
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఉదయం రాధా.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. నమ్మించి నట్టేట ముంచడం జగన్ కి ముందు నుంచీ అలవాటేనని రాధా ఆరోపించారు.
ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆశ చూపి అభ్యర్థులతో కోట్లు ఖర్చుపెట్టిస్తారని ఆయన ఆరోపించారు. తీరా ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తామంటూ మభ్యపెట్టడం జగన్‌కు పరిపాటిగా మారిందని చెప్పుకొచ్చారు. నవరత్నాలు ప్రకటించి ఏ రత్నం ఇవ్వాలో తెలియని అయోమయంలో జగన్ ఉన్నారని వంగవీటి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు.
కాగా... విజయవాడ సెంట్రల్ టికెట్ దక్కకపోవడంతో రాధా వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి వంగవీటి స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారు.