Ducati Scrambler Urban Motard: స్టైలిష్ డుకాటి.. దీనికి లేదు పోటీ.. ధ‌ర కూడా అంతే..!

By team teluguFirst Published Jun 29, 2022, 10:24 AM IST
Highlights

డుకాటి నుంచి 'స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్' మోటార్‌సైకిల్‌ భారత మార్కెట్లో విడుదలయింది. ఈ బైక్ ధర రూ. 11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
 

ఇటలీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటి తాజాగా తమ బ్రాండ్ నుంచి 'స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్' పేరుతో ఒక సరికొత్త మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. చూడటానికి చాలా స్టైలిష్‌గా స్పోర్టియర్ లుక్‌తో ఉన్న ఈ బైక్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఖరీదు పరంగా ఈ బైక్ డుకాటిలోని 1100 డార్క్ ప్రో అలాగే డెసర్ట్ స్లెడ్ ​​మోడళ్లకు మధ్యస్థంగా ఉంటుంది.

స్క్రాంబ్లర్ లైనప్‌లోని ఇతర మోడళ్లతో పోలిస్తే, డుకాటి అర్బన్ మోటార్డ్ ట్రిమ్‌లో లుక్ పరంగా కొద్దిగా మార్పులుంటాయి. ఈ సరికొత్త మోటార్‌సైకిల్‌లో ఆకర్షణీయమైన ఇంధన ట్యాంక్ గ్రాఫిక్‌లతో పాటు వైట్ సిల్క్, డుకాటి GP'19 రెడ్ అనే రెండు విభిన్నమైన 2-టోన్ కలర్ స్కీమ్‌లతో మిగిలిన స్క్రాంబ్లర్ మోడళ్ల నుంచి అర్బన్ మోటార్డ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ బైక్‌లో కొద్దిగా ఎలివేటెడ్ ఫ్రంట్ మడ్‌గార్డ్, ఫ్లాట్ సీట్, కుదించిన హ్యాండిల్ బార్, సైడ్ నంబర్ ప్లేట్‌లు ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి.

ఫీచర్లు- స్పెసిఫికేషన్లు

ఈ బైక్‌లో హెడ్‌లైట్, టెయిల్‌ల్యాంప్ రెండూ LED యూనిట్‌లుగా వచ్చాయి. అలాగే బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కలిగిన LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, Ducati Mutlimedia సిస్టమ్ (DMS), USB సాకెట్ ఉన్నాయి. ప్రాక్టికల్ యుటిలిటీ అవసరాల కోసం చిన్న అండర్ సీట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌ను కూడా ఇచ్చారు.

డుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ బైక్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. దీని బరువు 180 కిలోలు. ఈ బైక్‌లో 803CC ఎల్-ట్విన్ ఇంజన్ అమర్చారు, దీనికి స్లిప్పర్ క్లచ్ ద్వారా 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఈ ఇంజన్ 8,250 rpm వద్ద 72 bhp శక్తిని అలాగే 5,750 rpm వద్ద 66.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 17-అంగుళాల స్పోక్ వీల్స్‌ను అమర్చారు. ఇక ముందువైపున 41 mm కయాబా USD ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్‌తో పాటు వెనుకవైపు మోనోషాక్ యూనిట్‌ను కలిగి ఉంది. బ్రేకింగ్ హార్డ్‌వేర్‌లో 330 mm ఫ్రంట్ డిస్క్, 245 mm వెనుక డిస్క్ అలాగే డ్యూఎల్ ABS ఛానెల్ సిస్టమ్ ఉంది. ఈ బైక్‌కి సంబంధించిన బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఇండియన్ మార్కెట్లో ఈ అర్బన్ మోటార్డ్ స్క్రాంబ్లర్‌కు సరితూగే బైక్ లేనప్పటికీ ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్, హార్లే డేవిడ్‌సన్ 883, కవాసకి Z900 వంటివి పోటీపడతాయి.

click me!