ఆటోమొబైల్ రంగం మందగమనంతో సంక్షోభంలో చిక్కుకున్నా ఇటలీ విలాస కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినీ మాత్రం వారానికొక కారును విక్రయిస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తోంది. అయితే సదరు ఎస్ యూవీ కారు ధర రూ.3 కోట్ల పై మాటే మరి.
ముంబై: ఆర్థిక మందగమనం దెబ్బకు కార్ల కంపెనీలన్నీ విక్రయాల్లేక డీలా పడ్డాయి. టాటా మోటార్స్ వంటి సంస్థ కూడా అల్లాడుతోంది. కానీ, ఇటాలియన్ విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ లంబోర్ఘినీ అమ్మకాలు మాత్రం స్లోడౌన్‌లోనూ స్పీడుగా దూసుకెళ్తున్నాయి. గత ఏడాది కాలంగా వారానికో కారును విక్రయిస్తోంది ‘లంబోర్ఘినీ’.
లంబోర్ఘినీ సూపర్ ఎస్‌యూవీ ‘ఉరుస్’కు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు భారత్‌లోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. ఉరుస్‌కు లభిస్తున్న స్పందనతో ఈ ఏడాది కంపెనీ కార్ల విక్రయాలు 65 యూనిట్లకు చేరుకోవచ్చని, గతేడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధి చెందవచ్చని భారత్‌లో లంబోర్ఘినీ బ్రాండ్ హెడ్ శరద్ అగర్వాల్ అన్నారు.
దాంతో భారతదేశంలో లంబోర్ఘినీ ఏడాదిలో 50 యూనిట్లకు పైగా సూపర్ లగ్జరీ కార్లను విక్రయించిన ఏకైక కంపెనీ కానుంది. భారత్‌లో ఉరుస్‌కు 50 బుకింగ్స్ వచ్చాయని, ఈ కారు డెలివరీ కోసం కస్టమర్లు 6-8 నెలలు ఆగాల్సి వస్తోందని అగర్వాల్ తెలిపారు.
దేశీయ మార్కెట్లో ఉరుస్ ధర ఎంతో తెలుసా?!! రూ.3 కోట్ల పైమాటే. వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్ మేరకు అదనంగా కార్లు సరఫరా చేయాలని ఇటలీలోని లంబోర్ఘినీ మేనేజ్మెంట్‌ను కోరుతున్నామన్నారు.
ఇటలీ విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీగా లంబోర్ఘినీ ఉన్నా.. అది జర్మనీ ఆటో మేజర్ వోక్స్ వ్యాగన్ అనుబంధ సంస్థ. గతేడాది సెప్టెంబర్ నెలలో ఆవిష్క్రుతమైన ఉరుస్ మోడల్ కారు సంబంధించి ఇప్పటివరకు 50 యూనిట్లు అమ్ముడయ్యాయి.
2022 నాటికి వార్షిక విక్రయాలు 100 యూనిట్లకు చేరతాయని లంబోర్ఘినీ భారత్ అధిపతి శరద్ అగర్వాల్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 45 యూనిట్ల విక్రయాలు జరిగాయని, మిగతా మూడు నెలల్లో 60కి చేరువవుతామని అంచనా వేస్తున్నామన్నారు. గ్లోబల్ డిమాండ్ తో పోలిస్తే భారతదేశంలో తక్కువేనన్నారు.
మెట్రో నగరాల్లో గణనీయ స్థాయిలో విక్రయాలు ఉన్నాయని, అయితే ద్వితీయ, త్రుతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోనూ అదే స్థాయిలో డిమాండ్ ఉందని లంబోర్ఘినీ భారత్ అధిపతి శరద్ అగర్వాల్ చెప్పారు. లుధియానా, కాన్పూర్, భువనేశ్వర్, ఇండోర్, సూరత్, హుబ్లీ నగరాల్లో మంచి స్పందన లభించిందన్నారు.
ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాలు కేంద్రంగా షోరూమ్‌లను నిర్వహిస్తోంది లంబోర్ఘినీ. ప్రస్తుతానికి పెద్ద పురోగతి లేకున్నా.. మున్ముందు మంచి డిమాండ్ ఉంటుందని నమ్ముతోందీ సంస్థ. గతేడాది కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 5750 యూనిట్లను విక్రయించిన లంబోర్ఘినీ.. ఆసియా-పసిఫిక్ రీజియన్ పరిధిలో 1301 కార్లను విక్రయించింది.