ఏ రాశివారికి ఏది నచ్చుతుంది..? ఏది నచ్చదు..?

By ramya neerukondaFirst Published Nov 5, 2018, 3:40 PM IST
Highlights

కొందరికి తీపి పదార్థాలు అంటే ఇష్టం, కొందరు కారం పదార్థాలు, ఘాటు మసాసాలు ఎక్కువగా ఉండే పదార్థాలు ఇష్టపడతారు. ఇంకొందరు చప్పగా ఉండే పదార్థాలు ఇష్టపడతారు.

అన్ని లగ్నాలవారు అన్ని రకాల ఆహారాలు ఇష్టపడరు. కొందరికి తీపి పదార్థాలు అంటే ఇష్టం, కొందరు కారం పదార్థాలు, ఘాటు మసాసాలు ఎక్కువగా ఉండే పదార్థాలు ఇష్టపడతారు. ఇంకొందరు చప్పగా ఉండే పదార్థాలు ఇష్టపడతారు. కారం, ఘాటు పదార్థాలు తినేవారి మనస్తత్వం  కొంచెం కఠినంగాను, తీపి పదార్థాలు తినేవారి మనస్తత్వం కొంచెం మెత్తగాను ఉంటుంది. వీరు చేసే పనులలో కూడా తేడా ఉంటుంది. ఆలోచనా విధానాలల్లో కూడా తేడా ఉంటుంది.

మేషరాశికి అధిపతి కుజుడు. ఈ రాశివారు భోజనం త్వరగా చేస్తారు. మేషరాశి జాతకులు తీపి మరియు రుచిగల ఆహార పదార్థాలను సమంగా ఇష్టపడతారు.

వృషభరాశికి అధిపతి శుక్రుడు. వీరు తాజాగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువ ఇష్టపడతారు. పులుపు పదార్థాలు, చింతపండుతో చేసిన ఆహార పదార్థాలను ఇష్టపడతారు. ఆడంబరాలకు పోరు. అనేకరకాల రుచిగల మిశ్రిత ఆహారాన్ని ఇష్టపడతారు.

మిథున రాశి అధిపతి బుధుడు. వీరు అన్ని రుచుల మిశ్రమాన్ని ఆహారంగా ఇష్టపడతారు. వీరు పాలతో చేసిన మధుర పదార్థాలు, పాలల్లో ఉడికించిన అటుకులు ఇష్టపడతారు.

కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. వీరు ఉప్పు కలిగిన ఆహార పదార్థాలను ఇష్టపడతారు. ఇది ఉదరం మరియు జీర్ణాశయంలో జీర్ణం కావింపబడే వివిధ రకాల ఆహారంపై ఆధిపత్యం కలిగి ఉంటుంది. కావున ఈ రాశి వారు అజీర్ణవ్యాధి మరియు వాయు సంబంధ సమస్యతో బాధపడతారు. వీరు ఆహార విషయంలో జాగ్రత్త పడాలి.

సింహరాశి అధిపతి రవి. వీరు రుచిగల భోజన పదార్థాలు ఇష్టపడతారు. ప్రత్యేకంగా గోధుమతో చేసిన పదార్థాలు ఇష్టం. వివిధ రుచులు కలిగిన కూరలు, మిశ్రితమైన అవియెల్‌, పొంగల్‌ మరియు కూట్టు మొదలైనవి ఇష్టపడతారు. సింహరాశివారు గోధుమ పిండితో చేసిన సమోసాలు పెసర పిండితో తయారు చేసిన కేకులు ఇష్టపడతారు.

కన్యారాశి అధిపతి బుధుడు. జీర్ణవ్యవస్థపై ఆధిపత్యం కలిగి ఉండును. ఎక్కువగా తినడం లేదా వేళకాని వేళల్లో తినడం చేస్తారు. వీరు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు. రుచిగా ఉంటేనే  వీరు ఏ రకమైన ఆహారమైనా మితంగా తింటారు.

తులరాశి శుక్రుడు. పులుపు మరియు చేదు రుచులను ఇష్టపడతారు. వీరు సాధారణంగా మూత్ర వ్యవస్థతో బాధపడుతుంటారు. కిడ్నీలో రాళ్ళతో బాధపడతారు. వీటికి అధిగమించడానికి పచ్చి కాకరకాయ రసాన్ని త్రాగుతారు.

వృశ్చికరాశి అధిపతి కుజుడు. చేదు వస్తువులను ఇష్టపడతారు. తీపి పదార్థాలను ఇష్టపడతారు. జీవితంలో ప్రతి వారికి తీపి మరియు చేదు పదార్థాలను రుచి చూడవలసి వస్తుంది. ఎక్కువగా తీపి తింటే మధుమేహవ్యాధి వస్తుంది. వాటి నివారణ గురించి చేదు మందులు, కాకరకాయ లాటిం పదార్థాలు తీసుకోవాలి.

ధనుస్సు రాశి అధిపతి గురుడు. గురునికి తీపి పదార్థాలు అంటే ఇష్టం. వీరు శ్వాస సంబంధమైన వాధ్యులచే బాధపడతారు.  అతిగా తీపి పదార్థాలు తీసుకున్నచో కషాలు తాగి రోగాల బారినుండి విముక్తి పొందుతారు.

మకరరాశి అధిపతి శని. ఈ రాశివారు అన్ని రకాల ఆహార పదార్థాలను ఇష్టపడతారు. వీరు కూడా రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడతారు. వేడి పదార్థాలు తినాలనుకుంటారు.

కుంభరాశి అధిపతి శని. వీరు ఆదర్శవంతులైనందున ఏదైనా ఒక ప్రత్యేక ఆహారం కావాలని కోరుకోరు. ఒక పనిలో నిమగ్నమై ఉండటం వలన ఆహారంపై ఎక్కువ శ్రద్ధ చూపరు. ఆహారం జీవించడానికి మాత్రమే తీసుకుంటారు.

మీనరాశి అధిపతి గురుడు. ఈ జాతకులు ఉభయ గ్రహాల స్వభావాలు కనిపిస్తాయి. వీరికి నిద్రలేమి, అతిగా ఆలోచించడం వల్ల ఆంత్ర సంబంధ వ్యాధుల వల్ల అజీర్ణం మొదలైన వ్యాధులు వస్తాయి.

ఈ విధమైన లోపాలను చిన్నప్పినుంచే గుర్తించడం వల్ల ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకోవడం ద్వారా నివారణ పొందవచ్చు.

డా.ఎస్.ప్రతిభ

 

click me!