శాంట్రో రికార్డుల పర్వం: నెలలో 38,500 కార్ల బుకింగ్‌

By sivanagaprasad kodati  |  First Published Nov 27, 2018, 8:57 AM IST

దక్షిణ కొరియా ఆటో మేజర్ ‘హ్యుండాయ్ మోటార్స్’ నూతన మోడల్ శాంట్రో కారు బుకింగ్స్‌లో రికార్డులు నమోదు చేస్తోంది. కేవలం నెల రోజుల్లో 38,500కి పైగా వినియోగదారులు ఈ మోడల్ కారు కోసం బుకింగ్ చేశారు. 


సరికొత్తగా విడుదల చేసిన శాంట్రోకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా తెలిపింది. నెల రోజుల్లోనే ఈ కారుకు 38,500కు పైగా బుకింగ్స్‌ వచ్చినట్టు తెలిపింది.

మొత్తం బుకింగ్స్‌లో ఏఎంటీ (ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌), సీఎన్‌జీ వెర్షన్స్‌ వాటా వరుసగా 30 శాతం, 18 శాతం ఉంది. కొత్త మోడల్‌కు కస్టమర్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా ఎండీ, సీఈఓ వైకే కూ తెలిపారు. 

Latest Videos

కొత్త శాంట్రోను గత నెల 23వ తేదీన హ్యుండాయ్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. పాత శాంట్రోతో పోల్చితే కొత్త కారు కాస్త పెద్దగా, విశాలంగా ఉంది. రియర్‌ పార్కింగ్‌ కెమెరా, వాయిస్‌ రికగ్నిషన్‌, రియర్‌ ఏసీ వెంట్స్‌, ఈకో కోటింగ్‌ టెక్నాలజీ, టచ్‌స్ర్కీన్‌ ఆడియో వీడియో సిస్టమ్‌, కంఫర్టబుల్ అండ్ ప్రీమియం క్యాబిన్, మోడ్రన్ స్టైలిష్ టాల్ బాడీ డిజైన్, రిమోట్‌ కీలెస్‌ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

నూతన శాంట్రో  మోడల్ కారు భారత్‌లో తమ నిజమైన బ్రాండ్‌కు నిదర్శనం అని సంస్థ ఎండీ వైకే కూ పేర్కొన్నారు. అన్ని రకాల సురక్షితం, భారతీయ కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణమైన పెర్ఫార్మెన్స్ గల మోడల్ అని తెలిపారు. ఇది ట్రెండ్ సెట్టర్ మోడల్‌గానూ నిలుస్తుందన్నారు. 

అంతేకాదు ఈ ఏడాది ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేకించి కార్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ గానూ హ్యుండాయ్ శాంట్రో నిలిచింది. బుకింగ్స్‌లో రికార్డులు నమోదు అవుతుండటంతో సంస్థ యాజమాన్యంపైనా ఉత్పత్తి కోసం ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.

అయితే సదరు శాంట్రో మోడల్ కారు వేరియంట్స్, రంగును బట్టి బుకింగ్స్ నమోదు చేసుకున్న వారికి డెలివరీ చేసేందుకు నాలుగు నెలల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో అదనంగా 10 వేల కార్లు ఉత్పత్తి చేయాలని హ్యుండాయ్ మోటార్స్ నిర్ణయించడం గమనార్హం.

తద్వారా కస్టమర్లు వేచి ఉండే టైం తగ్గించాలని యాజమాన్యం భావిస్తోంది. అక్టోబర్ నెలలో అదనంగా 8,500 కార్లు అదనంగా ఉత్పత్తి చేసింది. 2018 సేల్స్ లోనే 35 శాతం శాంట్రో సొంతమయ్యాయి. 


బుకింగ్స్ మొదలైన 22 రోజుల్లోనే 28,800 కార్లను బుకింగ్స్ నమోదు చేసుకున్నది హ్యుండాయ్ శాంట్రో. గత నెల 10వ తేదీన బుకింగ్స్ నమోదు ప్రారంభమైన తొమ్మిది రోజుల్లో 14 వేలకు పైగా బుకింగ్స్ తో తొలి రికార్డు నమోదు చేసింది. మార్కెట్లోకి ఆవిష్కరించే నాటికి 23,500 బుకింగ్స్.. ఈ నెల మూడో తేదీ నాటికి 28,800 బుకింగ్స్‌తో మరో రెండు రికార్డులు నమోదు చేసింది.

విశాఖ ఉక్కుతో కల్సి హైగ్రేడ్ స్టీల్ కోసం హ్యుండాయ్‌ ఆసక్తి !
విశాఖ హుక్కు, హ్యుండాయ్‌ మోటార్స్ జట్టు కట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హై గ్రేడ్‌ స్టీల్‌ తయారీ కోసం వైజాగ్‌ను హ్యుండయ్‌ ఎంపిక చేసుకుంటే భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌) చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే రథ్‌ తెలిపారు. ప్లాంట్‌ ఏర్పాటు విషయమై ఇరు సంస్థల మధ్య ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఆయన చెప్పారు.
 
‘స్టీలైస్‌ ఇండియా అవార్డ్‌ 2018’ కార్యక్రమంలో పాల్గొన్న రథ్ మీడియాతో మాట్లాడుతూ ఫ్లాట్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు విషయమై గత నెలలో హ్యుండాయ్‌ ప్రతినిధులు, భారత్‌లో కొరియా రాయబారి.. ఆర్‌ఐఎన్‌ఎల్‌ ప్లాంట్‌ను సందర్శించారని చెప్పారు.

కాగా ప్లాంట్‌ ఏర్పాటు, ఇతరత్రా అంశాలకు సంబంధించి భారత ప్రభుత్వానికి వారు తమ ఫీడ్‌బ్యాక్‌ను అందించాల్సి ఉందని, ప్రస్తుతానికి ఈ విషయంలో ఎలాంటి ముందడుగు లేదని ఆయన తెలిపారు.
 
వైజాగ్‌లో ఆర్‌ఐఎన్‌ఎల్‌.. మూడు వేల ఎకరాల్లో విస్తరించి ఉందని, 30 లక్షల టన్నుల సామర్థ్యం గల ప్లాంట్‌ కోసం ఈ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చని రథ్‌ తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్ట్‌తో ఆర్‌ఐఎన్‌ఎల్‌.. హై గ్రేడ్‌ ఫ్లాట్‌ స్టీల్‌ రంగంలోకి ప్రవేశించటమే కాక ఆటోమోటివ్‌ పరిశ్రమకు అవసరమైన లాంగ్‌ ప్రొడక్ట్స్‌ తయారీలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందని చెప్పారు.

click me!