విద్యుత్ వెహికల్స్‌లోకి హీరో.. విపణిలోకి ఆఫ్టిమా, ఎన్‌వైఎక్స్ఆర్

By rajesh yFirst Published Aug 20, 2019, 10:55 AM IST
Highlights

విద్యుత్ వాహనాల రంగంలోకి హీరో మోటో కార్ప్ కూడా వచ్చి చేరింది. ఈ మేరకు ఆప్టిమా ఈఆర్, ఎన్‌వైఎక్స్ ఈఆర్ మోడళ్ల పేరిట రెండు నూతన స్కూటర్లను విపణిలో ఆవిష్కరించింది. 

బెంగళూరు: ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ సోమవారం రెండు కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విడుదల చేసింది. ఆప్టిమా ఈఆర్‌, ఎన్‌వైఎక్స్‌ ఈఆర్‌ పేరిట వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీటి ధరలను వరుసగా రూ.68,721, రూ.69,754గా నిర్ణయించినట్లు కంపెనీ సీఈవో సోహిందర్‌ గిల్‌ తెలిపారు. ఈ రెండు ద్విచక్ర వాహనాలూ లిథియం బ్యాటరీతో నడుస్తాయన్నారు.

నాలుగున్నర గంటల నుంచి 5 గంటల పాటు ఛార్జింగ్‌ పెడితే ఫుల్‌ఛార్జ్‌ అవుతుందని, దీంతో 100 కిలోమీటర్లు మేర ప్రయాణించవచ్చునని గిల్‌ తెలిపారు. బ్యాటరీపై మూడేళ్ల వారెంటీ కూడా అందిస్తున్నట్లు చెప్పారు. 

బ్యాటరీకి మూడేళ్ల వారెంటీ సదుపాయం కల్పించే ఏకైక కంపెనీ తమదేనని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ వివరించారు. ప్రస్తుతం లిథియం బ్యాటరీ ధర రూ.18వేల వరకు ఉన్నప్పటికీ భవిష్యత్‌లో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయయని చెప్పారు. రెండు మూడేళ్లలో సగం ధరకే ఇవి లభించే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా  కంపెనీ కొత్త కార్పొరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ హెవీ డ్యూటీ, హై స్పీడ్‌ ఈ-స్కూటర్లు అన్ని హీరో ఎలక్ర్టిక్‌ డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. కస్టమర్ల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు ఈ వాహనాల రేంజ్‌, పనితీరును మెరుగుపరిచినట్టు పేర్కొంది.
 
ఫేమ్‌ 2 ప్రయోజనాల వల్ల ఈ-స్కూటర్లు మరింత అందుబాటు ధరల్లోనే లభించే అవకాశం ఏర్పడుతోందని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ చెప్పారు. ప్రస్తుతం కంపెనీ టచ్‌పాయింట్ల సంఖ్య 615 వరకు ఉంది. 

2020 చివరినాటికి టచ్ పాయింట్ల సంఖ్యను 1,000కి పెంచుకోవాలని హీరో ఎలక్ట్రిక్ యోచిస్తోంది. ఈ ఏడాదిలో వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష యూనిట్లకు పెంచుకోవడమేకాకుండా మూడేళ్లకాలంలో 5 లక్షల యూనిట్లకు చేర్చాలన్నది కంపెనీ లక్ష్యం.
 

click me!