వాస్తు ప్రకారం ప్రహరీ గోడ ( కాంపౌండువాల్ ) నిర్మాణం ఎలా ఉండాలి?

By telugu news teamFirst Published May 22, 2020, 9:22 AM IST
Highlights

ప్రహరీ అనేది ప్రహారము ( పరిహారం ) అనే పదం నుంచి వచ్చింది. ప్రహారం అనగా దెబ్బ అని అర్థం. గృహ నిర్మాణ స్థలంపై ఇరుగు, పొరుగు వారి నేత్ర దృష్టి పడకుండా ఈ ప్రహరీ కాపాడుతుంది

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ఆర్థికంగా ఆటంకాలు లేకుండా ఇంటిని నిర్మించడ కోసం ఇల్లు కట్టే స్థలానికి ప్రహరీ ఉండటం ఎంతో అవసరం. ఇంటిని కాపాడే ప్రహరీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందమైన గృహాన్ని నిర్మించుకోవాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా గృహప్రవేశం చేయాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఇంటి నిర్మాణం సాఫీగా సాగాలి అంటే ముఖ్యంగా ఆ గృహం నిర్మించే స్థలానికి ‘ప్రహరీ’ నిర్మాణం అత్యావశ్యకం. 

ప్రహరీ అనేది ప్రహారము ( పరిహారం ) అనే పదం నుంచి వచ్చింది. ప్రహారం అనగా దెబ్బ అని అర్థం. గృహ నిర్మాణ స్థలంపై ఇరుగు, పొరుగు వారి నేత్ర దృష్టి పడకుండా ఈ ప్రహరీ కాపాడుతుంది. స్థలం ఆక్రమణకు గురి కాకుండా, దొంగతనం జరగకుండా యజమాని ఆర్థికంగా నష్టపోకుండా ప్రహరీ చూస్తుంది. జంతువులు ప్రవేశించకుండా, నిర్మాణ స్థలంలో వస్తువులు దొంగతనాలకు గురికాకుండా ప్రకృతిలో ఏర్పడే వ్యత్యాసాలు చేసే దుష్పరిణామాల నుంచి గృహానికి, స్థలానికి రక్షణగా నిలుస్తుంది. ఇల్లు యజమానికి రక్షణగా నిలుస్తుంటే, ప్రహరీ గృహానికి రక్షణగా నిలుస్తుంది. 

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రహరీ నిర్మాణం ఎలా చేయాలనే అంశానికి సంబంధించి ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ నైరుతిని మూలమట్టానికి ఉంచి ప్రహరీ నిర్మాణము చేయాలి. ఇలా చేయడం వల్ల గృహం మూల తిరగకుండా ఉంటుంది. నైరుతి మూలమట్టం తీసుకుంటే ఆగ్నేయం వరకు సమాంతర నిర్మాణం జరిగి ఆగ్నేయం వైపు పెరుగుట, తరుగుట అలాగే వాయువ్యం వరకు పెరుగుట, తరుగుట జరగదు. దీని వల్ల యజమాని కుటుంబానికి ఎలాంటి దృష్టి దోషాల ప్రభావం పడకుండా యజమానికి సుఖసంతోషాలు కలుగుతాయి.

ప్రహరీ నిర్మాణం జరిగిన తర్వాత నిర్మాణ స్థలంలో ఎత్తు పల్లల్ని సరిచేసుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎత్తు పల్లాల వలన కలిగే దోషాలను నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రహరీ నిర్మాణం తర్వాత ముఖ్యమైంది గేటు ఏర్పాటు చేయడం. గేటు ఎప్పుడూ ఉచ్ఛస్థితిలో ఏర్పాటు చేసుకొంటే యజమాని, కుటుంబ సభ్యులు ఎవరికీ ఆరోగ్య పరంగా, ఆర్థికంగా మానసిక సమస్యలకు గురి కాకుండా రక్షణగా నిలుస్తుంది. 

ప్రహరీ నిర్మాణం ఎప్పుడూ సమాంతరంగా జరగాలి. ఉత్తరం గోడ కన్నా దక్షిణం గోడ ఎత్తుగా ఉండాలి, తూర్పు గోడ కన్నా పడమర గోడ ఎత్తుగా ఉండాలి అనేది శాస్త్ర నియమం అంటూ ఏమిలేదు, నాలుగు గోడలు సమాంతరంగాను ఉండవచ్చును, లేదా
 
నైరుతిలో 6' - 3"  

ఆగ్నేయంలో 6' - 2 "

వాయువ్యంలో 6' - 1"

ఈశాన్యంలో  6' - 0 " 

కొలతలతో కుడా కట్టుకోవచ్చును. పై సూచించిన దిశల యొక్క కొలతలు మాత్రం వ్యతిరేఖంగా మాత్రం కట్టకూడదు. అలా ఒకవేళ కడితే చెడు ఫలితాలు సంభవిస్తాయి. ప్రహారి గోడకు అనుకుని ఇంటి ఏ వైపు గోడ అస్సలు తగలకూడదు. ఒకవేళ ప్రహరి గోడకు ఇంటికి మధ్య ఏదైనా గోడకాని, మెట్లు కాని తగిలితే వాస్తు రిత్య పతకం ( ప్లాన్ ) చెడిపోతుంది.

వాస్తు సూత్రాలను తెలియకుండా సొంత ఆలోచనలు, నిర్ణయాలతో వ్యవహరిస్తే శుభం జరగాల్సింది పోయి అశుభాలు జరిగే అవకాశానికి మనమే పనిగట్టుకుని చాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అనుభవం కలిగిన వాస్తు పండితులు ఇచ్చిన ఇంటి ప్లాన్ ప్రకారం నిర్మాణం జరిగితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రహరి అంటేనే మనల్ని ఆని విధాలుగా కాపాడే రక్షణ కవచం లాంటిది. ప్రహరి గొడవలన వీధి శూలలు, వీధి పోట్లు తగలకుండా కాపాడుతాయి.

ఇంటి నిర్మాణం కొరకు ఉన్న స్థలంలో ఏ మాత్రం ప్రహరిగోడ కొరకు స్థల అవకాశం ఉంటే తప్పక ప్రహరీగోడ నిర్మాణం చేయండి. గృహ నిర్మాణ సమయంలో ప్రహరీ గోడ కేవలం ఒకటిన్నర అడుగుల ఎత్తు మాత్రమే ఉండేలా ఏర్పాటు చేసుకుని, ఇల్లు కట్టడం పూర్తీ అయిన తర్వాత పూర్తిగా నిర్మించుకోవాలి. ఈ ప్రహరీ గోడ వలన ఇంటికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. ప్రహరి గోడ ఇంటికి, వాస్తుకు ఎన్నో విధములుగా మేలును చేస్తూ రక్షణ కవచంలా రక్షిస్తుంది. 

click me!