ఆ సీట్లకు నాన్ లోకల్స్: జాబితాలో చంద్రబాబు, పవన్, బాలయ్య

By Siva KodatiFirst Published Mar 22, 2019, 11:33 AM IST
Highlights

కొందరు నేతలు మాత్రం తమ సొంత నియోజకవర్గాలను కాదని వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ లిస్టులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హీరో నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. 

ఎంతటి వారికైనా మొదటి బలం, బలగం ఇళ్లే. అందుకే ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని భావిస్తారు. రాజకీయాల్లో ఉన్న చాలామంది తమ స్వగ్రామం ఎక్కడుంటే అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తారు. ఎందుకంటే వారి బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు అక్కడే ఉంటారు కాబట్టి అది తనకు బలంగా మారుతుందని.

అయితే కొందరు నేతలు మాత్రం తమ సొంత నియోజకవర్గాలను కాదని వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ లిస్టులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హీరో నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. 

నారా చంద్రబాబు నాయుడు:

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె. ఆయన సొంతూరు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. 1978లో తొలిసారి కాంగ్రెస్ తరపున చంద్రగిరి నుంచే ముఖ్యమంత్రి ఎన్నికయ్యారు.

అయితే 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చంద్రబాబు.. ఎన్టీఆర్ ప్రభంజనంలో ఓడిపోయారు. దీంతో ఆ తర్వాత కొద్దిరోజులకే టీడీపీలో చేరారు. 1985 ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయనను 1989లో చంద్రగిరి నుంచి పోటీ చేయాల్సిందిగా ఎన్టీఆర్ కోరారు.

అయితే అందుకు సీఎం ససేమిరా అని కుప్పంకు వెళ్లి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడు దశాబ్ధాలుగా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుప్పం నుంచే చంద్రబాబు పోటీ చేస్తూ వస్తున్నారు.

కానీ చంద్రగిరి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చివరికి కుమారుడు నారా లోకేశ్‌ను సైతం చంద్రగిరి నుంచి కాకుండా రాజధాని ప్రాంతంలోని కీలకమైన మంగళగిరి నుంచి బరిలోకి దింపారు. 


నందమూరి బాలకృష్ణ: 

హైదరాబాద్‌లో సెటిలైనా నందమూరి వంశం సొంతూరు కృష్ణాజిల్లా నిమ్మకూరు... ఈ గ్రామం నియోజకవర్గాల పునర్విభజన వరకు గుడివాడ నియోజకవర్గంలో ఉండటంతో అది నందమూరి కుటుంబీకులకు సొంత నియోజకవర్గం అయ్యింది.

తెలుగుదేశం పార్టీని స్ధాపించిన తర్వాత ఎన్టీఆర్ 1983, 1985 ఎన్నికల్లో గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అన్నగారు తన వేదికను హిందూపురానికి మార్చడంతో ఎన్టీఆర్ కుమారులైన హరికృష్ణ, బాలకృష్ణ అక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించారు.

2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు బాలయ్య ప్రకటించడంతో సొంత నియోజకవర్గమైన గుడివాడ నుంచి పోటీ చేయాలని నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కోరారు. అయితే బాలకృష్ణ మాత్రం హిందూపురం వైపే మొగ్గుచూపారు. తాజా ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే బాలయ్య పోటీ చేస్తున్నారు.

 

చిరంజీవి: 

తెలుగు సినీ పరిశ్రమను మకుటం లేని మహారాజులా ఏలిన మెగాస్టార్ చిరంజీవి 2008లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. చిరంజీవి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు.

ఇది నరసాపురం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆ ఎన్నికల్లో చిరు సొంత నియోజకవర్గం నుంచి కాకుండా పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేశారు. పాలకొల్లులో ఓడిపోయి, తిరుపతిలో గెలిచి పరువు కాపాడుకున్నారు.

 

పవన్ కల్యాణ్ : 

చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో నెంబర్‌వన్ హీరోగా ఎదిగారు. తెలుగునాట తిరుగులేని మాస్ ఫాలోయింగ్ పవన్ సొంతం. ఈ క్రమంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన పవర్‌స్టార్.. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్ధతు ప్రకటించారు.

తాజా ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆయన బీఎస్పీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈయన కూడా అన్నయ్య చిరంజీవి దారిలోనే సొంత నియోజకవర్గం నరసాపురంలో కాకుండా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి బరిలో నిలిచారు. 
 

click me!