లెక్క చెప్పని ఆస్తులు ఎన్ని వేల కోట్లో: బాబుపై వాసిరెడ్డి ఫైర్

By Siva KodatiFirst Published Mar 24, 2019, 12:37 PM IST
Highlights

కుటుంబానికి ఆస్తులు లేనప్పుడు కోట్లాది రూపాయలు విలువ చేసే హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీని స్థాపించే శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

కుటుంబానికి ఆస్తులు లేనప్పుడు కోట్లాది రూపాయలు విలువ చేసే హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీని స్థాపించే శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ.

హైదరాబాద్ వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె... 1988లో తన కుటుంబానికి 77 ఎకరాల భూమితో పాటు రూ.2,25,000 ఆదాయం వస్తున్నట్లుగా ఆయన నాడు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

1999 ఎన్నికల్లో రూ. 7.50 కోట్ల ఆస్తులు చూపించారని, 2004 ఎన్నికల్లో రూ.20 కోట్లు, 2009లో రూ. 60 కోట్లు, తాజా ఎన్నికల్లో తన కుటుంబం పేరిట రూ. 1,042 కోట్లు ఆస్తులున్నట్లు సీఎం చూపించారన్నారు.

2014తో పోలిస్తే ఆయన ఆస్తి విలువ 500 రెట్లు పెరిగిందని పద్మ ఎద్దేవా చేశారు. చూపించిన ఆస్తే రూ.1000 కోట్లు ఉంటే.. చూపించని ఆస్తి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందోనని ఆమె సందేహం చేశారు.

చంద్రబాబు అధికారంలో హెరిటేజ్‌కు లాభాలు.. ప్రతిపక్షంలో ఉంటే నష్టాలు రావడం వెనుక రహస్యం ఏంటని పద్మ ప్రశ్నించారు. 2005లో పది కోట్లు నష్టం, 2007లో రూ.1.7 కోట్లు లాభం, 2009లో రూ.35 కోట్లు నష్టం, 2013లో కాంగ్రెస్ మద్ధతుతో హెరిటేజ్ మళ్లీ లాభాల బాట పట్టిందన్నారు.

2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత హెరిటేజ్ దశ పూర్తిగా మారిపోయిందన్నారు. 2014కు ముందు హెరిటేజ్ షేర్ ధర కేవలం రూ. 300 మాత్రమేనని, మూడేళ్ల తర్వాత రూ. 1303కు చేరిందని ఆమె గుర్తు చేశారు.

ఏ కంపెనీకి కూడా మూడేళ్లలో ఈ స్థాయి పెరుగుదల రాలేదని పద్మ తెలిపారు. దేశంలోనే అత్యంత సంపన్నమైన రాజకీయ నాయకుడు చంద్రబాబేనని ఆమె ధ్వజమెత్తారు. సదావర్తి భూముల కొనుగోలు వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని వాసిరెడ్డి ఆరోపించారు. 

click me!