హోదాకు కేసీఆర్ సపోర్ట్, మోదీ హ్యాండిచ్చారు: జాతీయమీడియాతో వైఎస్ జగన్

By Nagaraju penumalaFirst Published Apr 4, 2019, 7:54 AM IST
Highlights

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు మద్దతుగా ఉంటారని కేసీఆర్ మాటిచ్చారని జగన్ స్పస్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25 మంది, తెలంగాణ నుంచి 17 మంది మెుత్తం 42 మంది ఎంపీలు కలిసి పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై నిలదీస్తే కచ్చితంగా కేంద్రం దిగిరావాల్సిందేనని చెప్పుకొచ్చారు. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారో వారితో ఎన్నికల తర్వాత కలుస్తామని స్పస్టం చేశారు. 

ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేసీఆర్‌ మద్దతుగా నిలిచారని తెలిపారు. అందుకు కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వైఎస్ జగన్. 

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు మద్దతుగా ఉంటారని కేసీఆర్ మాటిచ్చారని జగన్ స్పస్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25 మంది, తెలంగాణ నుంచి 17 మంది మెుత్తం 42 మంది ఎంపీలు కలిసి పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై నిలదీస్తే కచ్చితంగా కేంద్రం దిగిరావాల్సిందేనని చెప్పుకొచ్చారు. 

2014 ఎన్నికల్లో మోదీ ఫ్యాక్టర్‌ చంద్రబాబుకు కలిసి వచ్చిందన్నారు. అయితే ఆ ఫ్యాక్టర్ ఇప్పుడు పనిచెయ్యదన్నారు. జాతీయ స్థాయిలో మోదీ బాగా చేశారని ప్రచారం ఉందని కానీ ఏపీ విషయంలో మాత్రం మోదీ సరిగ్గా వ్యవహరించలేదన్నారు. 

ఐదేళ్లు మోదీ అధికారంలో ఉండి, అవకాశం ఉన్నప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని జగన్ మండిపడ్డారు. ఎన్నికల తర్వాత ఏపీకి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారితోనే ఉంటామని జగన్‌ స్పష్టం చేశారు. 

మోదీ, రాహుల్‌లలో ఎవరు బలమైన ప్రధాని అభ్యర్థి అవుతారని ప్రశ్నించగా జగన్‌ మోదీకే ఓటు వేశారు. రాహుల్‌ గాంధీ రెండు చోట్ల పోటీ చేయడంపై ప్రశ్నించగా ఆ అంశంపై తాను ఎలాంటి కామెంట్ చేయలేనన్నారు. అమేథీలో రాహుల్‌ పరిస్థితి అంత భద్రంగా లేదేమో అందుకే కేరళలోనూ పోటీ చేస్తుండవచ్చని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్. 

click me!