ఈ సైకిల్‌ను పెడలింగ్ చేస్తూ (తొక్కుకుంటూ) ఎక్కడికైనా వెళ్లవచ్చు. అలసిపోయినపుడు దీనికి ఉన్న బ్యాటరీని ఆన్ చేస్తే దానంతటదే ఆటోమేటిగ్గా వెళ్తుంది. తయారైంది హైదరాబాద్ నగరంలోనే.. వివరాలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్‌కు చెందిన ఈ-మొబిలిటీ స్టార్టప్ 'కచ్‌బో డిజైన్' సరికొత్త ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఆవిష్కరించింది. హార్న్‌బ్యాక్ బ్రాండ్ పేరుతో విడుదలైన ఈ సైకిల్‌ను 'అడాప్టివ్ అర్బన్ కమ్యూటర్' అని పిలుస్తున్నారు. అంటే ఈ సరికొత్త e-సైకిల్ రోజూవారీ అవసరాలకు ఉపయోగపడటమే కాకుండా శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది, బ్యాటరీ వాహనం లాగా పనిచేస్తుంది. ఈ హార్న్‌బ్యాక్ బ్యాటరీ-బిగించిన ఒక సాధారణ సైకిల్‌లా కనిపిస్తుంది. అయితే ఇది ఫోల్డబుల్ కూడా కాబట్టి దీనిని మడతపెట్టి, కారు బూట్‌లో తీసుకెళ్లవచ్చు లేదా ట్రాలీలాగా చుట్టూ తిప్పవచ్చు, ఇంట్లో ఏదో మూలన మడతపెట్టి పెట్టేయొచ్చు. దీనిని పార్క్ చేసేందుకు అవసరమయ్యే స్థలం తక్కువ, అలాగే ఎక్కడికైనా రవాణా చేయడం కూడా తేలిక.
హార్న్‌బ్యాక్ సైకిల్‌ను పెడలింగ్ చేస్తూ (తొక్కుకుంటూ) ఎక్కడికైనా వెళ్లవచ్చు. చాలాసేపు పెడలింగ్ చేసి అలసిపోయినపుడు దీనికి ఉన్న బ్యాటరీని ఆన్ చేస్తే దానంతటదే ఆటోమేటిగ్గా వెళ్తుంది. మిగతా బ్యాటరీ సైకిళ్ల లాగా కాకుండా హార్న్‌బ్యాక్ నిజమైన సైకిల్‌లా అనిపిస్తుంది. పూర్తి-పరిమాణంతో చక్రాలు, కాంపాక్ట్ డిజైన్, మంచి పెడలింగ్ సౌలభ్యత, సామర్థ్యంతో నాణ్యతలో రాజీలేకుండా దీనిని రూపొందించినట్లు స్టార్టప్ ప్రతినిధులు చెప్పారు.
ఈ హార్న్‌బ్యాక్ e-గంటకు 25 కిమీ వేగంతో ప్రయాణించగలదు. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేస్తే 30 కిమీల దూరాన్ని కవర్ చేయగలదు. అయితే దీని ధరను ఇంకా నిర్ణయించలేదు కానీ, రూ. 500 టోకెన్ అమౌంట్ చెల్లించి ప్రీ-బుకింగ్ ఆర్డర్ చేసుకోవాల్సిందిగా కంపెనీ పేర్కొనడం గమనార్హం. సెప్టెంబర్ 2022 నాటికి డెలివరీని ప్రారంభించాలని యోచిస్తోంది. తెలంగాణ ఈ-వెహికల్ పాలసీతో అనుసంధానం అయి పూర్తి స్థాయి తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఈ స్టార్టప్ కంపెనీ ప్లాన్ చేస్తోంది.