నెల 29వ తేదీ నుంచి బుకింగ్స్, డెలివరీలు ప్రారంభం అవుతాయని ఆశీష్ కాలే తెలిపారు. అయితే వాహనాల కొనుగోళ్లపై సంకేతాలు సానుకూలుంగా ఉన్నాయన్నారు. 

విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ సైతం బెనిఫిట్ల పార్టీలో చేరిపోయింది. మొబిలిటీ సొల్యూషన్స్ ప్రారంభించిన మెర్సిడెస్ బెంజ్ ‘విష్ బాక్స్’ పేరిట నూతన కారు కొనుగోలుదారులకు ఫైనాన్సియల్ సొల్యూషన్స్ అందుబాటులోకి తెచ్చింది. అతి తక్కువ చెల్లింపా? జీరో డౌన్ పేమెంటా? అన్న సంగతి గానీ, ఇతర మొబిలిటీ బెనిఫిట్లేమిటన్న సంగతి వెల్లడి కాలేదు. 

ఇక హ్యుండాయ్ మోటార్స్ తన కార్లపై రూ.65 వేల నుంచి రూ.95 వేల వరకు ఆఫర్లు అందిస్తోంది. గ్రాండ్ ఐ10పై రూ.95 వేలు, ఎలైట్ ఐ20పై రూ.65 వేలు, శాంత్రోపై రూ.65 వేలు, క్రెటా కారుపై రూ.80 వేల ఆఫర్లు అందిస్తోంది. వీటికి అదనంగా నాలుగేళ్ల వారంటీ కూడా అందిస్తోంది. 

టూ వీలర్ మేకర్ బజాజ్ ఆటోమొబైల్ మోటారు సైకిల్ కొనుగోలుపై రూ.7,200 బెనిఫిట్లు ప్రకటించింది. ఇంకా హీరో మోటార్స్, హోండా మోటార్స్ ఆఫర్లు ప్రకటించాల్సి ఉంది. 

వాహన కొనుగోలుదార్లకు డీలర్లు ఉచితంగా యాక్సెసరీస్, బీమా, రిజిస్ట్రేషన్ లాంటి వాటితోపాటు వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్టు ప్యాకేజీల్లో రాయితీలు ఇవ్వడం సాధారణమే. కార్ల కొనుగోలుదారులకు ఉచితంగా స్కూటర్లను ఇవ్వడం అసాధారణ విషయమే. కానీ ఇదేమీ కొత్త కాదు. రెండేళ్ల క్రితమే తమిళనాడులో హీరో మోటోకార్ప్ డీలర్ ఒకరు సరికొత్త ఆఫర్‌తో సంచలనం సృష్టించారు. 

2017 అక్టోబర్ 11-14 తేదీల మధ్య తన దుకాణంలో హీరో టూ వీలర్‌ కొనుగోలు చేసినవారికి ఉచితంగా మేకను ఇస్తానని ఆ డీలర్ ప్రకటించి కొత్త ఒరవడికి తెరలేపారు. ఈ ప్రకటనకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించడం, వారికి ఉచితంగా ఇచ్చేందుకు కావల్సినన్ని మేకలను కొనుగోలుచేయడం కష్టంగా మారడంతో ఆ డీలర్ కొద్దిరోజులకే ఆ ఆఫర్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.


 

click me!