అచ్చం ‘నానో’లాగే!: 2019 ఫిబ్రవరిలో రోడ్లపైకి బజాజ్ బుల్లికారు ‘క్యూటీ’

By sivanagaprasad kodati  |  First Published Nov 25, 2018, 11:04 AM IST

ఎట్టకేలకు దశాబ్ధ కాలం తర్వాత టాటా నానో కారు మాదిరిగా బజాజ్ ఆటో బుల్లికారును వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది. ఖ్వాడ్రిక్ సైకిళ్లుగా భావించే ఈ కారుకు బజాజ్ ‘క్యూటీ’ అని పేరు పెట్టింది.


ఎంట్రీ లెవల్‌ కారుకోసం ఎదురు చూస్తున్న భారత వినియోగదారులకు శుభవార్త. ఒకప్పుడు రతన్ టాటా తీసుకొచ్చిన నానో కారు భారత వాహన రంగంలో సంచలనం. ఇప్పుడు మరో సంచలనం రోడ్లపై పరుగులు తీయడానికి సిద్ధమైంది.

ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో ‘క్యూటీ’ పేరుతో క్వాడ్రిక్‌ సైకిల్‌ను 2019 ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. దీని ధర సుమారు రూ.2.60లక్షల నుంచి రూ.3లక్షల వరకూ ఉండవచ్చని సమాచారం. అధిక మైలేజీని ఇవ్వడంతోపాటు, కాలుష్య ఉద్గారాలను తక్కువ వెలువరిస్తుంది. ద్విచక్రవాహనానికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఈ కారుకు అదే స్థాయిలో నిర్వహణ ఖర్చులు ఉంటాయి మరి.

Latest Videos

ఇది గంటకు 70కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. లీటరుకు 30కి.మీ. పైనే మేలేజీనిస్తుంది. భారత ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం నగరాల్లో ప్రయాణానికి సరిపోతుంది. ప్రస్తుతం క్యూటీని కేవలం వాణిజ్య అవసరాలకు మాత్రమే విక్రయిస్తున్నారు. కాగా, ఇటీవల ప్రభుత్వం వ్యక్తిగత అవకాశాలకు కూడా దీన్ని వినియోగించుకోవచ్చునని నిబంధనలను సడలించింది.

ఈ నేపథ్యంలో వ్యక్తిగత ప్రయాణ వాహన రంగంలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ మాట్లాడుతూ.. ‘పట్టణాల్లో ప్రయాణాలకు క్యూటీ చక్కగా సరిపోతుంది.

ద్విచక్రవాహనంతో పోలిస్తే, భద్రత విషయంలోనూ మంచి ప్రమాణాలను పాటించాం. టూ-వీలర్‌కు ఎంతైతే నిర్వహణ ఖర్చు అవుతుందో దీనికి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంతేకాదు, అధిక మైలేజీని ఇవ్వడంతో పాటు, కాలుష్య ఉద్గారాలను సైతం తక్కువగా వెలువరిస్తుంది.’’ అని తెలిపారు.

ఆరేళ్ల క్రితమే 2012లో బజాజ్‌ ఆటో క్యూటీని తొలిసారి ఆవిష్కరించింది. తొలుత దీన్ని క్వాడ్రిక్‌ సైకిల్‌గా పేర్కొనగా, ఆ తర్వాత క్యూటీగా మార్చారు. భారత్‌లో మాత్రం దీన్ని ఇంకా విడుదల చేయలేదు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు రాలేదు.

ఈ నేపథ్యంలో రాజీవ్‌ బజాజ్‌ సంచలన వ్యాఖ్యలు సైతం చేశారు. ‘మేడిన్‌ ఇండియా’ అంటారు కానీ, ఏవైనా ఆవిష్కరిస్తే అనుమతులు మాత్రం జారీ చేయరు అందుకే ‘మ్యాడ్‌ ఇన్‌ ఇండియా’ అనాల్సి వస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి యూరప్‌, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాల్లో క్వాడ్రిక్‌ సైకిల్‌ విక్రయాలు జరుపుకొంటోంది. 

వాణిజ్య అవసరాలకే వాడుతున్న బజాజ్ క్యూటీ కార్ల(క్వాడ్రిక్‌ సైకిళ్ల)ను ఇకపై వ్యక్తిగత అవసరాలకు  కూడా వినియోగించుకోవచ్చని ఈ నెల 20వ తేదీన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల సంస్థ  ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొన్ని నిబంధనలను కూడా విధించింది.

ఇటీవల ప్రభుత్వం వ్యక్తిగత అవకాశాలకు కూడా దీన్ని వినియోగించుకోవచ్చునని నిబంధనలను సడలించింది. బజాజ్ ‘క్యూటీ’ కారుకు ప్రతిగా  టాటా  మోటార్స్‌, మహీంద్ా అండ్ మహీంద్రా మరో రెండు సంవత్సరాల్లో తమ సరికొత్త వాహనాలను లాంచ్‌ చేసే  అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. అలాగే మారుతి, హ్యుండాయ్‌  తమ  వ్యూహాలను మార్చుకొని అతి తక్కువ ధరలో ఎంట్రీ లెవల్‌ కార్లను లాంచ్‌ చేస్తాయని  పేర్కొంటున్నాయి. 
 

click me!