మారుతి ఓమ్నీ, జిప్సీలు ఇక కనుమరుగే...టాటా నానో కూడా

By Arun Kumar PFirst Published Nov 19, 2018, 4:57 PM IST
Highlights

వచ్చే ఏప్రిల్ నుంచి మారుతి ‘ఓమ్నీ’ మోడల్ కార్ల ఉత్పత్తి నిలిచిపోనున్నది. రెండేళ్లలో కాలుష్య నివారణ కోసం బీఎస్ - 6 ప్రమాణాలు గల కార్లను మాత్రమే భారత్ లో నడుపాల్సి ఉండటమే దీనికి కారణం.

ముంబై: వచ్చే రెండేళ్లలో కాలుష్య రహిత నిబంధనలను పాటించేందుకు భారతదేశం బీఎస్-6 మోడల్ వాహనాలను వాడాల్సి ఉంటుంది. దీని ప్రకారం రోడ్డు ప్రమాదాల నివారణ, కార్బన్ డయాక్సైడ్ ప్లస్ కర్బన ఉద్గారాల తగ్గింపు, నైట్రోజన్ ఆక్సైడ్ లెవెల్స్ సగానికి పైగా తగ్గించాల్సి ఉంటుంది. కనుక ప్రస్తుతం ఉత్తమమైన మోడల్ కార్లు భావిస్తున్న వాటిని సదరు ఆటోమొబైల్ సంస్థలు ఉత్పత్తి చేయకుండా నిలిపివేయాల్సి ఉంటుంది. 

1984 నుంచి అత్యధికంగా అమ్ముడు పోతున్న మారుతి సుజుకి ఓమ్నీ, దశాబ్దాలుగా భారత మిలిటరీ, భద్రతా సేవలకు ఉపయోగిస్తున్న జిప్సీ వంటి ఎస్ యూవీ మోడల్ కార్ల ఉత్పత్తి నిలిపివేయాల్సి రావచ్చు. రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్టు అతి చౌకగా వినియోగదారులకు కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు రూపొందించిన ‘నానో’ కారు ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది ప్రపంచంలోకెల్లా అతి చౌక మరి. 

ఇక మహీంద్రా ఈ20 మోడల్ ఏకైక విద్యుత్ కారు, ఫియట్ పుంటో మోడల్ కూడా నిలిపేయక తప్పదు. ఇక హ్యుండాయ్ ఎయాన్, హోండా బ్రియో మోడల్ కార్ల ఉత్పత్తిని ఇప్పటికే నిలిపేశారు. నానో, ఈ20 మోడల్ కార్లను వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఉత్పత్తి చేయడం నిలిపేస్తారు. ఓమ్నీ, పుంటో మోడల్ కార్లకు బీఎస్ - 6 ఇంజిన్లు లభించకపోతే 2020 ఏప్రిల్ నెలతో వాటి ఉత్పత్తి నిలిచిపోనున్నది. ఇంకా నిస్సాన్ టెర్రానో, ఫియట్ లైనియా, వోక్స్ వాగన్ ఎమియో తదితర పేరొందిన మోడల్ కార్ల ఉత్పత్తి నిలిచిపోనుండగా, మరికొన్ని నూతన ఇంజిన్లతో నూతన మోడళ్లతో రోడ్లపైకి రానున్నాయని నిపుణులు తెలిపారు. 

మహీంద్రా అండ్ మహీంద్రా మాత్రం తమ ‘ఈ20’ మోడల్ కార్ల ఉత్పత్తి నిలిపివేతను ధ్రువీకరించలేదు. కొన్ని మోడల్స్ ఉత్పత్తిని హేతుబద్ధీకరిస్తామని పేర్కొంది. ఏయే మోడల్ కార్ల ఉత్పత్తిని హేతుబద్దీకరిస్తారన్న విషయం మాత్రం వివరాలు తెలుపలేదు. ఇక మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ ఇటీవలే ఓమ్నీ కార్ల చరిత్ర ముగిసినట్లేనని తేల్చేశారు. ప్రణాళికాబద్ధమైన విధానంతో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని టాటామోటార్స్ పేర్కొంది. 

ఫియట్ క్రియోస్లర్ భారత్ అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ కెవిన్ ఫ్లైన్ మాట్లాడుతూ కొన్ని ఉత్పత్తుల్లో సాంకేతికంగా మెరుగులు దిద్దాల్సి రావచ్చునని చెప్పారు. ఇప్పటికే తమ కంపెనీ ఆ దిశగా చర్యలు చేపట్టిందన్నారు. 

అంతర్జాతీయంగా కాలుష్య పూరిత దేశాల్లో భారత్ ఒకటి. భారతదేశంలోని 12 ప్రధాన నగరాల్లో 11 చోట్ల దారుణ పరిస్థితులు ఉన్నాయి. 2017లో 1.46 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (ఏఐఎస్)లో 140 నిబంధనలను 2020 ఏప్రిల్ నాటికి కమర్షియల్ టాక్సీలపై అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. సదరు కార్ల గమనాన్ని నిర్దేశించే ట్రాకింగ్ డివైజ్, ఒకటి, అంతకంటే ఎక్కువగా ఎమర్జెన్సీ బటన్లు కార్లు అమర్చడం తప్పనిసరి కానున్నది. 

click me!