తొలిసారి చంద్రబాబు ఒంటరి పోరు: పొత్తులతోనే సైకిల్ ప్రయాణం

By Siva KodatiFirst Published Mar 20, 2019, 1:03 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి జరిగిన ప్రతి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అయితే పార్టీ చరిత్రలో తొలిసారిగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ఒంటరిగా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు టీడీపీ పొత్తులను పరిశీలిస్తే.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి జరిగిన ప్రతి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అయితే పార్టీ చరిత్రలో తొలిసారిగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ఒంటరిగా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు టీడీపీ పొత్తులను పరిశీలిస్తే

1983లో తొలి సారిగా ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ అధ్యక్షురాలిగా ఉన్న సంజయ్ విచార్ మంచ్‌తో కలిసి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో మేనక పార్టీకి ఎన్టీఆర్ 5 అసెంబ్లీ స్ధానాలు కేటాయించారు.

ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన 1984 లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీ ఎదురొడ్డి నిలిచింది. ఆ ఎన్నికల్లో బీజేపీతో తొలిసారిగా తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. దేశం మొత్తం మీద కమలానికి రెండు సీట్లు లభిస్తే... అందులో ఒకటి ఏపీ నుంచే వచ్చింది. 

1989లో బీజేపీ వామపక్షాలతో కలిసి మరోసారి కూటమిని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. దేశవ్యాప్తంగా రాజీవ్ సుడిగాలి పర్యటన చేయడంతో దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా పడింది. ఆ ఎన్నికల్లో టీడీపీ సారథ్యంలోని కూటమి చిత్తుగా ఓడిపోయింది.

1994 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని పక్కనపెట్టిన ఎన్టీఆర్ కమ్యూనిస్టులతో జతకట్టారు. మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.

1995లో ఎన్నికల నాటికి టీడీపీలో సంక్షోభం తలెత్తడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో 1996 ఎన్నికల్లో టీడీపీ మరోసారి వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. కాంగ్రెస్, బీజేపీ‌లకు ప్రత్యామ్నాయంగా యునైటెడ్ ఫ్రంట్ పేరిట మూడో కూటమి రావడానికి చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. 

1998 మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. ఆ సమయంలో మిత్రపక్షాలతో కలిసి వాజ్‌పేయ్ తొలిసారి బీజేపీ తరపున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

1999లొ టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. దీపం పథకంతో పాటు చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలతో జనం తెలుగుదేశానికి పట్టం కట్టడంతో బాబు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడంతో పాటు కూటమికి భారీగా పార్లమెంట్ స్థానాలు దక్కాయి.

2004లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ కలిసి పోటీ చేశాయి. అయితే వైఎస్ పాదయాత్రతో పాటు కాంగ్రెస్‌ పవనాలు బలంగా వీయడంతో కూటమి ఓడిపోయింది. విభేదాలు రావడంతో బీజేపీకి టీడీపీ గుడ్‌బై చెప్పింది.

2009లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ... టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేశాయి. అయితే ఆ ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనంతో మరోసారి కూటమి విఫలమైంది.

2014 ఎన్నికల్లో బీజేపీకి మరోసారి దగ్గరయ్యారు చంద్రబాబు. రాష్ట్ర విభజన నేపధ్యంలో తెలంగాణ, ఏపీలో విడి విడిగా ఎన్నికలు జరిగాయి. టీడీపీ, బీజేపీకి జతగా జనసేన కలిసి రావడంతో ఏపీలో ఈ కూటమికి జనం బ్రహ్మారథం పట్టారు. దీంతో పదేళ్ల తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో సైతం టీడీపీ-బీజేపీ కూటమి చెప్పుకోదగ్గ స్థానాలు సాధించింది.

2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో చిరకాల రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్, టీడీపీలు చేతులు కలిపాయి. టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా సీపీఐ, తెలంగాణ జనసమితిలతో కలిసి మహాకూటమి ఏర్పాటయ్యింది. అయితే కేసీఆర్ చరిష్మాతో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చింది

click me!